మూసిన గుప్పిట విప్పకు* ( కమ్మని వూహలు , అందమైన అబద్దాలు )-డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212

 పిల్లలూ... మనింట్లో పాలు,పెరుగు కనబడితే చాలు పిల్లి చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటా వచ్చి గుటుక్కున లాగించేసి ఛటుక్కున మాయమై పోతా వుంది గదా... మనం పాలగిన్నెలు, పెరుగు గిన్నెలు దానికి దొరక్కుండా ఎంత జాగ్రత్తగా దాచినా దాని బాధ నుంచి తప్పించుకోలేక పోతా వున్నాం గదా... మరి పిల్లులు ఎందుకట్లా మన పాలను, పెరుగును తాగేస్తా వున్నాయో మీకేమైనా తెలుసా... తెలీదా... పరవాలేదు... సరదాగా కాసేపు ఈ కమ్మని కథ వినండి. మీ అనుమానాలన్నీ పటాపంచలు అయిపోతాయి.
ఇది ఎప్పట్లాగే చాలా కాలం కిందటి సంగతి. అప్పట్లో కుక్క, పిల్లి, ఎలుక చాలా స్నేహంగా వుండేవంట. కుక్కేమో మనిషి దగ్గర వుండేదంట. అది పొద్దున పూట వేటలో సాయం చేస్తా, రాత్రిపూట ఇంటికి కాపలా కాస్తా చాలా నమ్మకంగా వుండేదంట. మనిషికి గూడా కుక్కంటే చాలా ఇష్టం. మూడు పూటలా కడుపు నిండా తిండి పెడతా కన్నబిడ్డలా చూసుకొనేటోడు.
ఈ కుక్క రాత్రిపూట ఇంటి ముందు కాపలా కాస్తా వుంటాది గదా... ఆ సమయంలో పిల్లీ, ఎలుకా అక్కడికి చేరుకునేవి. మూడూ కబుర్లు చెప్పుకుంటా, ఆటలు ఆడుకుంటా రాత్రుళ్ళంతా సరదాగా గడిపేవి.
మనిషికి తన పెళ్ళామంటే చాలాచాలా ఇష్టం. ఆమె కోసం ఏదయినా అపురూపమైనది కానుకగా తెచ్చియ్యాలని బాగా ఆలోచించాడు. అక్కడికి చాలాచాలా దూరంలో ఒక రత్నాలకొండ వుందంట. అక్కడికి పోవడం చాలా కష్టమంట. ఐనా సరే పెళ్ళాం కోసం పోవాలనుకున్నాడు. అడవులు దాటాడు. కొండలు దాటాడు. నదులు దాటాడు. మైదానాలు దాటాడు. అట్లా ఏడు పగళ్ళు, ఏడు రాత్రులు ప్రయాణించి చిట్టచివరికి ఆ కొండను చేరుకున్నాడు. కొండంతా అంగుళం అంగుళం గాలించి ఎవరూ, ఎప్పుడూ, ఎక్కడా చూడనంత అందమైన రత్నాలు రంగురంగులవి ఏరుకొచ్చాడు. వాటితో ఒక చూడముచ్చటయిన దండ చేశాడు. అది తీసుకుపోయి ప్రేమగా పెళ్ళానికిచ్చాడు. ఆమె దాన్ని మెడలో వేసుకోని ప్రతి ఇంటి తలుపూ కొడతా అక్కా చూసినావా... వదినా చూసినావా... అంటా కనబడినోళ్ళకంతా చూపించుకుంటా తెగ మురిసిపోయింది.
అట్లా కొద్దిరోజులు గడిచిపోయాయి. ఒకసారేమైందంటే వూళ్ళల్లో దొంగతనాలు ఎక్కువయిపోయాయి. చీకటి పడితే చాలు దొంగలు గుంపులు గుంపులుగా దాడి చేస్తా ఎక్కడివక్కడ మాయం చేయసాగారు. దాంతో ఆ మనిషి రత్నాల హారాన్ని తీసుకుపోయి ఒక చెట్టు కింద గుంత తవ్వి అందులో జాగ్రత్తగా దాచిపెట్టాడు. కుక్కను పిలిచి ''జాగ్రత్త... ఇదంటే నా పెళ్ళానికి ఎంతిష్టమో నీకు తెలుసు గదా... అటూ యిటూ కదలకుండా కంటికి రెప్పలా కాపాడు. ఏ మాత్రం అనుమానమొచ్చినా సరే, ఏ సమయంలోనైనా సరే నన్ను లేపు'' అని చెప్పాడు. కుక్క సరేనని ఆ గుంత దగ్గరే కాపలా కూర్చుంది.
