వీరయ్య అనాథ. ఎవరు లేని ఒంటరి యువకుడు.ఊతలపట్టు
సరస్సులో చేపలు పట్టుకుని సమీప గ్రామాల్లో అమ్ముకుని జీవితం
సాగిస్తున్నాడు.
ఊరికి దూరంగా సరస్సు గట్టున చిన్న గుడిసె వేసుకుని రోజూ
తెప్ప మీద సరస్సు నీటిలో కెళ్లి చేపలు పట్టి తెస్తూంటాడు.
ఒక్కొక్కసారి పెద్ద చేపలు మరొకసారి చిన్న చేపలు వలకి చిక్కితే
వాటినే అమ్మి రోజులు గడుపుతున్నాడు.
ఒకరోజు ఎటువంటి చేపలు వలలో చిక్కనందున నిరాశతో గుడిసెకు
వచ్చి నులక మంచం మీద పడుకున్నాడు.
కొద్ది సేపటికి నిద్రలో ఉండగా గుడిసె తడిక వద్ద ఏదో చప్పుడు
వినిపించి వీరయ్య కళ్లు తెరిచి చూస్తే చిన్న కోతిపిల్ల తిండి కోసం
వెతుకులాడుతోంది.
వీరయ్యకి జాలేసి రాత్రి తనకోసం ఉంచుకున్న అన్నంలో కొంత
కోతిపిల్లకు పడవేసాడు. అది ఆకలి మీదున్న ఆబతో గబగబా నోట్లో
పెట్టుకుని తినసాగింది.
తర్వాత కోతిపిల్ల తన దారిన తనే వెళి పోతుందని తలిచి మళ్ళీ
మంచం మీద కునుకు తీయసాగాడు.
సాయంకాలమైంది. వీరయ్య మంచం దిగి గుడిసె బయటికొస్తే మట్టి
అరుగు మీద కోతిపిల్ల కూర్చొనుంది.
తనకి తోడుగా ఉంటుందని దాన్ని ఏమీ అనకుండా అన్నం
పెడుతు రోజూ తెప్పలో తనతో పాటు చేపల వేటకు తీసుకెల్తూండే
వాడు.
వలకి చిక్కిన చేపల్ని సన్న మూతి ఉన్న తాటి రేకుల బుట్టలో
పడేసి సాయపడేది కోతిపిల్ల.
రోజులు గడుస్తున్నాయి.ఒకరోజు వీరయ్య జ్వరం వచ్చి లేవ
లేకపోతే కోతిపిల్ల మంచం పక్కన కుండలోని మంచినీళ్లు సిల్వర్ గ్లాసు
తో నింపి వీరయ్య చేతికిచ్చింది.
వీరయ్య దాని ఆదరణకు పరవసించి పోయాడు. చేపలు అమ్మ
డానికి గ్రామంలో కెళ్లినప్పుడు కోతి కోసం అరటి పళ్లు , జామకాయలు,
బిస్కిట్లు కొని తెచ్చేవాడు.
ఇలా ఒకరి కొకరు సాయపడుతూ వారి స్నేహబంధం బలపడ
సాగింది.
వేసవి కాలం వచ్చింది. ఊతలపట్టు సరస్సులోకి పెలికాన్, ఫ్లెమింగో, సిల్వర్ క్రేన్ విదేశీ పక్షుల రాకతో సందడి ప్రారంభమైంది.
సరస్సు చుట్టూ చెట్ల మీద పుల్లలతో గూళ్లు కట్టుకుని కాపురాలు
మోదలెట్టాయి.
వీరయ్యతో పాటు కోతి తెప్ప మీద కూర్చుని చేపల వేటలో
సహాయ పడేది.తనతో పాటు తెచ్చుకున్న అన్నంలో కొంత కోతికి
పెట్టేవాడు.
ఎండ ఎక్కువగా ఉంటే తెప్పని ఒడ్డుకి చేర్చి చెట్టు నీడలో
విశ్రాంతి తీసుకుని తర్వాత తిరిగి చేపల వేట కొనసాగించే వాడు.
వీరయ్య తుండుగుడ్డ తలకింద పెట్టుకుని చెట్టు మొదట్లో
విశ్రమిస్తే కోతి తెప్పలో ఉన్న చేపలకు కాపలాగా ఉండేది.
