మితి మీరి ఆడితే: - సిరికొండ శ్రీనివాస రాజు

    సోమూకి క్రికెట్ పిచ్చి. పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక రాత్రి దాకా, సెలవు రోజుల్లో రోజంతా స్నేహితుల బృందాన్ని తీసుకుని క్రికెట్ ఆడేవాడు. తల్లిదండ్రులు తిట్టినా కొట్టినా ఫలితం శూన్యం. చదువు ఏమీ రాదు. సోము మిత్రుడు రాము "ఒరేయ్ సోమూ! ఆటలు అంటే అన్ని రకాల ఆటలు ఉంటాయి. రకరకాల ఆటలను ఆడాలి. చదవాల్సిన సమయంలో చదవాలి. అస్తమానం క్రికెటేనా?" అని అడిగేవాడు. సోమూకు వెంటనే కోపం వచ్చేది. సోము చెల్లెలు అపర్ణ "ఒరేయ్ అన్నయ్యా! బయట ఎవరితోనో ఆటలు ఆడటం ఎందుకు? ఇంట్లో మనిద్దరం క్యారమ్స్, చెస్, పచ్చీస్, షటిల్ వంటి ఆటలు ఆడదామా? నువ్వు మీ స్నేహితులతో ఆడితే నాతో ఆడేవారు ఎవరు?" అని అడిగేది. "నీతోనా నేను ఆటలు ఆడేది. నీకేం వచ్చని? అలాంటి ఆశలు పెట్టుకోకు." అని చెల్లెలిని తీసిపారేసేవాడు. అపర్ణ చిన్నబుచ్చుకొనేది. 


       సోము పబ్లిక్ రోడ్లపై క్రికెట్ ఆడటం, ఆడేటప్పుడు ఆ బాల్స్ వేరేవారి ఇంట్లో పడితే గోడదూకి వాటిని తేవడం మామూలైంది. ఇంటిమీదికి గొడవలు తెచ్చేవాడు. ఒకసారి సోము తన జట్టుతో క్రికెట్ ఆడుతుండగా రనౌట్ విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి, సోము, భీము కొట్టుకున్నారు. సోము దెబ్బలతో ఇంటికి వచ్చాడు ‌ విషయం తెలిసి, తల్లిదండ్రులు సోమూను విపరీతంగా తిట్టారు. ఇంకెప్పుడూ క్రికెట్ ఆడవద్దని ప్రమాణం చేయించుకున్నారు. ఓ నాలుగైదు రోజులు చదువుపై ధ్యాస ఉంచాడు. ఆ తర్వాత రోజు నుంచి మామూలే. మిత్రబృందంతో మళ్ళీ క్రికెటే! సోము కొట్టిన "సిక్స్"కు బాల్ వెళ్ళి, ఎదురుగా ఉన్న ఖరీదైన భవనపు అద్దాలను పగులగొట్టింది. వాళ్ళు వచ్చి, సోమూను చితగ్గొట్టారు. మిగతా మిత్రులంతా పరార్! సోము వాళ్ళ తల్లిదండ్రులు నష్ట పరిహారాన్ని చెల్లించాల్సి వచ్చింది. ఇంటివద్ద సోమూకు తండ్రితో మళ్ళీ దెబ్బలే! నాలుగైదు రోజులు సోమూను ఇంట్లోనే కట్టేశారు. "అమ్మా! ఇంకెప్పుడూ క్రికెట్ ఆడనమ్మా! బుద్ధిగా రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి, అతనితో కలిసి చదువుకుంటా!" అని బ్రతిమిలాడాడు. ఓ నాలుగైదు రోజులు రాము వాళ్ళింటికి వెళ్ళి, రాముతో కలిసి చదువుకున్నాడు. ఆ తర్వాత కుక్క తోక వంకర మాదిరే! 


