పిరికివాడి ధైర్యం:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి.-- మొబైల్: 9908554535.


 పూర్వం ఒక గ్రామంలో కనకయ్య అనే పిరికివాడు ఉండేవాడు. అతని భార్య గయ్యాళి గంప. రోజూ భర్తను డబ్బు తెమ్మని ఆమె బాధ పెట్టేది .అతడు మిక్కిలి సోమరి. కనుక ప్రతిరోజూ భార్యకు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతూ ఉండేవాడు.

             ఒకరోజు పని కొరకై పొరుగు గ్రామానికి కనకయ్య అడవి దారి గుండా బయలుదేరాడు. దారిలోనే చీకటి పడింది.తాను చీకటి పడే సరికి పొరుగు గ్రామం చేరాలని  అనుకున్నాడు .కానీ దారిలో అతనికి కాలికి ముల్లు గుచ్చి తీవ్రంగా బాధించింది. అందువలన త్వరగా అడుగులు వేయలేక అడవి మధ్యలోనికి  వచ్చేశాడు. ఇంకా నడిచే పరిస్థితి లేదు. అతనికి వెంటనే పెద్దపులి గాండ్రింపు వినిపించింది. భయంతో కనకయ్య బిక్క చచ్చిపోయాడు. వెంటనే పెద్దపులి చెట్టు ఎక్కదన్న సంగతి అతనికి జ్ఞాపకం వచ్చింది .తక్షణమే అక్కడి మర్రి చెట్టును ఎక్కి కూర్చున్నాడు. చలి విపరీతంగా ఉండటం మూలాన గొంగళిని మీద కప్పుకున్నాడు.


           ఇంతలో దూరం నుండి నాలుగు  నల్లటి ఆకారాలు తన చెట్టు వైపే రావడం చూశాడు .వాటిని దయ్యాలనుకొని కనకయ్య భయంతో కళ్ళు మూసుకున్నాడు. కనకయ్య దయ్యాలు అనుకున్నది నలుగురు దొంగలనే. వారు చీకట్లో ముసుగులతో  మర్రి చెట్టు కిందకు కిందకు వచ్చారు. ఆ చెట్టు కింద కూర్చుండి తాము  సంపాదించిన ధనాన్ని పంచుకోవడం మొదలుపెట్టారు .కనకయ్య మెల్లగా కళ్ళు తెరచి కిందకు చూశాడు .ఆ నాలుగు దయ్యాలు తన చెట్టు క్రిందనే ఉన్నాయని గమనించి, వాటి చేతిలోని డబ్బును చూశాడు.

          ఇంతలో తన భుజం పైన చేయి వేసినట్లు అనిపించింది.వెంటనే  అదిరిపోయి వెనుకకు చూశాడు.  అది ఒక ఎలుగుబంటి. దానిని కూడా దెయ్యం అనుకొని తనకు చావు తప్పదని గ్రహించి లేని ధైర్యం తెచ్చుకొని ఒక్క వెర్రికేక పెట్టి అమాంతం పట్టు జారి చెట్టుపై నుండి కింద పడ్డాడు. దాంతో దొంగలు కనకయ్యను చూచి ఏదో దయ్యం అనుకొని సొమ్మును అక్కడనే వదలిపెట్టి ,తలో వైపుకు పరుగు తీశారు. కనకయ్యకు నడుము విరిగినంత పని అయింది. అయితేనేమి డబ్బును చూడగానే తన దెబ్బల సంగతే  మర్చిపోయి సంతోషంతో ఆ డబ్బులు తీసుకొని పరుగెత్తాడు. తన స్వగ్రామానికి చేరుకుని , ఆ డబ్బును తన భార్యకు ఇచ్చి ,సుఖంగా కాలం గడిపాడు.