ఎప్పుడు సంపద కలిగిన: ఎం. బిందు మాధవి

 ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు

బంధువులు వత్తురది యెట్లన్నన్

తెప్పలుగ చెరువు నిండిన కప్పలు

పదివేలు చేరు గదరా సుమతీ"


మనిషికి సిరి సంపదలు కొత్తగా కలిగినప్పుడు, ఉద్యోగపు హోదాలు పెరిగినప్పుడు ......అంతకు ముందు ఎరగని బంధుత్వాలు గుర్తు చేస్తూ చుట్టాలు ఎగబడి వీరి యోగక్షేమాలు తమకెంతో ముఖ్యమన్నట్లు ప్రవర్తిస్తారు.


అది చూడటానికి ఎలా ఉంటుందంటే వర్షాకాలంలో చెరువులు నీటితో నిండినప్పుడు అప్పటివరకు ఎక్కడో తలదాచుకున్న కప్పలు వేలు వేలుగా ఆ చెరువుల్లోకి చేరతాయి.


ఆ విషయమే కవి గారు పద్యంలో ఆవిష్కరించిన భావాన్ని ఈ కధ ద్వారా విపులంగా తెలుసుకుందాము.


**********


వెంకట్రావు, కూర్మా రావు రామకృష్ణాపురం కాలనీ లో ఉంటున్నారు.


కూర్మా రావు ఒక ప్రభుత్వ రంగ సంస్థ లో చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు.


ఆ కాలనీ లే ఔట్ వేసినప్పుడు వీళ్ళిద్దరూ అక్కడ స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. ఉద్యోగాల్లో ఇద్దరి స్థాయి మొదట్లో ఒకేలాగా ఉండేది. కాబట్టి ఇద్దరి ఇళ్ళు ఇంచు మించు ఎగువ మధ్య తరగతి ఇళ్ళ లాగే ఉండేవి.


క్రమేణా కూర్మా రావు తన ఉద్యోగంలో బాగా ఎదిగాడు. అందుకు తగ్గట్టు అతని సంపాదన, హోదా కూడా పెరిగాయి. ఆఫీస్ వాళ్ళు కారు కూడా ఇచ్చారు. ఇతను ఆఫీస్ కి వెళ్ళి రావటానికే కాక, ఇంట్లో వారి షాపింగ్ లాంటి ఇతర అవసరాలకి కూడా ఆఫీస్ కారే వాడుకునే సౌకర్యం ఇచ్చారు ఆఫీస్ వారు.


వెంకట రావు పెద్దగా ఎదుగు, బొదుగూ లేకుండానే రిటైర్ అయ్యాడు.

కానీ పక్క పక్క ఇళ్ళవటం వల్ల అంతరాలు లేకుండా స్నేహం గానే ఉండే వారు. ఇద్దరి పిల్లలు కూడా స్నేహం గా ఉండే వారు. ఇంచు మించు ఒకే వయసు వారు అవటం వల్ల కలిసి తిరుగుతూ ఉండేవారు.


ఒక రోజు కూర్మా రావు గారింట్లో ఒకటే సందడి, హడావుడి. వచ్చే జనం, పోయే జనం.


వెంకట్ రావు కొడుకు మధు, తల్లితో 'అమ్మా ఇవ్వాళ్ళ పక్కింటి వేణు, నేను కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్ళాలనుకున్నాము. కానీ పొద్దుటి నించీ వాళ్ళింట్లో ఒకటే హడావుడి. కార్లల్లో జనాలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉన్నారు. ఫోన్ చేస్తే వేణు దొరకలేదు. అసలు ఇంట్లో ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు. ఏమై ఉంటుంది' అని అడిగాడు.


'అవునురా, ఇన్నాళ్ళ నించీ పక్కనే ఉన్నాం. ఇప్పుడు వచ్చిన వారిని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. బహుశా ఆవిడ తరపు బంధువులేమో' అని ఊరుకున్నది.


మరు నాడు కాస్త ఖాళీ దొరికినప్పుడు వెంకట్రావు భార్య రాజ్యలక్ష్మి కూర్మా రావు ఇంటికి వెళ్ళి మాటల మధ్యలో 'వదినా ఏమిటి నిన్నంతా మీ ఇంట్లో ఒకటే హడావుడి. వనజకి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? వచ్చిన వారు పెళ్ళి వారా? అని అడిగింది.


కూర్మా రావు భార్య లక్ష్మి నవ్వుతూ 'కాదు వదినా, మా వారి దూరపు చుట్టాలెవరో, వారబ్బాయి ఉద్యోగానికి మా వారి సిఫారసు కావాలని వచ్చారు. వారు ఏకంగా 4-5 రోజులు ప్లాన్ చేసుకుని వచ్చి ఎలాగూ వచ్చాం కదా, ఈ ఊరు చూసి వెళతాం అని ఇప్పుడే అలా బయటికి వెళ్ళారని' చెప్పింది.


'ఓహో ఈ రోజుల్లో, నాలుగు రోజులు పై మనుషులని సిటీల్లో భరించటం అంటే మాటలు కాదు. ఏదో కావలసిన వారే అయి ఉంటారు' అన్నాడు, వెంకట్రావు భార్య రాజ్యలక్ష్మి చెప్పింది విన్నాక!


'ఎబ్బే కాదండీ, 'పెద్ద ' దగ్గర చుట్టాలేమీ కాదుట. అన్నయ్య గారి సిఫారసుతో వారబ్బాయికి ఉద్యోగం వేయించుకోవటానికి వచ్చారుట. వీరి హోదా, ఇంట్లో సౌకర్యాలు చూసి వీరి అనుమతి కోసం ఎదురు చూడకుండా, 4-5 రోజులు ఉండి ఊరు చూసి పోవాలని వారికి వారే నిర్ణయించుకున్నారుట. అదీ విషయం' అని రాజ్యలక్ష్మి చెప్పేటప్పటికి,


వెంకట్రావు 'డబ్బు మహిమోయ్, చూశావా ఇన్నాళ్ళు ఏమైపోయారో వీళ్ళంతా? ఆ మధ్య లక్ష్మి జబ్బు చేసి మంచానికి కరుచుకుని 15-20 రోజులు పడకేస్తే, ఈ పక్కకి తొంగి చూసిన వాళ్ళు లేరు. కూర్మా రావు రెండేళ్ళు పొరుగూరు బదిలీ అయి పిల్లలతో లక్ష్మి ఒక్కతే అవస్థ పడుతుంటే సాయం వచ్చి ఉన్న వారు లేరు. ఇప్పుడు ఎక్కడలేని ఆప్యాయత ప్రదర్శిస్తూ, చుట్టరికాలు తిరగేస్తూ ఏకంగా 4-5 రోజులు ఉండి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు.' అంటూ


"ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు

బంధువులు వత్తురు .........


అని మనం చిన్నప్పుడు చదువుకోలేదా? అది ఇదే అంటూ ముగించాడు.