       సోము తన మిత్రుడు రంగను కలిసి, "ఒరేయ్ రంగా! నువ్వు బ్యాట్, బాల్ తీసుకొని రా! రేపు దూరంగా ఎక్కడైనా క్రికెట్ ఆడుదాం." అన్నాడు. మరునాడు ఆదివారం. సోము తల్లితో "అమ్మా! నేను రాము వాళ్ళ ఇంటికి చదువుకోవడానికి వెళ్తున్నా!" అని చెప్పి, బుద్ధిగా పుస్తకాలు తీసుకుని బయలుదేరాడు. రంగ సోమూను కలిశాడు. ఇద్దరూ చాలా దూరం వెళ్ళారు. ఒకచోట మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు కొందరు. అక్కడే సోము, రంగలు ఆట మొదలు పెట్టారు. అక్కడే ఉన్న మరికొందరు పిల్లలు సోము, రంగాలతో ఆడుతామంటూ వీరి జట్టులో చేరారు. రంగ తెచ్చిన బాల్ బరువైనది. సోము బ్యాటింగ్. సోము భారీషాటుకు ప్రయత్నించాడు. ఆ బాల్ వెళ్ళి మైదానంలో సుందర్ అనే అబ్బాయి తలకు బలంగా తగిలింది. తీవ్ర రక్తస్రావంతో సుందర్ కుప్పకూలాడు. సోము, రంగలు కాలికి బుద్ధి చెప్పారు. సోము ఎవరికీ దొరకకుండా ఓ పెద్ద చెట్టు చాటున చేరాడు. ఓ రాత్రివేళ ఇంటికి చేరాడు. ఆసుపత్రిలో చికిత్స పొందిన సుందర్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ విషయం సోమూకు తెలియదు. ఇంటికి చేరిన సోము ఆ రాత్రి భయం భయంగా గడిపాడు. మరునాడు ఎంతో టెన్షన్ పడ్డాడు. సుందరుకు ఏమైందో, తన జాడ పట్టుకొని వచ్చి, పోలీసులు తీసుకుని వెళ్ళడం ఖాయం. లేదా సుందర్ తల్లిదండ్రులు తన ఇంటికి వచ్చి, గొడవ వేసుకుంటే, అమ్మా నాన్నలతో చావు దెబ్బలే! 


       సోము తన తల్లి దగ్గరకు వచ్చి, "అమ్మా! నేను ఇక్కడ చదువుకోను. రామూతో కలిసి చదువుతున్నా ఏమీ అర్ధం కావడం లేదు. కొన్నాళ్ళ పాటు పెద్దమ్మ ఇంటికి వెళ్తా! శ్రావణితో కలిసి చదువుకుంటా!" అని అన్నాడు. సోము, శ్రావణిలు అక్కాచెల్లెళ్ళ పిల్లలు. సమ వయస్కులు. క్లాస్ మేట్స్. అయితే శ్రావణి బాగా తెలివైనది. తన తరగతిలో ఎప్పుడూ ఆమెదే ఫస్ట్ ర్యాంక్. "సోమూ! నువ్వు బాగుపడతానంటే నేను కాదంటానా? వెళ్ళు, కానీ శ్రావణితో పోటీపడి బుద్ధిగా చదవాలి. సరేనా?" అన్నది సోము వాళ్ళ అమ్మ. సోము ఇప్పటికైనా చదువుపై ధ్యాసపెట్టి, అమ్మకు నమ్మకం కలిగిస్తే తన తప్పులు ఏమైనా తెలిస్తే క్షమిస్తుందని భావించాడు. క్రికెట్ పిచ్చి ఎంత నష్టాన్ని కలిగించిందో అనుకున్నాడు. ఇకపై పూర్తిగా చదువుపై ధ్యాస పెట్టాలని అనుకున్నాడు. తీరిక సమయంలో అన్ని రకాల ఆటలపై దృష్టి పెట్టాలని అనుకున్నాడు. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి చేరాడు. సోము కోరిక విని, శ్రావణి ఎంతో సంతోషించింది. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. సోము సందేహాలను శ్రావణి నివృత్తి చేసేది. కొద్ది కాలంలోనే సోము తెలివైన విద్యార్థి అయినాడు. కొంతకాలం తర్వాత తిరిగి తన పాఠశాలకు వచ్చాడు. సోము తెలివి తేటలను చూసిన ఉపాధ్యాయులు ఎంతో ఆశ్చర్యపోయారు. ఇంటి పట్టున ఉంటూ సోము బాగా చదవడమే గాక తీరిక సమయాల్లో చెల్లెలు అపర్ణతో కలిసి రకరకాల ఆటలను ఆడుతున్నాడు.