మనం ఏది పడితే అదే మాట్లాడవచ్చునా?
ముఖ్యంగా - అవి అభినందనలు కావచ్చు, పొగడ్తలు కావచ్చు, జయజయధ్వానాలు కావచ్చు!
అమర్ రహేలు కావచ్చు!
సూటిగా పాయింట్ కు రావాలంటే, మనం ఆచరించని విషయాల గురించి , మనం ఇతరులకు చెప్పవచ్చునా?
ఇతరులు ఆచరిస్తూ ఉంటే,మనం 'ఆహా ఓహో ' అని అనవచ్చునా? కీర్తించవచ్చునా?
ఇందులో కూడా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఓ మనిషి తన ప్రాణాలను సమాజం కోసం దారపొయ్యడాన్ని, మనబోటి సంసార జీవితం గడుపుతున్న వారు,ఎవరో ఒకరు సమ సమాజం స్ధాపన కోసం పోరాడి పోలీసుల చేతిలో చంపబడితే ,దాన్ని మనం 'త్యాగం' పేరుతో పద్యాలు రాసి,పిడికిల్లు బిగించి మందికి చెప్పవచ్చునా అని!? కీర్తించవచ్చునా అని?
సాయుధ పోరాటం అవసరమా కాదా అనే చర్చ కాదు సుమా నేను చెప్పేది- నైతిక బాధ్యత గురించి మాత్రమే అంటున్నాను- గ్రహించాలి!
నాకు ఈ ప్రశ్న ఓ నలబై సంవత్సరాల క్రితం ,ఓ రచయితల సంఘం జరిపిన ఓ సదస్సులో ఉపన్యాసాలు ఇస్తున్న వారినీ , సభాసదులనూ,వారి వ్యక్తిగత జీవితాలను నేను ఎరిగినంత మేరకు చూస్తున్నప్పుడు అప్పుడు కలిగిన ప్రశ్న!
సాయుధ పోరాటం సాగించేవారిని,సంసార జీవితం గడిపేవారు పొగడవచ్చునా? పొగిడి యధావిధిగా తమతమ ఉద్యోగాలు వ్యాపార వాణిజ్యాలు సంసారాలు బిడ్డల పెద్దపెద్ద చదువులు ,అమెరికా ఉద్యోగాల వైపు దారి చూపడాలు , ఇల్లు స్ధలాలు కొనుక్కుని , ఆర్ధక సేఫ్ సైడ్ చూసుకుని- మళ్లీ విప్లవ సంఘాల సదస్సులు ఎక్కడ జరిగినా , ఓ రెండు మూడు రోజుల పాటు వెళ్లి రావడం ,ఉపన్యాసాలు పుస్తకాలు వగైరా ,చెయ్యవచ్చునా అని? మనం ఆచరించలేని తీవ్రమైన త్యాగపూరితమైన విషయాలను ఎవరికి చెపుతున్నట్టు? వాటికి ఏమైనా విలువ ఉంటుందా? వినేవారు నమ్ముతారా?
'ఇలా చెపుతున్నారు కద? మరి వీరు అదే ఆచరిస్తున్నారా?' అని ,విన్నవారు ఆలోచనలు చెయ్యరా?
నిన్ననో మొన్ననో ఓ తల్లి మరణించారు! ఆమె కూతుళ్లు విప్లవోద్యమంలో పని చేస్తున్నారట- ఆ కారణంగా ఆ తల్లి తన గత పాతికా ముప్పై సంవత్సరాల పాటు కూతుళ్లు కనపడతారేమో అని ఎదురు చూస్తూ బ్రతికిందట!
ఆ తల్లి వేదన బిడ్డలకు ఎన్నడు అర్థం కావాలి!?
ఆ తల్లి మరణానికి సంతాపం వ్యక్తం చేసిన, ఆ సంతాప మాటల్లో రాతల్లో కూడా ,ఆ తల్లి గురించి కంటే ,ఆ అజ్ఞాత వాస ఇద్దరు కూతుళ్ల త్యాగ ప్రసక్తులే ఎక్కువ- విప్లవోద్యమాన్ని త్యాగాలను పొగడటమే ఎక్కువ!
అలా సంతాపాన్ని తెలిపిన వారు ఎవరెవరాని చూస్తే , ఎవరూ సాయుధ పోరాటం చేసే వారు కాదు,అందరూ ఇదే 'వ్యవస్థ' లో ,ఏవో ఉద్యోగ వ్యాపారాలు సంసారాలు వగైరా మామూలు జీవితాలను గడిపేవారే!
ఓ మనిషి మరణానికి ,దగ్గరివారు సంతాపం వ్యక్తం చెయ్యడం గురించి కాదు సుమా? మనం చెయ్యని, చెయ్యడానికి సాహసించని మార్గాన్ని ,మనం పొగడవచ్చునా అని?
ఇప్పుడు పరవాలేదు కాని, ఓ నలబై సంవత్సరాల క్రితం వందలాది మంది యువత అటువంటి త్యాగ కీర్తనలకు పొంగిపోయి సాయుధ పోరాట పంథాలను పట్టి సాగిపొయ్యారు- ప్రభుత్వ బూటకపు ఎన్ కౌంటర్లలో చంపబడ్డారు- ఎందరు తల్లుల కడుపులు కాలెనో?
ఈ తరం మీద అటువంటి నటప్రచారాల ప్రభావం లేదు!
అందుకే 'కేరీరిస్టు' తరం మీద ఎంత కోపమో ఈ నట విప్లవకారులకు? బ్రతుకూ- బ్రతుకనివ్వూ అని చెప్పిన అతి ప్రాచీన జైన సిద్దాంతం గురించి వారెవరూ మాట వరసకైనా మాట్లాడరు! నటన అంటే అదీ!
మనం నటిస్తే, దాన్ని నిజం అని నమ్మే కాలం కాదు ఇది!
అందుకే ఫేడౌట్ అవుతున్నారు! అంతరిస్తున్నారు!
ఇదంటే ఇదే కాదు,విషయం ఏదైనా మనం ఆచరిస్తే కద చెయ్యమని చెప్పడానికి?! అది కనీస ధర్మం కద!?
మన మాటకు శక్తి ఎప్పుడు ఎప్పుడు వస్తుంది?
మనం ఆచరించి చూసినప్పుడు మాత్రమే వస్తుంది!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి