సైకిల్ తొక్కడం: - యామిజాల జగదీశ్
 ఇప్పటికీ గుర్తే
నేర్చుకోవడానికి ఆశపడి
అమ్మ దగ్గర పట్టుపట్టి
రూపాయి తీసుకుని
పరుగెత్తేవాడిని
అర గంటసేపు నిరీక్షించి
అద్దె సైకిల్ తీసుకుని
గంటకు డబ్బులు కట్టి
సైకిల్ తీసుకుని ఎగిరేవాడిని
వీధిలోకి వెళ్ళేటప్పటికే
రాజులా పోతాం
ఇరుగుపొరుగు వీధులన్నీ
తొక్కుతూ తిరుగుతూ
గంటసేపుకే డబ్బులు కట్టామన్న సంగతే
మరచిపోతాను
టైము దాటిపోతుంటే
విచారవదనంతో
ముఖం వేలాడేసుకునేవాడిని
మరో రూపాయి కోసం
అమ్మ దగ్గర అబద్ధాలు చెప్పేవాడిని
వీరుడిలా
కొట్టుకెళ్ళి ఇంకాస్సేపు టైమడిగేవాడిని
తొక్కడానికి
డబ్బులు దొరకని రోజుల్లో
అన్నయ్య సైకిల్ తీసుకుని
అతి కష్టంతో తొక్కేవాడిని
పడిపోయేవాడిని
దెబ్బలు తగిలేవి
అవి దాచడానికి
విఫలయత్నం చేసేవాడిని
ఏదేమన్నా
ఇప్పటికీ అద్దెసైకిల్ తొక్కిన రోజులు
మరచిపోలేను....
ఎక్కడ సైకిల్ చూసినా
చిన్నప్పటి రోజులు
కళ్ళముందు కదలాడుతాయి
-