భాస్కర శతకము - పద్యం (౧౦౮ - 108)

 ఉత్పలమాల: 
 *హీనకులంబులందు జని | యించిన వారికి సద్గుణంబు లె*
*న్నేనియుఁ గల్గియున్న నొక | నేరము చెందకపోదు పద్మముల్*
*భూనుతిగాంచియున్ బురదఁ | బుట్టుటవల్ల సుధాకరోదయం*
*బైననసహ్య మొందవె ప్రి | యంబున జూడగలేక భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..
సూర్యోదయంతో కొలనులో విరబూసిన తామర పూవుల అందాన్ని ప్రజలు అందరూ మెచ్చుకున్నా, ఆ తామర పువ్వులు వెన్నెలలు వెదజల్లే చంద్ర కాంతిని అంతగా ఆనందించలేవు. చంద్రోదయంతో తామరలు ముడుచుకుంటాయి కదా.  అలాగే, తక్కువ కులములో పుట్టిన వారు ఎన్ని సద్గుణములు సంపాదించుకున్నా, తనకు జన్మతః వచ్చిన చెడుగుణములు ఎప్పడో ఒకప్పుడు కనిపిస్తాయి......అని భాస్కర శతకకారుని వాక్కు
*ఈ పద్యంలో కవి, పుట్టుకతో వచ్చిన లక్షణాలను పూర్తిగా మార్చుకోవడం సాధ్య పడదు కానీ అసాధ్యం కాదు.  మనం ఏమి అవ్వాలి అనుకుంటే, అది అయ్యే ప్రయత్నం తప్పకుండా చేయాలి.  మార్పు సాధ్యమే. దీనికి భగవంతుని కృప, గురువు అనుగ్రహం పరి పూర్ణంగా వుండాలి.* 
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss