వేసవి సానీయం “కిసాన్”: --డా.. కందేపి రాణీప్రసాద్.

 
ఎలిమెంటరీ స్కూలు నుంచి హైస్కూలు చదువుకు ప్రమోట్ అవడం అంటే ఏ మెడిసన్ లోనే, ఐఐటీలోనే చేరినట్లుగా ఫోజు పెట్టేవాళ్ళం. హైస్కూల్లో టీచర్లు చాలా స్ట్రిక్ట్ అని, కోపం వస్తే అరచేయి తిరగతిప్పి స్కేలుతో కొడతారనీ, అప్పుడప్పుడూ తొడపాశం పెడతారనీ, ఐదవ తరగతి అయిపోయాక సెలవుల్లో మా సీనియర్ల నుంచి తెలుసుకున్న విషయాలు. హైస్కూలు కదా చాలా చదువుకునేవి ఉంటాయి కాబట్టి ఈ ఐదవ తరగతి సెలవుల్లోనే ఆడుకునేవన్ని ఆడుకోవాలని అనుకున్నాం. ఎండాకాలం కాబట్టి ఉదయం, సాయంత్రం మాత్రమే బయట తిరగాలని, మధ్యాహ్నాలు ఇళ్లలోనే ఉండాలని పెద్ద వాళ్ళు చెప్పేవాళ్ళు. అందుకే ఎక్కువగా ఇంట్లో ఆడుకునే ఆటలు మాత్రమే ఆడుకోవాల్సి వచ్చేది. ఇంట్లో ఆడుకునే ఆటల్లో ఎక్కువగా పాముపటం, పచ్చీసు ఆడేవాళ్ళు. ఈ ఆటల్లో ఒక్కసారి ఇంట్లోని పెద్దవాళ్ళు కూడా చేరేవాళ్లు. ఈ రెండు అందరిళ్ళలో ఆడుకునేవారు. మా ఇంట్లో క్యారంబోర్డు, చెస్బోర్డు కూడా ఉండటంతో స్నేహితులు అందరూ మా ఇంటికే వచ్చేవారు. మా తమ్ముడు అప్పటికి ఏడాది వయసు వాడు. మేం చెస్ బోర్డుమీద బ్లాక్ కాయిన్స్, వైట్ కాయిన్స్ అనీ పెట్టుకొని ఆట మొదలుపెట్టేవాళ్ళం. ఆట మంచి రసపట్టులో ఉండగా అందరి దృష్టీ అటమీదే ఉన్నప్పుడూ మా తమ్ముడు మెల్లగా దోగాడుకుంటూ వచ్చి చెస్ బోర్డు మీది కాయిన్స్ నన్నింటిని రెండు చేతులూ పెట్టి అటూఇటూ చెల్లాచెదురు చేసేవాడు. మొత్తం కాయిన్స్ ఎటో పడిపోయేవి. ఇదే సమయానికి ఆటలో ఓడిపోయే ఛాన్స్ ఉన్నవాళ్ళు ‘ నా గుర్రం ఇక్కడున్నది, నా ఏనుగు అక్కడున్నది’ అంటూ తప్పు స్థానాలు చూపించేవాళ్ళు. ఆ దెబ్బతో ఆట మానేసి ‘అది అలా కాదు, ఇది ఇలా కాదు’ అంటూ వాదించుకునే వాళ్ళం. అప్పటికి అటనాపి మధ్యాహ్నం వాడు పాలు తాగి నిద్రపోయిన తర్వాత క్యారంబోర్డు ఆడదామని నిర్ణయించుకునేవాళ్ళం. మధ్యాహ్నం వాడు వరండాలోని ఊయలలో నిద్రపోయాక మేమందరం క్యారంబోర్డును నడవాలో పెట్టుకొని ఎవరెవరం జట్టుగా ఉండాలో నిర్ణయించుకొని, నడవా తలుపులు మూసుకొని కూర్చునేవాళ్లం. ఆట మొదలుపెట్టి ‘నాకెన్ని కాయిన్స్ వచ్చాయి, నాకెన్ని వచ్చాయి’ అని లెక్క చూసుకుంటూ, రెడ్ కాయిన్ ఎవరికోస్తుందా అని ఉత్సాహంతో చూస్తుండగానే మా తమ్ముడు వచ్చి క్యారంబోర్డు ఎక్కి మధ్యలో కూర్చునేవాడు. ఎప్పుడు వచ్చేవాడో ఎలా వచ్చేవాడో ఎవరమూ చూసే వాళ్ళం కాదు. వాడు ఊయల్లోంచి ఎలా దిగాడో, తలుపులు ఎలా తీసి ఉన్నాయో ఏమి అర్థమయ్యేది కాదు. వాడు వచ్చాక అటసాగటం అన్నది కలలో మాట. అలా ఎండాకాలల్లోని మధ్యాహ్నపు ఆటలకు మా తమ్ముడు అడ్డు తగుళ్తూ ఉండేవాడు. ఇలా ఆటలు కోసం ప్రయత్నాలూ, అడ్డంకులతోనే సాయంత్రం అయ్యేది.
