దేవుడి మొక్కు: --సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,-ధర్మపురి.


  ఒక గ్రామంలో సోమయ్య అనే లోభి ఉండేవాడు. అతడు పిల్లికి కూడా పిడుచ వేయని పిసినారిగా పేరు గాంచాడు.

      ఒకసారి ఆయన కొడుకుకు ఉన్న ఫళంగా విపరీతంగా జ్వరం వచ్చింది. సోమయ్యకు ఒక్కడే కొడుకు. కావున ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే వైద్యుడు శేషాచారిని పిలిపించాడు.సోమయ్య సంగతి తెలుసు కాబట్టి శేషాచారి డబ్బు ఇవ్వనిదే రానన్నాడు.

దానితో చేసేదిలేక సోమయ్య డబ్బు ఇచ్చి శేషాచారిని పిలిపించాడు.

       శేషాచారి సోమయ్య కొడుకుకు మందిచ్చి నాలుగు పూటలు వాడమన్నాడు.అంతేగాక సోమయ్యతో "దేవుడికి ఏదైనా మొక్కు మొక్కవయ్యా. తగ్గిపోతుంది"అని అన్నాడు.వెంటనే సోమయ్య తన కొడుకుకు జ్వరం తగ్గితే 100 రూపాయలు హుండీ లో వేస్తానన్నాడు.రెండవ రోజుననే సోమయ్య కొడుకు జ్వరం తగ్గింది.సోమయ్య దేవుడి మొక్కు 100 రూపాయల సంగతే మరచి పోయాడు.

        ఒకరోజు శేషాచారికి సోమయ్య ఎదురు పడ్డాడు.అప్పుడు శేషాచారి " ఏమయ్యా! సోమయ్యా!దేవుడి మొక్కు తీర్చావా!"అని అడిగాడు.దానికి సోమయ్య బదులిస్తూ "చారీ గారు! మొక్కు తీర్చాలనే గుడికి వెళ్ళా నండి.దేవుడు డబ్బు తీసుకోలేదు."అని అన్నాడు.అందుకు శేషాచారీ ఆశ్చర్యపడి "ఏమిటీ!దేవుడు డబ్బు తీసుకుంటాడా! నీవు హుండీలో వెయ్యాలి గానీ!"అని అన్నాడు.

         దానికి సోమయ్య బదులిస్తూ "నిజమేనండీ!నేను మొక్కు మొక్కినపుడు దేవుడు మౌనంగానే ఉన్నాడు.నా మొక్కును ఒప్పుకున్నట్టే గదం డీ! అందుకే మా బాబు జ్వరం తగ్గింది. ఇప్పుడు నేను మొక్కు తీరుద్దామనీ గుడికి వెళ్ళి "స్వామీ! మా బాబు జ్వరం తగ్గింది.నీ డబ్బు నేనే వాడుకుంటాను"అని అన్నాను.దానికీ దేవుడు మౌనం గానే ఉన్నాడు.అంటే ఒప్పుకున్నట్టే గదండీ."మౌనం అర్ధాంగీకారం గదా"అని అన్నాడు.

           దేవునికి కూడా పంగ నామాలు పెట్టిన సోమయ్య ను ఇక మార్చలేమని శేషా చారీ అనుకున్నాడు.