అక్కర్లేదు !!:-కె ఎస్ అనంతాచార్య

 ఎవరో వచ్చి చేయమని అభ్యర్థించనక్కర్లేదు 
వంగి వంగి దండాలు వద్దు
చేతుల్లో కరుణా రేఖలు  
చేతల్లో నిబద్ధత చాలు !
ఊరికే ప్రచారార్భటి  కంటే!
 
అవార్డులు రెక్కలు కట్టుకుని వచ్చి వాలాలనే బోయవాని మోసపు వేట వద్దు
ఏదో ట్రస్టు లో దూరి అమాంతంగా బోర్డ్ మీద పేరు అలంకార భూషణoగా నిలబడి తే  ట్రస్ట్ ను జార విడుచుకోవాల్సిందే
నీవై నిలబడితే చాలు
నిక్కమైన నీలమై  ప్రకాశిస్తావు
ఎవరో దరి చేరి నిన్ను అడగరు
కదిలిపోయి ఆకలి కుంపటి
లో కూరుకు పోయిన వారి పక్కన నిలిచి
అన్నం మెతుకై చల్లబరిస్తేచాలు
ఎండిన గొంతుకు నీటి చుక్కయి
 పచ్చని తీగ మీద దయాఫలమై 
 అందితే చాలు
రెక్కలకు ఈకవై , దృక్కులకు  చూపువై
మార్గానికి మలుపువై
తండ్లాటకు తల్లి మాటవై
గెలుపుకు విజయమై జండాకు తాడై   ఎండకు నీడైతే చాలు ! 
ఎవరో అనుకుంటారని పనులకు
మెరుగులు పెట్టకు
రాతలకు మూతలు పెట్టకు
పాట నోటికి తాళం కొట్టకు
ఏమైనా సరే నీడను అనుమానించకు
ఆత్మను వంచించకు
గోడలు కొరికే చెవులకు తల ఒగ్గకు 
గోటిని
గొడ్డళ్ళ దాకా తేవద్దు
 నీవు నీవై నిలబడు దాగి యున్న శక్తి కి  చిన్న మాట  చాలు  సాధన మీద నిలబడి
గమ్యం చేరుతుంది గాలిని శాసిస్తుంది