ఉదర నిమిత్తం బహు కృత వేషం: - ఎం. బిందు మాధవి


"ఉదర నిమిత్తం బహు కృత వేషం"


"అమ్మాయిని చదివిద్దామయ్యా" అన్నది బాలమణి


"అది సదూకోడానికెల్తే నీకు సేతికింద సాయమెవరు సేత్తారే? గొప్పోల్ల మాటలు సెప్పమాకే. సదువులంటే, తింటానికి నాలుగేళ్ళునోట్లోకెల్లే ఆల్ల మాటలు" అన్నాడు వీరయ్య.


"నేను ఎట్టాగొట్టా సూసుకుంటాలే" అని బీసీ రిజర్వేషన్ వస్తుంది.. ఫీజ్ భారం ఉండదని గవర్మెంట్ స్కూల్ కి పంపించింది దుర్గని.


దుర్గ చదువులో చురుకైంది. ఎప్పుడూ క్లాసులో ఫస్టే!

అందుకే మేస్టార్లకి దుర్గంటే అభిమానం.

అలా మాస్టార్ల సాయంతో టెంత్ పాస్ అయ్యాక, ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఎంసీయే లో చేరింది.


తోటి ఫ్రెండ్స్ తో నోటి మంచితనంతో పుస్తకాలు ఎక్కువగా కొనుక్కో అవసరం లేకుండా కొంత ...లైబ్రరీల్లో ఎక్కువ సేపు కూర్చుని చదువుకోవడం ద్వారా కొంత... చదువు పూర్తి చేసి క్యాంపస్ సెలెక్షన్ లో "యాక్సెంచూర్" కంపెనీలో ఉద్యోగంలో చేరింది.


బాలమణి "సూసావా అయ్యా, నేంజెప్పలా..పిల్ల సురుకయింది! కూసింత కష్టపడితే దాని కాళ్ళమీద అది నిలబడి నలుగురికి దారి సూపిత్తాది అని" అన్నది.


దుర్గ ఉద్యోగంలో చేరాక బాలమణి-వీరయ్య అప్పటివరకు చేసిన ఇళ్ళల్లో పనులు మానేసి, ఇంటిదగ్గరే కూరగాయల దుకాణం నడుపుకుంటున్నారు.


రెండేళ్ళు బాగానే నడిచింది.


ఉన్నట్టుండి పెను ఉప్పెన లాగా మానవాళి మీద పడిన మాయదారి కరోనా మూలాన ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైన నేపధ్యంలో కంపెనీకి ప్రాజెక్ట్స్ రావటం తగ్గింది. ఉద్యోగులని కొంతమందిని తీసేస్తున్నాం అని ప్రకటించింది. తీసేసే ఉద్యోగస్థుల్లో ఉన్న దుర్గ ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా..ఇంటిదగ్గర ఉన్న ఒక బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్ గా చేరింది.


ఒకరోజు మంగ తువ్వాళ్ళు, పంచెలు కొనటానికి ఆ షాప్ కి వచ్చి, "ఈ షాప్ కొత్తగా పెట్టారా అమ్మా? ఇంతకు ముందు ఇక్కడ స్టీల్ సామాను అమ్మేవారు అని దుర్గతో ఆ మాటా..ఈ మాటా మాట్లాడుతూ...ఇక్కడికి దగ్గరలో ఉన్న నాకు తెలిసినవాళ్ళు బ్లౌజుల మీద మగ్గం వర్క్ చేసేవాళ్ళ కోసం అడిగారు..వాళ్ళని పంపిస్తాను" అన్నది.


అలా సేల్స్ గర్ల్ గా ఉంటూనే ఎంబ్రాయిడరీ నేర్చుకుని, రాత్రుళ్ళు ఇంటిదగ్గర ఆ పని చేసేది.


లాక్ డౌన్ వల్ల షాప్ సరిగా నడవక సేల్స్ గర్ల్స్ ని తీసేశారు.


దుర్గ పగలు అమ్మా-నాన్న తో పాటు తమ కూరగాయల దుకాణంలో కూర్చుంటూ, రాత్రుళ్ళు తమ ఇంటికి దగ్గరగా ఉన్న కాంప్లెక్స్ లో ట్యూషన్లు చెప్పటం మొదలుపెట్టింది. దుర్గ మ్యాత్స్ చెప్పే విధానం నచ్చి చుట్టుపక్కల ఇంకా కొంతమంది తమ పిల్లల్ని ఆ కాంప్లెక్స్ కే వచ్చి దింపివెళతూ ఉండేవారు.


