మన జీవితం సక్రమంగా సాగడానికి మనం ఎంత కారణమో,మన చుట్టూ అనివార్యమైన కొందరు కూడా అంతే కారణం!మనిషి తన జీవితంలో పడవలసి వచ్చే ఇబ్బందులు బాధలు కష్టాలు దుఃఖం వగైరా అన్నీ సాటి మనుషుల మూలంగానే పడవలసి వస్తుంది- ఎదుర్కోవలసి వస్తుంది!ఇంటి నుండి మొదలుకొని సామాజిక జీవితంలోని అనేక చోట్ల ఇలాంటి సంఘర్షణాపూరిత వాతావరణమే ఉంటుంది! అయితే ఇదంతా తప్పనిసరైన సంఘర్షణ! దాన్నించి ఎవరూ తప్పించుకోలేరు!బాధలు పడవలసి ఉంటుంది, పెట్టవలసి ఉంటుంది! బ్రతుకుతెరువు కోసం అవన్నీ తప్పనిసరైన సంఘర్షణలు!ఈ తప్పనిసరైన సంఘర్షణలు పడుతూనే కొందరు అనవసరమైన సంఘర్షణల్ని కొని తెచ్చుకుంటారు;వాళ్లు కొనితెచ్చుకోవడం అంటే, ఇతరులను అందులోకి ఈడ్చడం అన్నమాట!అటువంటి వారు ,వారూ ప్రశాంతంగా ఉండరు,చుట్టూ ఉన్నవారిని ప్రశాంతంగా ఉండనీయరు!అనవసర అభిప్రాయాలు- అనవసర జోక్యాలు- అనవసరమైన సంఘర్షణల్ని తెచ్చి పెడుతుంటాయి!ఉన్న ప్రశాంతతను సంబంధాలనూ చెడగొడతాయి!ఇళ్లల్లో ఆఫీసుల్లో ఇతర రకాల పని ప్రదేశాలలో కూడా ఇలాంటి అనవసర జోక్యాలు సంబంధాలను చెడగొడతాయి- చాలా మంది తమ తమ అభిప్రాయాల మేరకే అందరూ ఉండాలని చూస్తుంటారు! భిన్నమైన అభిప్రాయాలు వినపడగానే తీవ్రంగా రియాక్ట్ అవుతారు!ఇతరుల అభిప్రాయాలు తమకు నచ్చకపోతే,వెంటనే ఖండించడానికి ముందుకు వస్తారు!'అవి వారి అభిప్రాయాలు- వారికి ఆ స్వేచ్ఛ ఉంటుంది-వారి రాతలు వారు రాసుకుంటారు- వారి ఆలోచనలను వారు ప్రకటించుకుంటారు- వారి 'వాల్' మీద వారు ఏమైనా రాసుకుంటారు- మనం ఖండించడం అనవసరం- అదేమీ డిబేట్ కాదు- చర్చిద్దాం రమ్మని వారేమీ మనల్ని ఆహ్వానించలేదు- వారి అభిప్రాయాలు మనకు నచ్చకపోవడం లాగే,మన అభిప్రాయాలు కూడా వారికి నచ్చకపోచ్చు- దాంతో ఎవరికీ ఏమీ ప్రమాదం లేదు ,నష్టం లేదు- వాదించడం వృథా కద ' అనుకోవాలి !విని ఊరుకోవాల్సిన వాటిని ,తలకు తగిలించుకుంటారు,బొప్పి కట్టించుకుంటారు!వినడం ఇష్టం లేకపోతే మానెయ్యాలి!అంతే కానీ , అవతలి వైపు ఉన్న వారిని శతృవుల తీరుగా భావిస్తూ ఖండన మండనలకు దిగి ఉన్న సంబంధాలను చెడగొట్టుకునే ప్రయత్నం చెయ్యకూడదు!వారి అభిప్రాయాలను నువ్వు ఒప్పుకోనప్పుడు,నీ అభిప్రాయాలను వారు ఒప్పుకోరు కద!పైగా అది వారి సొంత వేదిక కద,మనం వెళ్ల కూడదు- మన అభిప్రాయ ప్రకటనకు మనకూ ఓ వేదిక ఉంది!కామన్ సెన్స్ పోగొట్టుకోకూడదు!కామన్ సెన్స్ ను పోగొట్టుకున్న వారు,చాలా వాటిని పోగొట్టుకుంటారు!ఉదాహరణకు చెప్పాలంటే, మనకు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత - ఫేస్ బుక్ వాట్సాప్ వగైరా మాద్యమాలు భావప్రసార సాధనాలు అందుబాటులోకి వచ్చిన ప్రతీ వారికి తమతమ అభిప్రాయ ప్రకటనలకు అవకాశం ఏర్పడింది- స్వేచ్ఛగా ఎవరి అభిప్రాయాలను వారు ,ఎవరు ఏర్పాటు చేసుకున్న వేదిక మీద వారు ప్రకటించుకోవచ్చు!మరొకరి సొంత వేదిక మీదికి వెళ్లి , వారి అభిప్రాయాలను వ్యతిరేకించి మీరు సాధించేది ఏమీ ఉండదు,పైగా ఉన్న సంబంధాలను దెబ్బ తీసుకుంటారు!మెడలు పట్టి బయటకు గెంటించుకుంటారు!అభిప్రాయాల ప్రకటనకు ఎవరి వేదికను వారు ఉపయోగించుకోవాలి,మరొకరి వేదిక మీదికి వెళ్లి వారి అభిప్రాయాలను ఖండించకూడదు!అది అప్రజాస్వామ్య ధోరణి అవుతుంది!మనలో నియంతృత్వ ధోరణి ఉంటే,మనకు అందరూ దూరం అవుతారు!అనవసరమైన జోక్యాలను వదులుకునేవారు,జీవితంలో ప్రశాంతతను సాధించగలుగుతారు!
గుడ్మార్నింగ్ (124 వ రోజు): -తుమ్మేటి రఘోత్తమరెడ్డి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి