అభ్యాసం కూసు విద్య: - ఎం . బిందు మాధవి

 వాణి పృధ్వి దంపతులు కొత్తగా కొనుక్కున్న ఫ్లాట్ గృహప్రవేశం ఆ రోజు!
"బంధు మిత్రులు ఇచ్చిన ఖరీదైన వాల్ హాంగింగ్స్, వాణి వాళ్ళు మోజుపడి కొనుక్కున్న వాల్ క్లాక్స్ ఫిక్స్ చేయించి, కొత్తగా ఆర్డర్ ఇచ్చిన ఫర్నిచర్ మొత్తం వచ్చాకనే ఫ్లాట్ లోకి మారదాం" అన్నాడు పృధ్వి.
స్నేహితురాలు సుమనతో, "ఖరీదైన పెయింటింగ్స్, ఇతర హాంగింగ్స్ ఉన్నాయే! గోడలకి ఎక్కడపడితే అక్కడ చిల్లులు కొట్టెయ్యకుండా, చక్కగా ఫిక్స్ చెయ్యగల మంచి పనిమంతుడైన కార్పెంటర్ ఎవరైనా తెలుసా నీకు" అనడిగింది వాణి.
"రేపో ఎల్లుండో పంపిస్తాను. చూపులకి పెద్ద సమర్ధుడిలాగా కనిపించడు కానీ భలే పనిమంతుడు. మనిషిని చూసి తప్పుగా అంచనా వెయ్యకు. మా రోజ్ వుడ్ డైనింగ్ టేబుల్ చేయించేటప్పుడు అతనిపనితనం చూశాను" అన్నది సుమన.
@ @ @ @ @
ఆదివారం నాడు ఆఫీస్ లేదు కనుక ఫ్లాట్ లో పని చేయించటానికి ఉదయమే వచ్చింది వాణి. బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే..నలిగిన బట్టలు, మాసిన గడ్డం, భూతద్దం లాంటి కళ్ళజోడు పెట్టుకున్న వ్యక్తి.."వాణి గారు మీరేనామ్మా? సుమన మేడం పంపించారు. నా పేరు రాజేశ్వర్రావు. కార్పెంటర్ ని" అన్నాడు.
సుమన చెప్పినట్టే..చూడగానే మంచి అభిప్రాయంకలిగేట్లు లేడు. లోపలికి పిలిచి చెయ్యాల్సిన పని చెప్పి, గోడకి తగిలించవలసిన కళా ఖండాలని చూపించింది. ఫ్లాస్క్ లో తనకోసం తెచ్చుకున్న కాఫీ ఓ కప్పు ఇచ్చింది.
డ్రిల్లింగ్ మిషన్, నాలుగైదురకాల డ్రిల్ బిట్స్, చెక్క ముక్కలు, ఒక పురికొస ఉండ, ఒక పెన్సిల్, స్క్రూ డ్రైవర్ మరి కొన్ని పనిముట్లు ఉన్న సంచి తీసుకుని గదిలోకి వెళ్ళాడు. డ్రిల్లింగ్ శబ్దం వినిపించక, వాణి గంట తరువాత వచ్చి చూస్తే ఫొటోలు, కళాత్మకంగా ఉన్న కొన్ని గడియారాలు, పెయింటింగ్స్... సైజులవారీగా, షేపుల వారీగా, గోడ రంగుకి మ్యాచ్ అయ్యే విధంగా వేరు చేసి నాలుగైదు సెట్లుగా పేర్చి పెట్టాడు.
"ఇతనికి ఈ పనికి ఇంత సేపు పట్టిందా" అనుకుంది వాణి. ఈ లెక్కన ఇతను పని పూర్తి చెయ్యటానికి ఎంత సమయం పడుతుందో అనిపించి, ఆ మాటే సుమనకి ఫోన్ చేసి "నువ్వు పంపిన కార్పెంటర్ వచ్చాడు. బాగా స్లో అనుకుంటా!" అన్నది. "పని అయ్యాక చెప్పు" అన్నది సుమన నవ్వుతూ!
ఇంకో గంట గడిచింది. వాణి మళ్ళీ వచ్చి చూసేసరికి రాజేశ్వర్రావు పురికొసతో ఫొటోలు తగిలించాల్సిన గోడ కొలతలు తీసుకుంటున్నాడు. నాలుగైదు సార్లు కొలిచినా అతనికి తృప్తి కలగలేదు. ఇంతలో లంచ్ టైం అయిందని, తెచ్చుకున్న క్యారియర్ విప్పి భోజనానికి ఉపక్రమించాడు.