చీకటి పడగానే ఎప్పట్లాగానే పిల్లీ ఎలుకా అక్కడికి వచ్చాయి. ''రా... మిత్రమా... ఆడుకుందాం'' అంది పిల్లి. కానీ కుక్క అక్కడి నుంచి ఇంచు గూడా పక్కకు కదలకుండా ''ఈరోజేమీ ఆటలొద్దులే మిత్రమా... ఇక్కడే కూచోని ఏవయినా కబుర్లు చెప్పుకుందాం'' అంది. ఎప్పుడు చూసినా గాలికి కదిలే కొమ్మలెక్క సరసరసర చలాగ్గా అటూ యిటూ కదిలేది కాస్తా అట్లా మూగెద్దులెక్క ఒక్కచోటనే కూర్చునేసరికి పిల్లికి అనుమానమొచ్చింది. ''ఏంది మిత్రమా... ఏమైంది. నువ్వేదో దాస్తా వున్నావు. చెప్పకుంటే మామీదొట్టే'' అంది. దాంతో కుక్క ''అయ్యయ్యో... అంతంత పెద్దపెద్ద మాటలనొద్దు మిత్రమా... ఈ ప్రపంచంలో మీకన్నా ఏదీ నాకెక్కువ కాదు. కానీ రహస్యం గడప దాటితే వూరు దాటుతుందంటారు గదా అందుకే చెప్పలేదు. ఇది మీ మనసులోనే వుంచుకోండి'' అంటూ జరిగిందంతా చెప్పింది. దాంతో సరేలే అని పిల్లీ ఎలుకా అక్కడే ఆడుకున్నాయి.
తరువాత రోజు పొద్దున్నే కుక్క ముందురోజంతా బాగా మేల్కోని అలసిపోవడంతో నిద్రనాపుకోలేక అట్లాగే ఆ చెట్టు కిందనే నిద్రపోయింది. అప్పుడు పిల్లి ఎలుకను పిలిచి ''మిత్రమా... నాకు నిన్న కుక్క చెప్పినప్పట్నించీ ఆ రత్నాల హారం ఎట్లా వుంటాదో చూడాలని మనసు తెగ లాగేస్తా వుంది. ఒక్కసారి దాన్ని తీసి చూద్దామా'' అంది. దానికి ఎలుక ''వద్దు మిత్రమా... ఏదయినా అనుకోకుండా జరగరానిది జరిగితే మాట పోతాది'' అంది. కానీ పిల్లి వినలేదు. అది వద్దు వద్దంటున్నా వినకుండా మట్టసంగా అడుగులో అడుగు వేసుకుంటా పోయి చప్పుడు కాకుండా గుంత తవ్వింది. రత్నాలహారాన్ని తీసుకోని మరలా గుంతను ఎట్లున్నేది అట్లాగే బూడ్చేసింది.
ఆ రత్నాల హారం ధగధగలాడతా చూస్తానే కళ్ళు చెదిరిపోయేలా చూడముచ్చటగా వుంది. ''అబ్బ... ఎంత ముద్దుగుందిది. ఒక్కసారయినా ఇట్లాంటిది వేసుకోని ఈ బ్రతుకు బ్రతకడం కన్నా సావడం మేలు'' అంటూ ఎలుక వద్దు వద్దంటున్నా వినకుండా దాన్ని మెడలో వేసుకోని ఆ గుట్ట మీద నుంచి ఈ గుట్ట మీదకు, ఈ గుట్ట మీద నుంచి ఆ గుట్ట మీదకు ఎగురుకుంటా దుముకుకుంటా మురిసిపోసాగింది. అట్లా ఎగురుతా వున్నప్పుడు అనుకోకుండా దండ వూడి కింద ఎక్కడో పడిపోయింది. అక్కడ గడ్డంతా చాలా ఎత్తుగా, గుబురుగా, చిక్కగా వుంది. దాంతో పిల్లీ, ఎలుకా కలసి ఎంత వెదికినా వాటికి దండ దొరకలేదు. దాంతో పిల్లి ''మిత్రమా... ఇట్లా జరుగుతుందని నేను కొంచం గూడా వూహించలేదు. ఈ సంగతి మనిద్దరి మధ్యే వుంచు. రేపు మరలా వచ్చి వెదుకుదాం. దొరకగానే గుట్టు చప్పుడు గాకుండా ఎక్కడిదక్కడ పెట్టేద్దాం'' అంది. ఎలుక ఏమీ అనలేక తలూపింది.
