భాస్కర శతకము - పద్యం (౧౦౧ - 101)


 ఉత్పలమాల: 

 *స్థానము తప్పివచ్చునెడఁ | దానెటువంటి బలాఢ్యుడున్ నిజ*

*స్థానికుఁడైన యల్పుని క | తంబుననైనను మోసపోవుగా*

*కానలలోపలన్ వెడలి | గంధగం బొకనాడు నీటిలోఁ* 

*గానక చొచ్చినన్ మొసలి  | కాటున లోఁబడదోటు భాస్కరా!*


తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..


మదించిన ఏనుగు నివాసం చిక్కని అడవి. అటువంటి ఏనుగు, అడవిలో దారి తప్పి నీటి చెరువులో దిగి తనకంటే బలహీనమైన మొసలి చేతికి చిక్కి ప్రాణముల మీదికి తెచ్చుకున్నది కదా.  అలాగే, తాను ఎంత ఆలోచనాపరుడు, యుక్తి కలవాడు అయినా, వేరొకని స్థావరం లోనికి వెళ్ళి నప్పుడు, అవతలవాడు ఎంత బలహీనుడు అయినా అతని చేతిలో మోసపోతాడు .....అని భాస్కర శతకకారుని వాక్కు.


*స్థాన బలిమి కాని, దన బలిమి కాదయా!* అని వేమన వాక్కు ఉంది గదా.


.....ఓం నమో వేంకటేశాయ


Nagarajakumar.mvss

కామెంట్‌లు