అసూయ ఏం చేస్తుంది: -తుమ్మేటి రఘోత్తమరెడ్డి

మనకు క్యాన్సర్ వ్యాధి గురించి కొంత తెలుసు!
అది చాలా ప్రమాదకరమైన వ్యాధి! కానీ, అసూయ ఈర్ష్య అంతకంటే ప్రమాదకరమైన వ్యాధులు!
అవి మనిషికి తగులుకుంటే చికిత్స లేదు! 


అసూయ ఈర్ష్య అంటే?


'అయ్యో! వారు బాగుపడుతున్నారే'
'వాళ్ల పిల్లలు చక్కగా చదువుతున్నారే-తల్లిదండ్రులకు అక్షరం ముక్క వచ్చేది కాదు'


'అయ్యయ్యో! వాడికి మంచి ఉద్యోగం వచ్చిందే?'
'వీడికి ప్రమోషన్ వచ్చిందే?'
'వాడు ఇంటి స్థలం కొననే కొన్నాడట'
'ఇల్లు కట్టారు కానీ అదేం బాగుంది? చెత్త'


'ఏమిటీ? వాళ్లకు ఒకప్పుడు తిండికి గతిలేదు- ఇప్పుడు షో చేస్తున్నారు- ఎవరికి తెలియదు?'


'ఆమె వడ్డాణం కూడా చేయించుకుందట- దాని నడుమే అంత లావు ఉంటుంది, దానికేం అందంగా ఉంటుంది?'


'వాడు ఒక్క కథ రాస్తే , అంత పేరు ప్రతిష్ఠలు రావడం ఏమిటి?ఏముంది అందులో అంతగా? మనం ఎన్నో రాసామే? మనకు రాదే పేరు?'


'వాడు ఒకే ఒక్క సినిమాలో ,ఒకే ఒక్క క్యారెక్టర్ చేసాడే,అంత పేరా?'


'వాడు మంత్రిపదవి కొట్టేసాడు- మనమింకా ఎమ్మెల్యేగానే ఈడుస్తున్నాం- ప్రతిభకు స్ధానమే లేదు'


ఇలా ఇంటి నుండి బయట వరకు కొందరు సాటి మనుషుల బాగోగులు చూసి సహించలేరు- ఉడుక్కుంటారు!చిరాకు పడతారు- చిటపటలాడతారు- ఇంకా చాలా అవుతారు!
అసూయ ఈర్ష్యలు మనిషిలో ప్రవేశిస్తే అనేక వ్యాధులు కూడా ప్రవేశిస్తాయి!
అసూయ పుట్టుకతో రాదు,పెరిగే క్రమంలో వస్తుంది!
ఏమరుపాటుగా ఉంటే అది మనతో పాటే ఎదుగుతుంది, మనల్ని గిడసబారుస్తుంది!


'నువ్వు అందంగా ఉన్నావు'
'నీ కనులు కలువరేకుల్లా ఉన్నాయి'
'ఈ షర్ట్ నీకు మరింత నప్పింది'
'మీ పిల్లలు బాగా చదువుతున్నారు- సంతోషం'
'మీకు ఉద్యోగం వచ్చిందట- అభినందనలు'
'మీకు జన్మదిన శుభాకాంక్షలు' ఇలా అని చూడగలిగితే?
అటు అవతలి వారికి రవ్వంత సంతోషం- ఇటు మన మనసూ కాస్తా ఫ్రీ అవుతుంది!


కొందరు అందంగా ఉండరు- కానీ ఏదో ఒక అందం ఉంటుంది వారిలో- అది చెప్పండి!
కొందరు మహా అందంగా ఉంటారు- కానీ ఏదో ఒక లోపం ఉంటుంది- అది 'చెప్పకండి'


అభినందించడం నేర్చుకోవాలి!
అది మన మనసును సరళంగా మారుస్తుంది!
మన సరళత , మన ఆరోగ్యం!


అసూయ ఈర్ష్య అనేవి అడవిలో కార్చిచ్చు వంటివి!
ఒకచోట అంటుకుంటే ఇక అడవంతా కాలి బూడిదై పోతుంది!
అసూయ ఈర్ష్య అనేక సముద్రంలో భడబాగ్నుల వంటివి!
అవి ఉప్పెనల్ని సృష్టిస్తాయి- సర్వ వినాశనాన్ని కలిగిస్తాయి


అభినందించడం నేర్చుకోవాలి- పిల్లలకు నేర్పాలి!
అభినందనాస్వభావం ఉన్న చోట,అసూయ ద్వేషాలు ఉండవు- స్వీయ వినాశనమూ కలుగదు!


అసూయ మనిషి ముఖాన్ని మలినం చేస్తుంది,
అభినందన గుణం దాన్ని సరళంగా ఉంచుతుంది!


మన సంక్లిష్టతే,మన వ్యాధి కారకం!
మన సరళతే ఆయురారోగ్యాలు!



కామెంట్‌లు