జక్కాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కి మూడు వేల రూపాయల విలువ గల 50 పుస్తకాలు బహుకరణ.
 ఇటీవల   చెన్నయ్ తెలుగు వెలుగు సంక్షేమ సంఘం నిర్వహించిన జాతీయ స్థాయి సంక్రాంతి బాల సాహిత్య కథల పోటీలో ప్రత్యేక బహుమతి సాధించిన  సందర్భంగా సిద్దిపేట జిల్లా  జక్కాపూర్ ఉన్నత పాఠశాల కు చెందిన 8వ తరగతి విద్యార్థిని కయ్యాల నిఖిత కు ఉభయ రాస్ట్రాల నుండి బాల సాహిత్య రచయితలు, రచయిత్రులు,కవులు,కవయిత్రులు మరియు సంపాదకులు తాము వ్రాసిన బాల సాహిత్య (కథలు/గేయాలు/కవితలు/పద్యాలు/మణిపూసలు/పొడుపు కథలు ) పుస్తకాలను  బహుకరించారు.మూడు వేల రూపాయలు విలువ గల 50 పుస్తకాలను సిద్దిపేట పట్టణ మండల విద్యాధికారి యాదవరెడ్డి చేతుల మీదుగా  విద్యార్థిని నిఖిత కు  శనివారం రోజున అందచేశారు.  "పుస్తకాలు చాలా విలువైనవని,పుస్తకాలు చదివి అత్యున్నత స్థానానికి చేరాలని "నిఖితకు సూచించారు.  పుస్తకాలు సేకరించిన హిందీ ఉపాధ్యాయులు భైతి దుర్గయ్య ను విద్యాధికారి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నర్సింహారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాళ్లబండి పద్మయ్య ,ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థిని ని అభినందించారు.తమ విద్యార్థిని కి పుస్తకాలు పంపించిన ప్రతి ఒక్కరికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం  కృతజ్ఞతలు తెలియచేసారు.