తెలుసుకానీ...తెలీదు: -- యామిజాల జగదీశ్

 రెండు రోజుల క్రితం అరవై ఏడులోకి అడుగుపెట్టినప్పుడో విషయం తెలుసుకున్నా ఓ చిన్నమ్మాయితో..... మరొక్క రోజులో ఉద్యోగం మానేసేబోతున్న డ్రైఫ్రూట్స్ షాప్ లో రోజూ దేవుడికి పువ్వులు పెట్టి దీపం వెలిగించే అవకాశం కల్పించిన దరిమిలా రోజూ పువ్వులు కోసుకెళ్తున్నాను. ఇంటి గుమ్మంలో పారిజాతం, నందివర్ధనం చెట్లున్నాయి. ఈ చెట్ల ‌ పువ్వులు కోసుకెళ్ళడం అలవాటు. అలాగే నా పుట్టింరోజైన డిసెంబర్ 28న కూడా పువ్వులు కొయ్యడానికి వెళ్ళేసరికి అక్కడ మూడో క్లాస్ చదువుతున్న శ్రావ్య అనే అమ్మాయికూడా పువ్వులు కోయడానికి నిల్చుంది. నన్ను చూడగానే గుడ్ మార్నింగ్ అని నవ్వగా నేనూ నవ్వాను. అంతకుముందులాగే నేను పారిజాతం చెట్టులో ఉన్న పువ్వులను కోస్తుంటే శ్రావ్య "అంకుల్ ! పారిజాతం పువ్వులు కోయకూడదు అంకుల్. నేలమీద రాలినవే తీసుకోవాలి" అని మృదువుగా చెప్పింది. నిజమే....తను చెప్పడం....పారిజాతం పువ్వులను నా చిన్నప్పుడు నేల మీద రాలిన పువ్వులనే సేకరించి పూజకు తీసుకొచ్చేవాడిని. కానీ ఎందుకు కోయకూడదో కారణం తెలీలేదు అప్పట్లో.  ఎవరూ చెప్పనూ లేదు. కనుక ఇప్పుడూ కొమ్మకున్న పువ్వులనే కోస్తూ వచ్చాను. కోయకూడదని చెప్పడమైతే చెప్పింది కానీ శ్రావ్యకు కారణం తెలీలేదు. సరే తను చెప్పిన తర్వాత పారిజాతం పువ్వుల్ని కోయడం మాని నేల రాలిన పువ్వులనే సేకరించాను. 
ఇంతకూ ఎందుకు కోయకూడదో తెలుసుకోవాలనిపించి అంతర్జాలంలో అన్వేషించాను. అప్పుడు తెలిసింది కారణం. సత్యభామ ఇంట ఈ చెట్టు ఉండటం కథ పూర్వాపరాలతోపాటు తెలిసిందేమిటంటే దేవలోకానికి చెందిన పొరిజాతం చెట్టులోని పువ్వులు తనంతట తాను నేల రాలినప్పుడు మాత్రమే పూజకు అర్హమని తెలిసింది. 
మొత్తం ఈ పుట్టింరోజున ఈ విషయం తెలుసుకోవడానికి కారకురాలైన శ్రావ్యకు అభినందనలు చెప్పాను.