ఒక రోజు మనవడిని ట్యూషన్లో దింపటానికి వచ్చిన వెంకటరామయ్య గారు దుర్గని చూసి "నిన్నెక్కడో చూసినట్లుందమ్మా! గుడి పక్కన ఉన్న కూరల దుకాణంలో ఉదయం దోసకాయలు తూచి ఇచ్చింది నువ్వే కదా! మరి......"అని సందేహంగా మొహం పెట్టారు.


"అవును సర్ నేనే. ఆ దుకాణం మాదే. ఉదయం అమ్మా-నాన్నకి తోడుగా అక్కడ కూర్చుంటాను" అన్నది.


"మరి పెద్ద క్లాస్ పిల్లలకి ట్యూషన్ చెప్పటమేమిటి? ఇంతకీ ఏం చదువుకున్నావ్?" అనడిగారు.


దుర్గ తన కధ అంతా..ఎంసీయే చదువు, సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఇప్పుడున్న పరిస్థితికి నేపధ్యం..అన్నీ చెప్పి "తప్పా సర్" అనడిగింది.


"దొంగతనం, వ్యభిచారం చెయ్యకుండా..నలుగురితో వేలెత్తి చూపించుకోకుండా, గౌరవంగా బ్రతకటానికి ఏం చేసినా తప్పు లేదమ్మా!" అన్నారు.


"మన కాలనీ గుడి లో ఉండే ఆచారి గారు ఉదయం-సాయంత్రం అర్చకత్వం చేస్తారు. గుడి పనయ్యాక..ఆయన భార్య కలిసి ఈ కాలనీ వారికి కావలసిన స్వీట్స్ ,అప్పడాలు-వడియాలు తయారు చేసి ఇస్తూ ఉంటారు."


"ఎవరికైనా పెద్ద వంటలు అవసరమైతే వారికి సహాయంచెయ్యటం, ఇంట్లో వెట్ గ్రైండర్ పెట్టుకుని ఇడ్లీ-దోశ పిళ్ళు రుబ్బి సూపర్ బజార్ కి ప్యాకెట్స్ సప్లై చెయ్యటం లాంటి పనులు చేస్తూ ఉంటారు."


"వారబ్బాయి పవన్ నీకు తెలుసనుకుంటా... అప్పుడప్పుడు ఆచారి గారితో కలిసి గుళ్ళో అర్చకత్వం చేస్తూ ఉంటాడు! బయట వారికి కావలసిన చిన్న చిన్న పూజలు, పుణ్యా:వచనాలు, మాస శివరాత్రి అభిషేకాలు చేయిస్తూ ఉంటాడు. ఈ పనులేమీ లేనప్పుడు... మధ్యాహ్నం టైంలో డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తాడమ్మా! అప్పుడప్పుడు గ్జిరాక్స్ సెంటర్ లో కూడా పని చేస్తాడు. మొన్నీ మధ్య


"కాంప్లెక్స్ ల్లో వారు ఉద్యోగాలకి వెళ్ళి నప్పుడు, వృద్ధులని హాస్పిటల్ కి తీసుకెళ్ళి తీసుకురావటం, సూపర్ బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చి పెట్టటం, రైతు బజార్ కి వెళ్ళి కూరలు తెచ్చిపెట్టటం... లాంటి సహాయాలుచేస్తూ దాని ద్వారా కూడా ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటాడు. చెప్పిన పని నమ్మకంగా చేస్తాడని ఈ చుట్టుపక్కల వారు...డోర్ సర్వీస్ చేసే స్విగ్గీలు, ఊబర్లు ఉన్నా.... అతన్ని అన్ని పనులకి పిలుస్తారు. అతను కూడా ఎవ్వరికీఇబ్బంది లేని చార్జీలే పుచ్చుకుంటాడు.


"పుణ్యం-పురుషార్ధం" రెండూ నెరవేరతాయి. ఈ రోజుల్లో ఖర్చులు భరించాలంటే వచ్చే జీతాలు చాలవు. ఇలాగే ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గాలు తప్పవమ్మా!"


"ఉదర నిమిత్తం బహుకృత వేషం" తప్పదు అన్నారు.


"రేపొకసారి వచ్చి కలువమ్మా. మా అబ్బాయి కంపెనీలో ఏవో ఖాళీలున్నాయిట. స్టార్టప్ కంపెనీ! అందుకని జీతం ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు, కానీ నీ చదువుకు తగ్గ ఉద్యోగం అవుతుంది" అని వెంకట్రామయ్య గారు, ఒక మంచి పని చెయ్యటానికి దోహదపడ్డానన్న తృప్తితో వెనుతిరిగారు.