వాణి కూడా తెచ్చుకున్న క్యారేజ్ లోనించి భోజనం ముగించి.."ఇతను పని మొదలు పెడతాడేమో? " అనుకుంటూ శబ్దం కోసం ఎదురు చూస్తున్నది.
రాజేశ్వర్రావు అన్ని గదుల్లోను కొలతలు తీసుకుని పెన్సిల్ తో డ్రిల్ చెయ్యాల్సిన చోటు మార్క్ చేసుకుని సాయంత్రమయిందని ఆ పూటకి పని ముగించానని వెళ్ళిపోయాడు. సాధారణంగా ఇలాంటి పనివాళ్ళు వచ్చింది మొదలు పెన్సిల్ అనో, స్క్రూ డ్రైవర్ అనో, తుడిచేటందుకు పాత బట్ట అనో....ఏదో ఒక వస్తువు అడుగుతూనే ఉంటారు. తీసుకున్న వస్తువు మళ్ళీ తిరిగిచ్చి వెళ్ళరు. వాణికి అది అనుభవమే! ఇతను మాత్రం అన్నీ తెచ్చుకున్నట్టున్నాడు..ఆశ్చర్యం ఒక్క దానికీ ఇంట్లో వాళ్ళని పిలవలేదు! అసలు పని చేస్తున్నాడా లేదా అనే అనుమానం వచ్చేటంత నిశ్శబ్దంగా తన పని తను చేసుకు పోతున్నాడు.
మరునాడు కూడా సెలవు అవటం వల్ల "రేపు పని అయిపోవాలి బాబూ! ఎల్లుండి నించి ఆఫీస్ ఉన్నది. రాలేను" అన్నది వాణి. సరేనని తలాడించి వెళ్ళాడు రాజేశ్వర్రావు.
మరునాడు తొమ్మిదింటికల్లా పనిలోకొచ్చాడు. వస్తూ తన కొడుకు పదిహేనేళ్ళ దుర్గా రావుని వెంటపెట్టుకొచ్చాడు. అన్ని గదుల్లోను ప్రతి గోడకి ఉన్న వేరు వేరు కలర్లకి, గోడ సైజుకి మ్యాచ్ అయ్యేట్లు దుర్గా రావు, రాజేశ్వర్రావు కలిసి ఫ్రేంలని అందంగా అమర్చారు. ముందు రోజు లాగా ఎక్కువ టైం తీసుకోకుండా చక చకా ముగించాడు. డ్రిల్లింగ్ చేసిన చోట సున్నం సిమెంట్ చీపురుతో తుడిచి, కప్ బోర్డ్స్ అన్నీ శుభ్రంగా పాతబట్టతో తుడిచి వాణిని పిలిచి చూపించాడు. అంత త్వరగా, శుభ్రంగా ముగించిన అతని పనితనానికి ఆశ్చర్యపోయింది. ఒక ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ చేసిన పని లాగా ఉన్నదని సంతృప్తిగా అనుకుంది.
మధ్యాహ్నం క్యారేజి విప్పుకుంటున్న రాజేశ్వర్రావుని, వాణి "కూర ఇవ్వనా? భోజనం ఇద్దరికీ సరిపోతుందా?" అని ఏదో ఒకటి మాట్లాడాలని అన్నది. "అమ్మగారూ ఈడు నా కొడుకు దుర్గా రావు. ఈడి చేతిలో మంచి పనితనం ఉన్నదమ్మా! ఇప్పటివరకు నేను సుమనమ్మ గారింట్లో పని చేసిన సూర్యారావు మేస్త్రి చేతి కింద పని చేస్తున్నానమ్మా. ఎంతకాలం చేసినా గిట్టేది రోజు కూలీయే కదమ్మా. పది రూపాయలు మిగలవు. చేతికింద ఈడుంటే నేనే స్వగంత్రంగా కాంట్రాక్టులు చేసుకోవచ్చనుకుంటన్నా! ఈడేమో సదువుకుంటానంటాడు. పనికి రానంటున్నడమ్మా" అన్నాడు రాజేశ్వర్రావు.
