మీగడ పెరుగు: -సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,--ధర్మపురి. మొబైల్:9908554535.


 పూర్వం కొండాపూర్  గ్రామంలో  కాంతమ్మ అనే అత్త ఉండేది .ఆమె గయ్యాళి గంప. ఆమెకు సుశీల అనే కోడలు ఉండేది .ఆమె చాలా సౌమ్యురాలు. కాంతమ్మకు భోజనం పై మక్కువ ఎక్కువ. ఆమెకు మీగడ పెరుగు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు మీగడ పెరుగు తనకోసం ఉంచుకొని వేసుకొని తినేది.

              ఇలా ఉండగా ఒకరోజు కాంతమ్మ పొలం పని పరిశీలించడానికి వెళ్ళింది. అప్పుడు సుశీలకు మీగడ పెరుగు తినాలని బుద్ధి పుట్టింది. వెంటనే సుశీల లోపలికి వెళ్లి మొత్తం పెరుగు పోసుకుని అన్నం తిన్నది. అత్త వచ్చిన తర్వాత తనను తిడుతుందని  సుశీలకు తెలుసు. అయినా తన కోరిక చంపుకోలేక మీగడపెరుగును మొత్తం పోసుకుని తిన్నది.

              అప్పుడు సుశీలకు ఒక ఉపాయం తోచింది. వెంటనే తన అత్తసోదరుని ఇంటికి వెళ్ళింది . తమ ఇంట్లోని మీగడ పెరుగు పిల్లి త్రాగిందనీ ,తన అత్తకు పెరుగు కావాలని  అడిగింది. వారు కాంతమ్మ అలవాటు తెలుసు కనుక వాళ్ళింట్లోనే మీగడ పెరుగు పోశారు. సుశీల తన ఇంటికి వచ్చి ఎప్పటిలాగే మీగడ పెరుగు ఆ పాత్రలో ఉంచింది . అత్త వచ్చిన తర్వాత ఆ పెరుగు పోసుకొని తిన్నది . కోడలు తన పెరుగు తిన్న సంగతి, తన సోదరుని ఇంటికి వెళ్లి పెరుగు తెచ్చిన సంగతి అత్తకు తెలియదు.

              ఒకరోజు అత్త తన సోదరుని ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఆమె వదిన "వదిన గారూ! నేను పంపిన మీగడ పెరుగు బాగున్నదా !" అని అడిగింది. అప్పుడు కాంతమ్మ ఆశ్చర్యపోయి" ఏ పెరుగు వదినా"! అని అన్నది . "అదే  ఆ  రోజు మీ కోడలు పిల్ల  "పిల్లి త్రాగింది"  అని తీసుకెళ్లిన పెరుగు" అని అన్నది వదిన. దానితో కాంతమ్మకు విషయం అర్థం అయింది.   " చాలా బాగున్నది " అని సమాధానం ఇచ్చింది .తనకోసం తన సోదరుని ఇంటికి వెళ్లి పెరుగు తెచ్చి పెట్టినందుకు, తనకు భయపడినందుకు తన తప్పును తెలుసుకున్న కాంతమ్మ ఒక్కరోజూ తాను కోడలిని పెరుగు తినమని అనలేదన్న సంగతి జ్ఞాపకం వచ్చింది .కోడలు మీద మమకారం పెరిగింది.

              వెంటనే ఇంటికి వెళ్లిన కాంతమ్మ కోడలును పిలిచి ,తన సోదరుని ఇంటి నుండి పెరుగు తెచ్చిన సంగతి అడిగింది . అప్పుడు సుశీల ఆరోజు పిల్లి త్రాగిందని వణుకుతూ చెప్పింది .వెంటనే కాంతమ్మ " ఏ పిల్లీ !ఈ పిల్లేనా " అని కోడలును చూపుతూ అడిగింది. కోడలు గజగజ వణికింది . వెంటనే కాంతమ్మ "చూడమ్మా ! ఒక్క రోజైనా నీవు నాతో "మీగడ పెరుగు నాకు ఇష్టం" అని చెప్పలేదు. చెప్పితే నేనే నీకు పోసేదాన్నిగా " అని మురిపెంగా అంది కాంతమ్మ. దానితో సుశీల ఊపిరి పీల్చుకుంది.


కామెంట్‌లు