వీరయ్య విశ్రమించే చెట్టుకు దగ్గర్లో మరొక చిన్న చెట్టు కొమ్మ మీద పెలికాన్ కొంగ గూడు కట్టి పిల్లల్ని సాకుతోంది.
ఒకరోజు తల్లి పెలికాన్ కొంగ తెచ్చిన చేపల్ని తినడానికి
అల్లరి చేస్తున్నాయి పిల్లలు. వాటికి రోజూ చేపలు తిని విసుగొచ్చింది.
తల్లికి ఏమి చెయ్యాలో తోచడం లేదు. ఇంతలో చెట్టుకి దగ్గర్లో
తెప్పలో వీరయ్య గిన్నెలో ఉంచుకున్న తెల్లని అన్నం కంట పడింది.
గబుక్కున ఎగిరి తెప్ప వద్దకు వచ్చి గిన్నెలో అన్నం నోటితో
అందుకోబోయింది. అక్కడ కాపలా ఉన్న కోతి దాన్ని తరిమింది.
మళ్ళీ మళ్ళీ పెలికాన్ కొంగ గిన్నెలో అన్నం కోసం ఎగురుతూ
వస్తోంది.
దానికి ఆకలిగా ఉందేమోనని తలిచి కొంచెం అన్నం తెప్ప చివర్న
పడేసింది.తల్లి కొంగ అన్నం నోట్లో ఇరికించుకుని ఎగిరి పిల్లల నోటి
కందించింది. అవి ఆప్యాయంగా అన్నాన్ని తినసాగాయి.
ఆ దృశ్యాన్ని కోతి చూసింది. పిల్లల కోసం తల్లి కొంగ అన్నాన్ని
తీసుకెళ్లిందని గ్రహించి తన కోసం ఉంచిన అన్నాన్ని కూడా కొంగకి
పడవేసింది.
కోతి ఉదార గుణాన్ని తెలుసుకున్న పెలికాన్ కొంగ సరస్సు
అడుగు నుంచి పెద్ద చేపల్ని నోట కరిచి తెచ్చి తెప్పలో పడ వేసింది.
నిద్ర లేచి వచ్చిన వీరయ్య తను వేటాడకుండానే ఇంత పెద్ద
చేపలు తెప్పలో కెలా వచ్చాయోనని ఆశ్చర్యపోయాడు. వాటిని
ఊళ్లో అమ్మితే డబ్బులు బాగా వస్తాయని సంబరపడ్డాడు.
పాపం , కోతి మాత్రం తిండిలేక పస్తుంటోంది.
ఇలా కొద్ది రోజులు గడిచేసరికి చేపల వల్ల వీరయ్య ఆదాయం
పెరిగి గుడిసె తీసేసి ఊళ్లో చిన్న దుకాణం పెట్టుకున్నాడు.
తన తెప్ప లోకి ఇంత ఖరీదైన చేపలు ఎలా వస్తున్నాయా అని
అనుమానం కలిగి ఒకరోజు నిద్ర పోకుండా తెప్ప మీద ధ్యానం పెట్టాడు.
వీరయ్య.
పెలికాన్ కొంగ రావడం , కోతి తన వంతు అన్నం దానికి అందిస్తే
పిల్లలకు తినిపించడం , మళ్లీ పెలికాన్ కొంగ పెద్ద గోల్డన్ ఫిష్ లు నోటితో
కరుచుకు వచ్చి తెప్పలో పడెయ్యడం చూసాడు.
ఇన్నాళ్లూ కోతి తను ఆకలితో పస్తులుంటు పెలికాన్ కొంగ ద్వారా
ఖరీదైన పెద్ద చేపల్ని సంపాదించి తనని ధనవంతుణ్ణి చేసిందని తెలుసు
కున్నాడు.
కోతి పట్ల ఆదరణ పెరిగి రకరకాల పళ్లూ ,బిస్కిట్లు ఎక్కువ తెచ్చి
పెట్టేవాడు.
వాతావరణం మారడంతో విదేశీ పక్షులు పిల్లలతో తమ ప్రాంతాలకు
తరలిపోయాయి.
వీరయ్య తన వ్యాపారాన్ని పెంచుకుని కోతి మిత్రుడితో ఆనందంగా
జీవిస్తున్నాడు.
* * *
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి