అమ్మ భాష గొప్పదనం --వేముల ప్రేమలత--హైదరాబాద్
 ఏమని వర్ణించనూ......అమ్మ భాష తెలుగు  కమ్మనైన భాషను
ఉగ్గుపాల తేనె రంగరించినట్టి తీయని భాష 
దేశ భాషలందు లెస్స తెలుగు భాష
అని శ్రీ కృష్ణ దేవరాయలు నుడివినాడు
ప్రపంచం లోని మేధావులంతా మెచ్చిన భాష
పొరుగు రాష్ట్ర కవులు కూడా పొగిడిన భాష
కవిత్రయం రచనల్లో.. శ్రీనాథుని ఘంటంలో
కూచిపూడి నాట్యంలో, త్యాగరాయ కీర్తనలో 
అల్లురి దేశభక్తి లో, పొట్టి శ్రీరాములు త్యాగ నిరతి లో
కాకతీయుల పౌరుషంలో , వేమన పద్యాల్లో 
అన్నమయ్య కీర్తనల్లో, కందుకూరి, చిలకమర్తి రచనల్లో
గిడుగు భాష సేవలో.. కాళోజీ కవితల్లో
ఎంకి పాటల్లో, సంక్రాంతి గొబ్బెమ్మ ల్లో
విశ్వనాథ రామాయణ కల్ప వృక్షం లో
సినారే జ్ఞానపీఠ విశ్వంభర లో
 అచ్చ తెలుగు తొణికిసలాడుతుంది
అమ్మ నాన్న అనే పిలుపుల్లో అనురాగం  తెలుగే
 అక్కా చెల్లి అన్న పిలుపుల్లో  మాధుర్యం  తెలుగే
నేడు ఉన్నత చదువుల కోసం పరభాష అవసరమే  
ఎక్కడికి వెళ్ళినా నీ భాషలోనే సంభాషించు
మనం ఎంత అభివృద్ధి పథంలో నడిచినా మన భాషను, ఆచారాలను మరువకూడదు