అనువు కాని చోట అధికులమనరాదు: - ఎం. బిందుమాధవి

"అనువు కాని చోట అధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువ కాదు
కొండ అద్దమందు కొంచెమై ఉండదా
విశ్వదాభిరామ వినురవేమ"


ఊరంతా జ్వరాలు, జలుబులు, దగ్గులు!


ఎక్కడ చూసినా ఫ్లూ, విష జ్వరాలు.


బాబ్జీ కూడా స్కూల్ నించి జలుబు, దగ్గు, జ్వరాన్ని మోసుకొచ్చాడు.


తల్లి వాసంతి సాయంత్రం బ్యాంక్ నించి వచ్చేసరికి, ముసుగు తన్ని పడుకుని ఉన్నాడు. ఒళ్ళు కాలిపోతున్నది.


ముందు స్పాంజింగ్ చేసి, ఓ క్రోసిన్ వేసింది. టెంపరేచర్ 103 ఉన్నది.


ఇక లాభం లేదని ఇంటికి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళింది.


డాక్టర్ కామేష్ గవర్నమెంట్ సివిల్ సర్జన్. పగలు గవర్నమెంట్ డ్యూటీ అయ్యాక, సాయంత్రం ఇంటి దగ్గర క్లినిక్ లో ప్రతి రోజు పేషెంట్లని చూస్తాడు.


ఆయన పిల్లల డాక్టర్ కాదు కానీ, చూసే కేసులు మాత్రం ఎక్కువగా పిల్లలవే. హస్త వాసి మంచిదని ఆ కాలనీ వారందరూ పిల్లల్ని ఆయనకే చూపిస్తారు.


ఆ రోజు కూడా, ఊళ్ళో ఉన్న జ్వరాల వల్ల జనం కిట కిట లాడుతున్నారు.


వచ్చిన పేషెంట్లని ఒక క్రమంలో పంపించటానికి కాంపౌండర్లు ఎవరూ ఉండరు, అక్కడ.


పేషెంట్లే, ఎవరికి వారు ఒక క్రమశిక్షణతో ఒకరి తరువాత ఒకరు లోపల డాక్టర్ని కలవటానికి వెళ్ళటం అక్కడి అలవాటు.


ఇంటి దగ్గర క్రోసిన్ వేసినందువల్ల బాబ్జీకి జ్వరం కొంచెం తగ్గి కళ్ళు తెరిచి చుట్టూ గమనిస్తున్నాడు. బాబ్జీ కంటే ముందు ఇంకా చాలా మంది ఉన్నారు. కూర్చునే ఓపికలేక బాబ్జి తల్లితో "అమ్మా ఈ డాక్టర్ అంకుల్ మీ బ్యాంక్ కష్టమరని అదివరకు నువ్వు చెప్పావు. మరి మనం ఆ పరిచయంతో అందరి కంటే ముందు వెళితే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా" అన్నాడు.


వాసంతి వెంటనే "అలా చెయ్యకూడదు. ఎక్కడి పరిచయాలు, పరపతి అక్కడివరకే ఉండాలి. అవి ఇంకో చోట వాడుకోవటం అన్యాయం అవుతుంది. అందరూ ,మనలాగే ఏదో ఒక అనారోగ్యం తో వచ్చిన వారేకదా. పాపం వారంతా కూర్చున్నప్పుడు, మనం అలా క్రమశిక్షణ తప్పి వెళ్ళటం అంటే, నీకు నేను రోజూ చెప్పే పద్యం


"అనువు కాని చోట అధికులమనరాదు
..................................................
కొండ అద్దమందు కొంచెమై ఉండదా


అ న్నట్టు, 'పెద్ద ' కొండైనా చిన్న అద్దంలో చిన్నగానే కనిపించినట్లు, మనం మన పరిమితి దాటి ప్రవర్తించకూడదు అని తెలుసుకోవాలి" అని ముగించింది.


కామెంట్‌లు