"ముందైతే తినండి. తరువాత మాట్లాడదాం" అన్నది వాణి. చెయ్యి కడుక్కుని ముందు హాల్లోకొచ్చి అక్కడున్న సీతారాముల నిలువెత్తు చెక్క విగ్రహాలు చూసి దుర్గా రావు "మేడం ఇవి కర్ణాటక నించి తెప్పించారా? అక్కడ దొరికే "దండేలీ టీక్" తో చేస్తారమ్మా ఈ విగ్రహాలు. విరిగిపోకుండా నగిషీలు చెక్కడానికి వీలైన చెక్క అక్కడి అడవుల్లోనే దొరుకుతుంది. ఆ నేలలో పెరిగే చెట్టు చెక్కలో ఆయిల్ ఉంటుందమ్మా. అందుకే చిజిల్ తో చెక్కినా సానపట్టినా పగిలిపోదు..విరగదు. ఈ సీతా దేవి బొమ్మలో కాలు వెనక భాగంలో ఉన్న చిన్న పగులుని మక్కుతో కలిపారు! చూశారామ్మా?" అన్నాడు.
అతనికి ఆ వయసులోనే ఉన్న సునుశిత దృష్టికి, విషయ పరిజ్ఞానానికి ఆశ్చర్య పోయింది. "నీకెలా తెలుసు" అని అడిగింది. కర్ణాటక వాళ్ళ కావేరి ఎంపోరియం లో జరిగిన ఒక ఎగ్జిబిషన్ కి మా ఫ్రెండ్స్ తో వెళ్ళానమ్మా! అక్కడ వారినడిగితే తెలిసింది" అన్నాడు.
అంతకు ముందు రాజేశ్వర్రావు అన్నమాట ప్రస్తావించటానికి మంచి సందర్భం దొరికిందని వాణి "ఇదిగో బాబూ నీ పేరేంటన్నావ్.. ఆ (: దుర్గా రావ్ నీ చిన్నప్పటి నించీ మీ నాన్న చేస్తున్న చెక్క పని చూస్తూ, మధ్య మధ్యలో నాన్నకి సాయం పేరుతో వస్తువులందిస్తూ, తయారైన ఫర్నిచర్ కి పాలిష్ చేస్తూ పెరిగావ్. అవునా! నీకు తెలియకుండానే కొన్ని విషయాలు చాలా తేలికగా నేర్చుకున్నావ్. నీకున్న ఆసక్తి వల్ల ఎగ్జిబిషన్ లో వారినడిగి ఈ చెక్క ప్రత్యేకత తెలుసుకున్నావ్! "అభ్యాసము కూసు విద్య" అన్నారు పెద్దలు. అంటే ఒక విషయం గురించి ఎక్కువ కాలం సాధన చేస్తే అందులో మెళకువలు,లోతులు తెలుస్తాయి."
అందుకే ఈ విషయానికి సంబంధించి ....అంటే చెక్క నాణ్యం నిర్ధారించటం, ఏ రకమైన ఫర్నిచర్కి ఎలాంటి చెక్క వాడాలి..ఇలా ఇంకా లోతుగా ప్రొఫెషనల్ గా చదువుకున్నావనుకో, పెద్దయ్యేసరికి సునాయాసంగా మంచి వ్యాపారం చెయ్యగలుగుతావ్! అంటే వొకేషనల్ కోర్సులన్నమాట!" అన్నది.
"చదువుకోవాలనుకోవటం, స్కూల్ కి వెళ్ళటం తప్పు కాదు. మామూలుగా నీకు మార్కులు ఎలా వస్తూ ఉంటాయ్" అనడిగింది. "50-55% వస్తుంటాయమ్మా" అన్నాడు. "నీ ఫ్రెండ్స్ అందరూ చేరారనో, మీ వాళ్ళు నిన్ను తెలివి తక్కువ వాడివనుకుంటారనో, లేకపోతే కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివితే మంచి పెళ్ళి సంబంధాలు వస్తాయనో .... ఆ మార్కులతో నువ్వు మీకున్న రిజర్వేషన్ సౌకర్యం ఉపయోగించుకుని ఇంజనీరింగులో చేరావనుకో! అత్తెసరు మార్కులతో పాస్ అయి తర్వాత సరైన ఉద్యోగం రాక అసంతృప్తితో నిన్ను.. నీ చుట్టూ ఉన్న అందరినీ తిట్టుకుంటూ బ్రతకాలి. అదే నీకు ఎక్కువగా తెలిసిన మీ వృత్తి విద్య లో చేరావనుకో! నీకున్న అనుభవము, ప్రజ్ఞతో జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు! ఈ రోజుల్లో ఏ వృత్తికి అదే గొప్ప. చదువుకోవాలంటే, అన్ని విషయాలకీ ప్రొఫెషనల్ కోర్సులు ఇప్పుడు ఉన్నాయి."