అట్లా నాలుగురోజులు గడిచిపోయాయి. కానీ ఆ దండ మాత్రం దొరకలేదు. దాంతో పిల్లి ఏమీ తెలీని నంగనాచిలెక్క మట్టసంగా వుండిపోయింది. కొన్ని రోజులకు ఊర్లో దొంగతనాలు బాగా తగ్గిపోయాయి. దాంతో ఆ మనిషి దండ తీసుకొచ్చి పెళ్ళానికిద్దామని పోయి చెట్టు కింద గుంత తవ్వాడు. చూస్తే ఇంకేముంది దండా లేదు, గిండా లేదు. పాపం వాడు ఇక్కడ పెట్టానా, ఇంకెక్కడన్నా పెట్టానా అని ఆలోచిస్తా చెట్టు చుట్టూరా అంగుళం కూడా వదలకుండా తవ్వి చూశాడు. కానీ అస్సలది వుంటే గదా దొరకడానికి. దాంతో ఆ మనిషికి చాలా కోపం వచ్చింది.
వెంటనే కుక్కకెళ్ళి తిరిగి ''చూడు... ఈడ దాచిపెట్టినేది నీకూ నాకూ తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. జాగ్రత్తగా చూసుకోమని చిలుకకు చెప్పినట్టు చెప్పినా. ఐనా పోయింది. ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని నా పెళ్ళాం దగ్గరికి పోవాలి. నిన్ను నమ్ముకున్నందుకు తగిన శాస్తే జరిగింది. అన్నం తిన్న ఇంటికే కన్నం పెట్టే నీ మొహం ఇంకెప్పుడూ నాకు చూపించకు. ఫో ఈన్నించి'' అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తరిమేశాడు.
పాపం... కుక్క కళ్ళెమ్మట నీళ్ళు కారిపోతా వుంటే వెక్కివెక్కి ఏడుస్తా ''ఛ... ఛ... ఇంత బదుకూ బదికి ఇంటెనుక చచ్చినట్టు ఈ రోజు ఎన్ని మాటలు పడితి. మాట నిలబెట్టుకోలేని బదుకూ ఒక బదుకేనా'' అని ఒక పాడుబన్న బావిలో దుంకడానికి పోయింది. అది చూసిన ఎలుక వురుక్కుంటా దాని దగ్గరకు పోయి ''మిత్రమా... ఆగాగు. అంత తొందరొద్దు'' అంటూ జరిగిందంతా చెప్పింది.
దాంతో కుక్కకు చాలా కోపం వచ్చింది. పిల్లిని పిలిచి ''ఛ... ఛ... ఛ... నీవల్ల నా పరువూ మర్యాద అంతా గంగలో కలసిపోయింది. తప్పు చేయడం ఒక తప్పయితే దాన్ని దాచిపెట్టి ఏమీ తెలీని నంగనాచిలెక్క తిరగడం ఇంకో పెద్ద తప్పు. తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే నీలాంటి దాంతో స్నేహం చేయగూడదు. ఫో ఇక్కన్నుంచి. మళ్ళా ఎప్పుడూ నా కంట పడొద్దు'' అంటూ దాంతో స్నేహాన్ని తెంపేసుకొంది.
ఎలుకను పిలుచుకోని రత్నాలహారం పడిన పొదల దగ్గరికి పోయింది. ఆ దండను ఎప్పుడూ యజమాని పెళ్ళాం వేసుకునేది గదా... దాంతో దానికి ఆమె వాసన అంటుకోని వుంటాది. కుక్కలకు వాసన గుర్తుపట్టే శక్తి వుంటాది గదా... దాంతో ఆ పొదల్లో వాసన చూస్తా... చూస్తా... ఒక చీమలపుట్ట దగ్గర ఆగిపోయింది. ''ఓహో... దీంట్లో పడిపోయిందన్నమాట... అందుకే వాటికి కనబడలేదు'' అని ఎలుకను పిలిచింది. ఎలుక ఆ పుట్టలో దూరి ఆ దండను తీసుకొని వచ్చింది. కుక్క దాన్ని తీసుకుపోయి యజమానికిచ్చి ''రహస్యాన్ని రహస్యంగా దాచకపోవడం నా తప్పే. ఈ ఒక్కసారికి మన్నించండి. మళ్ళీ ఇట్లాంటి తప్పు ఎప్పటికీ చేయను'' అని వేడుకొంది. దాంతో యజమాని తిరిగి దాన్ని ఎప్పట్లాగే ప్రేమగా చూసుకోసాగాడు.
ఇదంతా చూసిన పిల్లి చేసిన తప్పు తెలుసుకోని పశ్చాత్తాపపడకపోగా కుక్కపై మరింత కోపాన్ని పెంచుకుంది. ఎట్లాగైనా సరే దాన్ని మనిషి ఇంట్లో నుంచి బైటకు తన్ని తరిమేలా చేయాలని అనుకుంది.