సాయంత్రం నాలుగవుతుండగానే సోడాల బండి వాళ్ళు వచ్చేవారు. ఆ సమయానికి స్త్రీలు చెర్లోంచి నీళ్ళు తెచ్చుకుంటూ, ఇళ్ల ముందు నీళ్ళు చల్లి సందె ముగ్గులు పెట్టుకుంటూ ఉండేవారు. ఇంతకీ చెప్పనే లేదు కదూ. మా ఇల్లు చెరువుకు పక్కగానే ఉంటుంది. సోడాబండి రావటం ఆలస్యం. అందరూ ఇళ్ళలో నుంచి బయటికి వచ్చి సోడాలు తాగుతూ గొంతు చల్లబరుచుకునేవారు. మా నాన్న స్కావ్ లాంటిదేదో తెచ్చాడు గుంటూరు నుంచి. అది కిసాన్ కంపెనీ వాల్లదేమో నాకు తెలియదు కానీ మేము దాన్ని ‘కిసాన్’ అని పిలిచే వాళ్ళం. దాని మీద ‘కిసాన్’ అని రాశి ఉండేది. ఈ రోజుల్లోని ‘రస్నా’ లాగా అది కూడా నీళ్ళలో కలుపుకొని తాగాలి. సోడా ఒక గ్లాసులో పోసుకొని కిసాన్ కొంచెం వేసుకొని తాగితే గోల్డ్ స్పాట్ వలె ఉండేది. ఈ కిసాన్ రోజు తాగి తాగి ఎంత పని చేసిందంటే హిందీ పరీక్షల్లో ‘కిసాన్’ కు తెలుగు అర్థం రాయమని అడిగితే ‘సోడాలో కలుపుకొని తాగే రసం’ అని ఆన్సర్ రాసేంత.
ఏంటి దీని వెనక కథ అంటే మేము చదువుకునే రోజుల్లో హింది భాషను ఆరవతరగతిలో ప్రవేశపెట్టేవారు. అప్ప్తి వరకూ హిందీ రాడేవారికీ. ఆరవతరగతిలో హిందీనేను బాగా చదువుతానని పేరుండేది. దానికి కారణం మా అమ్మ. మా అమ్మ హిందీ బాషలో ‘ప్రవేశిక’ దాకా చదవడం వల్ల నాకు హిందీ నేర్పించేది. ఆ పల్లెటూర్లో మాస్టారికి తప్ప హిందీ వేరెవరికి రాదు. అలా నేనేదో క్లాసులో మాస్టారడిగిన రెండు మూడు ప్రశ్నలకు జవాబు చెప్పడంతో హిందీ నాకు బాగా వచ్చన్న ముద్ర పడింది. ఇంకేం గర్వం బాగా తలకెక్కింది. పరీక్షల్లో మోటా, సఫెధ్, కిసాన్ అన్న హిందీ పదాలకు తెలుగు అర్థాలు వ్రాయమని అడిగారు. పరీక్ష అయిపోయాక ‘కిసాన్’ అన్న పదం ఏమిటో తెలియలేదు’ అని మా ఫ్రెండ్స్ అంటుంటే ‘నాకు తెలుసు! నేను దానికి అర్థం రాశాను! సోడాలో కలుపుకుని తాగే రసం! అని నేను గొప్పగా చెప్పాను. వాళ్ళిళ్ళల్లో కిసాన్ లాంటి జ్యూస్ లే లేవు కాబట్టి, హిందీరాదు కాబట్టి నిజమే అనుకున్నారు. నేనింటికి వెళ్ళాక, నేను రాసిన ఆన్సర్ విన్నాక మా ఇంట్లో వాళ్ళు పడీ పడీ నవ్వారు. ‘క్లాసులో ఎవరూ రాయనిది నేను రాశాననుకుంటుంటే ఏంటి వీళ్ళు నవ్వుతారు’ అనుకున్నా. తర్వాత తెలిసింది కిసాన్ అంటే రైతని. ఇలా రైతుని కాస్త వేసవి పానీయంగా మార్చేశా.
మా క్లాసులో ఉన్న వారందరిలో మా ఇంట్లోనూ, ఇంకొక అమ్మాయి వాళ్ళింట్లోనూ మాత్రమే ఫోన్ ఉండేది. మాకైనా ఫోన్లు ఎందుకుండేవి అంటే ఫ్యాక్టరీలు కాబట్టి. మాదేమో రైస్ మిల్లు. మా ఫ్రెండు వాళ్ళదేమో కాటన్ మిల్లు. మా ఉర్లో వరి, పత్తి ఎక్కువ పండుతాయి అందుకే ఈ మిల్లులు. సెలవుల్లో ఏం తోచక నేను ఆ అమ్మాయికి ఫోన్ చేయటమో, ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయడమో జరిగేది. ఇంకా మా ఇద్దరి పేర్లూ ‘రాణి’నే. మా ఇంగ్లీషు పాఠ్యపుస్తకంలో ‘సాయొనారా’ అనే పాఠం ఉండేది. ‘సాయొనారా’ అంటే జపనీస్ భాషలో ‘గుడ్ బై’ అని అర్థమని మాస్టారు చెప్పారు. మేమిద్దరం ఫొన్లో మాట్లాకున్నంత సేపు మాట్లాడుకొని చివర్లో ‘సాయొనారా’ అని చెప్పుకునే వాళ్ళం. క్లాసు పాఠాన్ని ఇలా అప్లై చేసేవాళ్ళం. ఇవీ ఆనాటి మా శలవుల ఫోన్ల సంభాషణలు.