పిసినారి - ముసలామె (బాలల హాస్య కథ)- - డా.ఎం.హరి కిషన్ - 9441032212


 ఒక వూరిలో ఒక పిసినారి వుండేటోడు. వాడు తన దగ్గర పనిచేసే వాళ్ళకి ఏదో ఒక తప్పు చూపించి జీతం సరిగ్గా ఇవ్వకుండా ఎగ్గొట్టేవాడు. ఒకసారి ఒక ముసలామె పని వెదుక్కుంటా ఆ పిసినారి వద్దకు వచ్చింది. పిసినారి ఆమెతో ''ఇళ్ళంతా అద్దం లెక్క తళతళలాడి పోయేలా తుడిచి పెట్టాలి. ఒక్క ఈగగానీ, దోమగానీ కనబడకూడదు. కనబన్నాయనుకో ఈగకు వంద చొప్పున జీతంలో పట్టుకుంటా. ఏం సరేనా'' అన్నాడు. ముసలామె సరే అనింది. ఆ రోజునుంచీ రోజూ పొద్దున్నే ఇళ్ళంతా ఫినాయిలు వేసిన నీళ్ళతో కడిగేది. ఎక్కడా చెత్త, దుమ్ము లేకుండా చూసుకునేది. అలా నెలరోజులు గడచిపోయినాయి. జీతం ఇచ్చేరోజు వచ్చింది.


పిసినారి ఒక బెల్లం ముక్క తెచ్చినాడు. ముసలామెకు కనబడకుండా అలమరాలోఒక మూలకు పెట్టినాడు. తీపివాసన తగలగానే ఎక్కడెక్కడి ఈగలు వచ్చి దాని మీద వాలతాయి గదా... కాసేపటికే ఝుమ్మని ఐదు ఈగలు లోపలికి వచ్చేసినాయి. బెల్లం కోసం ఇళ్ళంతా రయ్యిమని తిరగసాగినాయి. పిసినారి వాటిని చూపించి ముసలామెను కోప్పడతా ''నీకు ముందే చెప్పాను గదా... ఒక్కో ఈగకు వంద జీతంలో పట్టుకుంటా అని'' అంటా ఐదు ఈగలు చూపించి ఆమె చేతిలో ఐదు వందలు పెట్టినాడు.


అలా నాలుగు నెలలు గడచిపోయినాయి. నెలంతా ఎక్కడా కనబడని ఈగలు జీతాలరోజే కనబడతా వున్నాయంటే ఇందులో ఏదో మోసం వుందని అనిపించింది ముసలామెకు. ఒకరోజు దాచిపెట్టుకోని పిసినారినే గమనించసాగింది. బెల్లం ముక్క అలమరాలో పెట్టడం చూసింది. ''అమ్మ దొంగా... ఇదా సంగతి'' అనుకోనింది.


తరువాత రోజు పిసినారి పండుకోనింటే బెల్లం పొడి కొంచం తడి చేసి ముక్కు మీద పూసింది. కాసేపటికి వాడు లేచినాడు. అంతలో బెల్లం వాసన తగిలి ఒక ఈగ రయ్యిమని వచ్చి పిసినారి ముక్కు మీద వాలింది. అంతే... ఆ ముసలామె ఒక లావు కట్టె తీసుకోని వురుక్కుంటా వచ్చి ''సామీ... కదలొద్దు... నీ ముక్కు మీద ఈగ వుంది. దాని సంగతి చూసుకుంటా'' అనింది కట్టె పైకెత్తి.


''ఒసేవ్‌ ముసలిదానా!... దాంతో కొడితే ఈగ సంగతేమో గానీ నా ముక్కు పచ్చడి పచ్చడి ఐపోతాది. వదిలేసెయ్‌'' అన్నాడు. దానికామె ''అమ్మా... వదిలితే నా జీతంలో వందా పోతాది. ఈ రోజు దీని అంతు చూడవలసిందే'' అనింది పళ్ళు పటపటా కొరుకుతా.


ఆ మాటలకు పిసినారి అదిరిపోయినాడు. ''కొట్టిందంటే ముక్కు పగిలి మూడు నెలలు మూలుగుకుంటా మంచం మీద కూచోవడం ఖాయం'' అనుకోని ''నీ వందా నువ్వు తీసుకుందువు గానీ ఈ సారికి వదిలేయ్‌'' అన్నాడు.


దానికామె ''సామీ... ఒక్క నెలా గాదు... రెండు నెలలూ గాదు... నాలుగు నెలల నుంచి రెండు వేలు పోయినాయి. ఈ దిక్కుమాలిన ఈగల నుంచి దీన్ని వదిలేదే లేదు. ఈ రోజు అదో నేనో తేలిపోవలసిందే'' అనింది చిందులు తొక్కుతా కట్టె మరింత పైకి లేపి.


ఆమె కోపం చూడగానే వాడు మరింత వణికిపోయినాడు. ''తల్లీ... తప్పయిపోయింది. నీ రెండు వేలు నీ చేతిలో పెడతా. ఈ ఒక్కసారికి వదిలేయ్‌'' అంటా దండం పెట్టినాడు. అప్పుడు ఆ ముసలామె ''సరే అయితే'' అని లోపల్లోపల నవ్వుకుంటా కట్టె దించింది.


పిసినారి గమ్మున లోపలికి పోయి రెండువేలు తెచ్చి మట్టసంగా ఆమె చేతిలో పెట్టినాడు.