ఆ మనిషి ఇంట్లో ఒక ఆవు వుంది. అతను రోజూ పొద్దున్నే దాని పాలు పిండుకొని కొన్ని తాగి, మిగతావి వంటింట్లో తోడు వేసి పెట్టుకునేవాడు. ఆ పాలపై పిల్లి కన్ను పడింది. గుట్టుచప్పుడు గాకుండా ఇంట్లో దూరి కనబడిన పాలను, పెరుగును కళ్ళు మూసి తెరిచేలోగా మాయం చేయసాగింది. దాంతో ఆ మనిషికి ఇంట్లోకి ఎవరు వస్తా వున్నారో, ఎట్లా వస్తా వున్నారో అర్థం కాలేదు. పాలను ఎక్కడ దాచిపెట్టినా పిల్లి వదలడం లేదు. దాంతో కుక్కను కాపలా పెట్టాడు. కుక్క లోపలున్నంత సేపు పిల్లి అటువైపు గూడా వచ్చేది కాదు. కానీ అది కొంచం పక్కకి వెళ్ళిందంటే చాలు ఛటుక్కున వచ్చి లటుక్కున మాయమయ్యేది. దాంతో ఎన్ని రోజులైనా కుక్క గూడా ఏమీ కనుక్కోలేకపోయింది.
దాంతో మనిషి ''ఛీ... ఛీ... ఛీ... నీకు కడుపులో చల్ల కదలకుండా మూడుపూటలా కావలసినంత పెడతా వుంటే మెక్కీ మెక్కీ బాగా మబ్బు పట్టినట్లుంది. ఇంకో వారంలోగా కనుక్కోలేదనుకో. ఇంక నువ్వు నా ఇంట్లో వుండాల్సిన అవసరం లేదు'' అని హెచ్చరించాడు.
దాంతో కుక్క రాత్రనకా, పగలనకా నిద్రపోకుండా కాపలా కాయసాగింది. కానీ దొంగెవరో తెలుసుకోలేక పోయింది. రోజూ యజమాని చేత ఒకటే తిట్లు. ఏమి చేయాలా అని ఆలోచించి ఎలుకను పిలిచింది. ''మిత్రమా... కంటి నిండా నిద్రపోక ఎన్నిరోజులైందో తెలుసా... నువ్వే నాకు సాయం చేయాలి'' అంటూ జరిగిందంతా చెప్పింది. ఎలుక సరేనని వంటింట్లో ఓ మూల దూరి ఎవరికీ కనబడకుండా దాచిపెట్టుకుంది. కుక్క కాసేపు అటూ ఇటూ తిరిగి బైటకు పోయింది. అది అట్లా పోవడం ఆలస్యం పిల్లి ఇంట్లోకి దూరింది. అది ఎలుకను కనుక్కోలేక పోయింది. దాంతో ఎవరూ లేరులే అనుకోని గిన్నెలో వున్న పాలనంతా నున్నగా తాగేసి మాయమైంది. ''ఓహో! ఇదన్నమాట సంగతి'' అనుకోని ఎలుక జరిగిందంతా కుక్కకు చెప్పింది.
దాంతో కుక్కకు పిచ్చి కోపం వచ్చింది. ఇంతకు ముందు తప్పు చేసినా స్నేహితుడే గదా అని వూరికే తిట్టి వదిలేసినందుకు బుద్ది తెచ్చుకోక మళ్ళా నన్నే వీధిపాలు చేయాలని చూస్తాదా... దొరకనీ దాని సంగతి చెప్తా'' అంది. ఆరోజు నుంచి పిల్లి కనబడితే చాలు పూనకం వచ్చిందాన్లా వూగిపోతా తరిమితరిమి కొట్టసాగింది. కుక్కకు ఈ సంగతంతా ఎలుకే చెప్పిందని పిల్లికి తెల్సిపోయింది. దాంతో దానికి ఒళ్ళు మండి ''ఏమే... గింతగూడా లేవు. నన్నే పట్టిస్తావా... వుండు నీ పని చెబుతా'' అని ఎలుక కనబడితే చాలు వెంటపడడం మొదలుపెట్టింది. అట్లా కుక్క పిల్లిని, పిల్లి ఎలుకను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. అంతేగాదు పిల్లి మనిండ్లల్లో పాలు, పెరుగు కనబడ్తే చాలు మాయం చేస్తా అందర్నీ సతాయిస్తా వుంది.
కామెంట్‌లు