తీరిన సందేహం:--- సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి--మొబైల్: 9908554535

  పూర్వం రత్నగిరి గ్రామంలో హరి శాస్త్రి అనే పండితుడు ఉండేవాడు. అతడు చాలా సమయస్ఫూర్తి కలవాడు. తెలిసిన ఈ విషయాలనే కాకుండా తెలియని విషయాలను కూడా అప్పటికప్పుడే కథలుగా అల్లి  చెప్పేవాడు. అవి అందరూ నమ్మే విధంగా ఉండేవి. ఆ గ్రామంలోని వారు ఏదైనా సందేహం వచ్చినా హరి శాస్త్రిని అడిగేవారు.
            ఇలా ఉండగా ఆ గ్రామంలోనే  రంగడు అని ఒక పోకిరి యువకుడు ఉండేవాడు. వాడు చాలా తెలివిగల వాడు . ఎలాగైనా హరిశాస్త్రిని  ఏదైనా సందేహం అడిగి ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో ఉండేవాడు.
         ఒకసారి ఉగాది సందర్భంగా దేవాలయంలో హరి శాస్త్రి పంచాంగం శ్రవణం చేస్తూ, "ఈ సంవత్సరం పశువులు సమృద్ధిగా పాలిస్తాయి .పశుసంపద బాగా అభివృద్ధి చెందుతుంది" అని చెప్పాడు. వెంటనే రంగడు లేచి" శాస్త్రిగారూ! పశువులు" అంబా! అంబా" అని అరుస్తాయి. ఎందుకండీ "?అని ప్రశ్నించాడు? ముందు కంగారు పడిన శాస్త్రి వెంటనే తేరుకొని ఒక కథను అప్పటికప్పుడే ఊహించి ఇలా చెప్పారు.
            " కైలాసంలో శివుని వద్ద ఉన్న నందీశ్వరుడు ఒకసారి గంగను పొగడడం మొదలుపెట్టాడు. అప్పటికింకా పశువులు భూలోకంలో పుట్టలేదు. వెంటనే అక్కడకు వచ్చిన పార్వతీదేవి నందీశ్వరుని మాటలు విని కోపించి, నీకు ఏమి మాట్లాడాలో తెలియదు .నా ముందరే నా సవతిని పొగడుతావా! స్త్రీల ముందర మరో స్త్రీని పొగిడితే సహిస్తారా! ఇది కూడా నీకు తెలియదా !అందుకే మానవులు మందమతులను నీ పేరు మీద మీద "పశువా "అని  పిలుస్తారు .నీతో పాటు మీ జాతి అంతా పశువులుగా భూలోకంలో జన్మించండి . మానవులకు చాకిరీ చేయండి .మీ పేరుమీద గొడ్డు చాకిరీ అన్న నానుడి ఏర్పడుతుంది "అని శపించింది .
       ఆ  శాపానికి  కంగారు పడిన నందీశ్వరుడు "అమ్మా! నేను చేసిన తప్పుకు నా జాతి అంతా  శిక్ష అనుభవించాలా! దయచేసి నీ శాపాన్ని ఉప సంహరించు" అని ప్రాధేయ పడ్డాడు .అప్పుడు మనసు కరిగిన పార్వతి "మీరు భూలోకంలో జన్మించినప్పటికీ మానవులకు పెంపుడు జంతువులై వారి కొరకై శ్రమించి వారికి తోడ్పడతారు. వారు మిమ్మల్ని తమ  పిల్లలకన్నా ఎక్కువగా చూసుకుంటారు .తల్లిలేని పిల్లలకు మీ పాలను పోస్తారు .మీ పాలతో మానవజాతి ఉత్సాహంగా ఉండేందుకు తేనీరు, కాఫీలు తయారుచేసుకొని త్రాగి పని చేస్తారు" అని పలికింది .
         ఆ మాటలను విన్న   నందీశ్వరుడు" అమ్మా! నీవు లేకుండా నేను గాని ,మా పశువుల జాతి గానీ ఉండలేము . కన్నతల్లే కోప్పడితే మా గతి ఏం కావాలమ్మా !"అని వేడుకున్నాడు. అప్పుడు పార్వతీ దేవి " మీరేమీ భయపడకండి. మీరు భూలోకంలో ఉన్నప్పటికిని మీకు ఆపద వచ్చినా, ఆప్యాయత కలిగినా నాపేరునే "అంబా అంబా "అని స్మరిస్తారు."అంబా" అంటే నా పేరే అని చాలామందికి తెలియదు. అంతే కాదు. మీ జాతికి చెందిన ఆవులు మానవజాతిచే పూజలు అందుకుంటాయి .నేనెప్పుడూ మిమ్ములను కాపాడుతాను. మానవులు మిమ్మల్ని దేవతలుగా కొలుస్తారు "అని పలికింది. అప్పటినుండి పశువులు  "అంబా !అంబా "అని పార్వతీ దేవిని పిలుస్తున్నాయి. తలుస్తున్నాయి. అర్థమైందా "అని అన్నారు శాస్త్రి గారు. రంగడు అర్థమయిందన్నట్లు తలను ఊపాడు.
         శాస్త్రి గారు చెప్పిన ఈ కథ విని అక్కడి వారందరూ ఆయన సమయస్ఫూర్తిని అభినందించారు. రంగడు సిగ్గుతో తలవంచుకున్నాడు. మరోసారి రంగడు శాస్త్రి గారి జోలికి పోలేదు.