ఘంటా కర్ణుడికి అష్టాక్షరీ మంత్రం ఉపదేశించినట్టు.(నానుడి కథ) ౼ దార్ల బుజ్జిబాబు

 'గుర్రాన్ని  నీళ్ల దగ్గరకు తీసుకెళ్లగలం కానీ నీళ్లు తాగించలేం' . అలాగే  'చెవిటి వాని ముందు శంఖమూదినట్టు'  ఇలాంటి సామెతే ఈ 'ఘంటా కర్ణుడికి అష్టాక్షరి మంత్రం ఉపదేశించినట్టు' నానుడి కూడా.  మొండి వారి చేత వారికి ఇష్టం లేని పనిని చేయించలేము అనే భావాన్ని తెలియజేసేటప్పుడు ఈ నానుడిని వాడతారు. ఇప్పుడొస్తున్న  ఆధునిక తెలుగులో ఇలాంటి పురాతన నానుడులు అరుదుగా కనిపిస్తున్నాయి. ఒకానొకప్పుడు ఈ నానుడి బాగా వాడినట్టు ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తుంది. అసలు ఈ నానుడి ఎలా పుట్టిందో, దాని  కథేంటో చూద్దాం.
         పూర్వం కర్ణుడు అనే బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. వాడు శివ భక్తుడు. ఒకసారి శివుని గూర్చి ఘోరంగా తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్ష్యం కాగానే పిశాచ గణాలపై ఆధిపత్యం కావాలని కోరాడు. సరే అని వరం ఇచ్చాడు ఈశ్వరుడు. ఇంకేముంది బూత,  ప్రేత, పిశాచాలను వెంటవేసుకుని అర్ధరాత్రుల్లో తిరగసాగాడు. కనిపించిన నరులు, జంతువుల పచ్చిమాంసాన్ని, పచ్చి రక్తాన్ని జుర్రుకోసాగాడు.
        అతడికి విష్ణువు అంటే పడదు. ఆ పేరు వినటానికి కూడా ఇష్టపడడు. అందువల్ల విష్ణువు భక్తులను ఎక్కువగా తింటూ ఉండేవాడు. ఎవరినైన చంపి తినేటప్పుడు ఆ వ్యక్తి విష్ణు భక్తుడై ఆఖరిమాటగా 'నారాయణ' అంటాడేమోనని, ఆ మాటలు విన వలసి వస్తుందని, వినిపించకుండా చెవులకు గంటలు కట్టుకున్నాడు. అందువల్ల అతడికి ఘంటాకర్ణుడు అనే పేరు వచ్చింది. అలాంటి విష్ణు ద్వేషికి అష్టాక్షరీ మంత్రమైన  'ఓమ్.. నమో నారాయణ'  మంత్రం ఉపదేశిస్తే ఎలా ఉంటుంది? ఫలితం ఉండదు కదా? ఆ మంత్రం ఉపదేశించే గురువు కోరి చావు తెచ్చుకోవడమే అవుతుంది కదా? ఈ లాంటి సాహసం ఎవరు చేయరు. 
      ఈ కథ ఆధారంగా ఈ నానుడి పుట్టింది. ఇలాంటి  సందర్భాలు ఎదురైనప్పుడు. ఈ నానుడి వాడుతూ వుంటారు. ఇష్టంలేని వానికి ఆపనినే  చేయమని చెబితే ఏమవుతుందో , చెప్పినా ప్రయోజనం ఉండదు.అని చెప్పాల్సి వచ్చినప్పుడు  ఈ నానుడి ప్రయోగిస్తారు. 


కామెంట్‌లు