సీతయ్య గుడి వైభవం!: - దోర్బల బాలశేఖర శర్మ

 మహాశివరాత్రి. రామాయంపేటలోని ఒకనాటి మా సీతయ్య గుడి (శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం) వైభవం గుర్తుకు వస్తున్నది. నాపై ఎంతో ప్రభావం చూపిన ఈ (మా) దేవాలయం పట్టణంలోనే 'అతి పురాతనమైంది'. ఎందుకంటే, ఈ గుడికి ఉన్నటువంటి కోనేరు  (పుష్కరిణి) ఊళ్లోని మరే ఆలయానికీ లేదు. బిక్కనూరు సిద్ధరామేశ్వర స్వామి గుడి పెద్ద కోనేరును ఇది పోలి ఉండటం గమనార్హం. ప్రతీ మహాశివరాత్రి వేళ ఈ గుడి కొత్తకాంతితో తలుకు లీనుతుంది.

మధ్యాహ్నం మూడు గంటలకల్లా అమ్మా, నాన్న మడి వస్త్రాలతో గుడికి వెళ్లేవారు. పిల్లలం మేమూ వారితోపాటు గుడి ప్రాంగణంలోనే ఉండేవాళ్ళం. ఇద్దరూ కలిసి అభిషేకం చేసేప్పటికి పొద్దు పొడిచేది. అప్పుడు భక్తుల రాక, పూజలు మొదలయ్యేవి. చీకటి పడే సమయానికి నాన్న ఇంట్లోంచి పెద్ద నిచ్చెన తెప్పించేవారు. దానిని గుడిపైకి చేర్చి, అక్కడ్నించి ధ్వజస్తంభంపైకి వేసి, దానిపై నుంచి జాగ్రత్తగా ఎక్కుతూ పైదాకా వెళ్లి, అక్కడ పెద్ద దీపం వెలిగించి, కిందకి దిగేవారు. ఎంతో దూరం నుంచే కనిపించే ఈ దీపానికి భక్తులు దండం పెట్టుకునేవారు.
కోనేరులోకి దిగడానికి మెట్లు ఉండేవి. అవి బాగా నిటారుగా ఉండటంతో పిల్లలను అటు వెళ్ళనిచ్చేవారు కాదు. నాకు ఒకసారైనా దిగాలనిపించేది. దిగి ఆ నీళ్లను తాకాలని అనిపించేది. కానీ, ఆ కోరిక ఇప్పటికీ తీరనే లేదు. సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయే వరకు భక్తులు వస్తూనే ఉండేవారు. గర్భగుడిలో దీపం వెలుగులోనే వారంతా పూజలు చేసేవారు. రాత్రి 12 నుంచి తెల్లవారే దాక భక్తుల భజనలు చాలా గట్టిగా వినిపించేవి. కొందరు భక్తులు ప్రత్యేకించి ఈ గుడికే రావడం, ఇంకా కొందరు వేరే గుళ్లను సందర్శించిన తర్వాత ఎంత ఆలస్యమైనా ఇక్కడి శివలింగాన్ని కూడా దర్శించుకొన్నాకే ఒక్కపొద్దు విడవడం ... ఇప్పటికీ జరుగుతున్నది.
ప్రతీ మహాశివరాత్రికి రామాయంపేటలోని మా సీతయ్య గుడికే వెళ్లాలని అనిపిస్తుంది. అమ్మా నాన్న ఉన్నంత కాలం ఇది పాటించాను. ఆ తర్వాత కొన్నేండ్లుగా గైర్హాజర్ అవుతున్నాను. ఇటీవల కొన్నాళ్లుగా నెలకొకసారి సీతయ్య గుడికి సతీ సమేతంగా వెళ్లి అభిషేకాలు చేయగలుగుతున్నాను.

కామెంట్‌లు