"ఇలా చెప్పటం మీ నాన్నకి చేతకాకపోవచ్చు. మేడం సుత్తి కొడుతున్నది అనుకోవద్దు. నాకు చురుకైన పిల్లలంటే ఇష్టం! అందుకే నీకివన్నీ చెప్పాను" అన్నది.
@ @ @ @ @
వాణి వాళ్ళు ఫ్లాట్ లోకి మారి అప్పుడే ఆరునెల్లైంది. ఈ మధ్యలో ఆఫీస్ పనిలో పడి దుర్గారావ్ గురించి మర్చిపోయింది.
ఆదివారం నాడు వంట చేస్తూ ఉండగా, ప్లేట్స్ పెట్టే డ్రాయర్ లాగితే రాక ఇబ్బంది పెట్టింది. గట్టిగా లాగేసరికి ధబ్బున విరిగి కింద అరమీద పడింది. "పృధ్వీ..ఈ డ్రాయర్ కింద పడింది. నా సెల్ లో కార్పెంటర్ రాజేశ్వర్రావు నంబర్ ఉన్నది. కొంచెం ఫోన్ చెయ్యవా. వీలైతే ఈ రోజే రమ్మను. మళ్ళీ రేపు ఇంట్లో ఎవరం ఉండం! ఆఫీస్ కి వెళ్ళిపోతాం" అన్నది.
అనుకున్నట్టే రాజేశ్వర్రావు ఆ రోజే వచ్చాడు కానీ, సాయంత్రం ఆరు గంటలకి వచ్చాడు. అతనితో దుర్గా రావు వచ్చాడు. వాణి చెప్పగానే వంటింట్లోకి వెళ్ళి కింద పడ్డ డ్రాయర్ చూసి "తుప్పు పట్టిన సెకండ్ హాండ్ చానల్స్ వాడారమ్మా! ఇవి రిసైకిల్డ్ మెటల్ తో చేశారమ్మా, అందుకే ఆరు నెల్లకే విరిగిపోయింది" అన్నాడు దుర్గారావు.
వాణి దుర్గారావు వంక అభినందనగా చూసి "బాగా గమనించావు" అన్నది.
"ఎలాగూ ఒక డ్రాయర్ కి చానల్ మారుస్తున్నాం కదమ్మా! మిగిలినవి కూడా ఒకసారి చూసేస్తే సరిపోతుంది" అన్నాడు.
రిపేర్ కోసం పనిముట్లు, ఇతర వస్తువులు తెస్తూ..దుర్గా రావు ఒక మడత కుర్చీ తెచ్చాడు. "అమ్మగారూ మా ఇంటి దగ్గర రోడ్డు మీద సహ్రాన్ పూర్ ఫర్నిచర్ అమ్ముతున్నారమ్మా. వాళ్ళ దగ్గర చూసి ఈ మోడల్ కుర్చీ తయారుచేశాం. చూపిద్దామని తెచ్చాను" అన్నాడు.
"చూశావా! ఆ రోజు నేను నీకు చెప్పింది ఇదే. నీ చిన్నప్పటి నించి మీ ఇంట్లో చూస్తున్న పని తెలియటం వల్ల, దానిలో ఒడుపులు తేలికగా పట్టుకోగలిగావు" అన్నది.
"అవునమ్మా! మీరు చెప్పింది మా టీచర్ తో చెప్పాను. అలాంటి కోర్సులు ఉన్న సంస్థలు బెంగళూరు, పూణె, ఫరీదాబాద్ లో ఉన్నాయి. అందులో చేరాలంటే ఎక్కడ కోచింగ్ తీసుకోవాలో అన్నీ మా సర్ చెప్పారు. చూడండి నేను పెద్దయ్యాక మంచి ఫర్నిచర్ షాప్ పెట్టి మీ చేతే ఓపెనింగ్ చేయిస్తాను" అని ఉత్సాహంగా చెప్పి దణ్ణం పెట్టి వెళ్ళాడు.
కామెంట్‌లు