అందమైన తెల్లని పూలలో కలువ పూవు ఒక్కటి. పల్లెలోని కొలనుల్లోని దేవాలయాలలోని కోనేరుల్లోని నీటిలో తీగకు పూచే పూవు ఇది. తెల్లగా, సున్నితంగా, మృదువుగా ఉండే పుష్పము ఇది.సమీరస్పర్శకి కొలను నీటి అలలు కదలాడు తుండగా అపుడపుడే లోకాన చంద్రకాంతి పరచుకుంటున్నపుడు అంతవరకు ముకుళితమైయున్న కలువలు చంద్రుణ్ణి చూసి చూడగానే సంతోషంతో ప్రఫుల్ల వదనాలౌతాయి. రాత్రులందు వికసించే ఈ కలువను "నిశాపుష్పము "అని అంటారు. చంద్రుడు అంటే ఇష్టం కనుక కలువను "శశిప్రియ" అని అంటారు.కలువ పూవును కైరవము, తొగ, తొవ, ఇందీవరము కులయము, డోలాబ్జము మొదలైన పేర్లతోనూ పిలుస్తారు. ఈ కలువలలో – సోమ బంధువు, కుముదము, సృకము మొదలైన పేర్లతో పిలువబడే తెల్లకలువలు,; సురభి, సౌగంధికము, రక్తోత్పలము మొదలైన పేర్లతో పిలువబడే ఎఱ్ఱకలువలు; నీలోత్పలము, కృష్ణపూరము, నల్లతొవ మొదలైన పేర్లతో పిలువబడే నల్ల కలువలు ఉన్నాయి.పట్టణాలలో, నగరాలలో వినాయకుడి పూజలో తప్ప చూడలేని పూవైన కలువలా తెల్లగా అందంగా సౌరభంతో ఉండే పూవు మరొకటి ఉంది. అదే చెంగలువ. బాల కృష్ణుడి వర్ణనలో చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ – అంటూ చెప్పబడిందే కదా. ఐతే చదువుల తల్లి సరస్వతికి నీలోత్పలమం టే చాలా ఇష్టమట. అందుకే ఆమె పూజలో వాటిని తప్పనిసరిగా ఉంచుతారు. కలువ పూలతో కట్టిన మాలను కల్హారము అని అంటారు.గుప్పెడు పిట్టకు బారెడు తోక – అని, చల్లని నీళ్ళలో ఎర్రదీపం – అని మన తెలుగు పొడుపు కథల్లో కూడా స్థానం పొందింది కలువ పూవు.‘కన్నులు కలువల రేకుల’ని కవుల కళ్ళను వర్ణించటం జరిగింది. చంద్రుడున్నపుడే కలువ వికసిస్తుంది. అది ప్రకృతి సహజం. అయితే కవులు ఆ రెండింటి గురించి – నింగిలో చందమామ. నీటిలో కలువభామ – అంటూ ఎన్నో రకాలుగా వర్ణించారు."మేలిమి బంగరు మెలతల్లారాకలువల కన్నుల కన్నెల్లారా – అని,కన్నుల కాంతులు కలువల చేరెనుమేలిమి జేరెను మేని పసల్ – అనిశ్రీ గురజాడ అప్పారావు అనే కవి పూర్ణమ్మ కథలో పూర్ణమ్మ గురించి వర్ణించారలా....పారిజాతాపహరణము – అనే కావ్యంలో చంద్రోదయమును వర్ణించే పద్యంలో – ‘కైరవములకు వెన్నెల నీరు పరవబూని చేర్చిన పటికంపు దోను లనగ గ్రమముతో శీత కరమయూఖములు గగన భాగమున గొన్ని యల్లన బ్రాకుదెంచె’ – అంటూ చెప్పబడింది.చంద్రుడు లేనివేళ – రాని వేళ ముడుచుకు వెలవెలపోయే కలువలను చూచి జగన్నాథ పండితరాయలు అనే సంస్కృత కవి చేసిన రచనకు మహీధర నళినీమోహన్“అమృత మయూఖ! జేరువున కవ్వలిభాగమలంకరింప నాత్రముగ ప్రయాణ మైతివి కదా! నిను నాపగజాలకాని, ఈకుముద కులాంగనా జన నిగూఢ విషాదము మాన్ప రేపు కొంచెము త్వరితముగా నిటకు చేరగ రమ్మని మ్రొక్కి వేడెదన్ ”(భావతరంగాలు -48) – అంటూ తెలిపారు.గమనించారుగా కలువల – చంద్రుని చుట్టరికం.మ్మధుడికి గల అయిదు వింటి నారులలో ఒకటైన చిగురుటల్లెకు వాడే బాణాలలో నల్లకలువ కూడా ఒకటి.చూశారా మన తెలుగుభాష ఎంత గొప్పదో....ఒక్కో అంశాన్ని గురించిఎంత విజ్ఞానాన్ని అందిస్తోందో....
మన భాష తెలుగుతెలుసుకొంటే వెలుగు(తెలుగు ఒడిలో...2)-రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి