రేగుపళ్ళు -భోగి పళ్ళు 1 వివిధ ఉపయోగాలు. : పి . కమలాకర్ రావు


  రేగు పళ్లకు భోగి పండుగకు చాలా అవినాభావ సంబంధం వుంది.  భోగి ,సంక్రాంతి పండుగ వచ్చే నాటికీ  ఎక్కడ చూసినా రేగుపళ్ళు దర్శనమిస్తుంటాయి. రేగు పండ్లలో తీయనివి పుల్లనివి వగరుగా  ఉండేవి మనకు లభిస్తాయి. దీనిని బదరీ వృక్షం  అని కూడ అంటారు. భోగి సంక్రాంతి పండుగలకు ప్రతి ఇంటి ముందు ఎంతో అందమైన ఎన్నో రంగుల ముగ్గులతో  చాలా శోభాయమానంగా ఇంటి ముందు అలంకరిస్తారు. గొబ్బెమ్మలు పెట్టి దాని చుట్టూ రేగుపళ్ళు నువ్వులు వేస్తారు. ఇది మంచి ఆరోగ్యానికి సూచిక. కొండ పిండి మొక్క పువ్వు దొరికితే అది కూడా గొబ్బెమ్మలు పెడతారు. చిన్న పిల్లలకు తప్పనిసరిగా తలంటు స్నానం రేగు పళ్ళు నువ్వుల తో కలిపి చేయించు తారు. దీనిద్వారా సూర్యకిరణాలలోని శక్తి చిన్నపిల్లలకు చేరి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆ తరువాత పెద్దలందరూ ఆశీర్వదిస్తూ భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు , నువ్వులు,  చిల్లర నాణేలు కలిపి పిల్లల తలపై పోస్తారు. ఇది చేయడం వల్ల పిల్లలకు చెడు దృష్టి పడకుండా కాపాడుతుంది. ఆయుర్ వృద్ధి కూడా కలుగుతుంది. ముత్తయిదువలు నోములు నోచు కొని నోము పాత్రలలో రేగు పళ్ళు నువ్వులు పూలు వేసి పూజ లు చేస్తారు.

  రేగుపళ్ళు నాలుకపై రుచిని  పెంచుతాయి. ఆకలిని కూడా పెంచుతాయి. ఇవి తింటే ఉదర సమస్యలు తగ్గుతాయి . జీర్ణశక్తి పెరుగుతుంది.

కొన్ని రేగు పళ్లను శుభ్రంగా కడిగి లోపలి గింజలు తీసి వేసి ఒక గిన్నెలో వేసి ఎండుమిరపకాయ ముక్కలు కొద్దిగా బెల్లం కొద్దిగా ఉప్పు కలిపి మరిగించి కషాయంగా కాచి త్రాగాలి. ఇది మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కషాయం.

రేగు చెట్టు ఆకులు కూడా ఔషధంగా పనికి వస్తాయి. రేగు ఆకులను శుభ్రంగా కడిగి ముద్దగా నూరి కొద్దిగా చెట్టు బెరడును కూడా వేసి మరిగించి చల్లార్చిన నీటిని త్రాగాలి. ఇది చిన్న ప్రేవులు పెద్ద ప్రేవుల లోని పుళ్లను  తగ్గిస్తుంది. మలద్వారం వద్ద వచ్చే పగుళ్లను కూడా తగ్గిస్తుంది. ఇది మంచి యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది.


కామెంట్‌లు