238.బాలసాహిత్య పురస్కార్ 2019 ప్రదానోత్సవం(మొదటి భాగం)::---బెలగాంభీమేశ్వరరావు,9989537835.

 తెల్లవారింది.నవంబరు14 వచ్చేసింది. బాలలకు
బాలసాహిత్యానికి పండుగ రోజది.8గంటలకు
తయారై రిసెప్షన్ హాలుకి వచ్చాం.రచయితలు
వారి కుటుంబ సభ్యులతో హాలు కోలాహలంగా
ఉంది. నిన్నటి రోజు పరిచయమయ్యేవాళ్ళం
పలుకరించుకున్నాం.కొత్త వాళ్ళు కూడా
పరిచయమయ్యారు.భాష పరిచయం లేనప్పుడు
చిరునవ్వు కరచాలనాలే మనుషులను మనసులను కలిపే దివ్య సాధనాలు.అందరం
డైనింగ్ హాలులోకి వెళ్ళాం.బ్రేక్ ఫాస్ట్ చేసి
రూమ్ చేరుకున్నాం.పది గంటలకు అకాడమీ
ఉద్యోగులు రూం కి వచ్చారు. టి.ఏ;డి.ఏ బిల్లులు
నింపించారు.ఫ్లైట్ టిక్కెట్ల జెరాక్సు కాపీలు
తీసుకున్నారు. అవార్డు నగదు రు.50000లు
బదిలీ చేయడానికి నా బ్యాంకు అకౌంట్ నెంబర్ 
తీసుకున్నారు. సాయంత్రం 5గంటలకల్లా రిసెప్షన్
హాలుకి వచ్చేయండని చెప్పారు. మధ్యాహ్నం
లంచ్ అయ్యాక విశ్రాంతి తీసుకున్నాం.ఏవేవో
ఆలోచనలు...పిల్లలు, పాటలు,కథలు,శిక్షణా శిబిరాలు,సదస్సులు,పోటీలు, బహుమతులు,
పుస్తక ప్రచురణలు, పురస్కారాలు, ప్రశంసలు, ఆశీస్సులు,నా శ్రేయోభిలాషుల సద్విమర్శలు...
ఇంకా ఏవేవో మనస్సును ఆహ్లాదపరిచే సంఘటనలు,మనసును చికాకు పెట్టే సంఘటన లు ఇవన్నీ నా మనస్సులో చుట్టుముట్టసాగాయి.
పక్కనే ఉన్న మా ఆవిడను చూశాను. ప్రశాంతంగా
నిద్రపోతోంది. నా విజయంలో సగభాగం ఆమెదే.
ఇంటి ఇల్లాలు భర్తను ప్రశాంత వాతావరణం లో
ఉంచగలిగితేనే ఆ భర్త విజయాలు సాధించగలుగుతాడు.ఆ వరం నాకు దక్కింది.
జీవితంలో ఒడిదొడుకులు వచ్చినప్పుడు ఆమె
నాలో నిబ్బరం సడలనివ్వకుండా రచనామార్గానికి
ఆటంకం లేకుండా  చేసేది. మనస్సులోనే కృతజ్ఞతలు
చెప్పుకున్నాను.కృతజ్ఞతలంటే ఆమె ఒప్పుకోదు.అది నా బాధ్యత అని అంటుంది.
మీ అమ్మగారు ఆ బాధ్యతను అప్పజెప్పారంటుంది.టైం చూశాను. నాలుగయింది.ఆమెను తట్టి లేపాను.గబగబా
తయారై ఇద్దరం రిసెప్షన్ హాలు చేరుకున్నాం.
అప్పటికే పురస్కారప్రదానోత్సవ సభాస్థలికి
వాహనాలు వెళ్లివస్తున్నాయి.పది నిముషాలు
హాలులో కూర్చున్నాం.అంతలో వెహికిల్ సిద్ధంగా
ఉంది రండి అన్నారు.ఇద్దరం వాహనమెక్కాం.
మాతోపాటు మరికొంతమంది ఉన్నారు. వాహనం
బయలుదేరి మైలాపూర్ లోని భారతీయ విద్యాభవన్ వద్ద ఆగింది. వాహనం దిగి మెయిన్
ఆడిటోరియమ్ వద్దకు వెళ్ళాం.(సశేషం)