రాజయ్య శ్రమను నమ్ముకోకుండా అదృష్టాన్ని నమ్ముకుంటాడు. అందుకే అతని సంపాదన కూడా అంతంత మాత్రమే. ఏదైనా మంచి జరిగితే అంతా తన కృషి వల్ల జరిగింది అని చెప్పుకుంటాడు. ఏ విషయంలోనైనా కలసి రాకపోతే అంతా తన తలరాత అని చెప్పుకుంటాడు. రాజయ్య కొడుకు సోము తండ్రి లక్షణాలను పుణికి పుచ్చుకున్నాడు. సోము 9వ తరగతి చదువుతున్నాడు. చదువులో అంతంత మాత్రమే. కష్టపడి చదవమని ఎవరైనా సలహా ఇస్తే తన అదృష్టం ఇంతే అని చెబుతాడు.
ఒకరోజు రాజయ్య ఇంటికి ఒక జాతకాలు చెప్పేవాడు వచ్చాడు. రాజయ్య తనతో పాటు తన కొడుకు జాతకం చూపించాడు. సోము ముఖ కవళికలను పరిశీలించిన అతడు సోముకు భవిష్యత్తులో ఉద్యోగం చేసే రాత లేదని, అతనికి చదువు అసలే అబ్బదని, అతనికి ఏదైనా పని నేర్పిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. అది విన్న దగ్గర నుంచి సోముకు మరింత దిగులు పట్టుకుంది. రాజయ్య సోమును పదవ తరగతి దాకా చదివించి, ఆ తర్వాత ఏదైనా పని నేర్పించాలని అనుకున్నాడు.
సోము చదువులో మరింత వెనుకబడ్డాడు. ఒకరోజు రాము సోము వద్దకు చేరి, "ఏరా సోము! నువ్వు ఈ మధ్య అస్సలు చదవడం లేదు. నీ సమస్య ఏమిటో చెప్పు." అన్నాడు. "అంతా నా దురదృష్టం. నా రాతను బ్రహ్మ ఇలా రాశాడు. నా చేతిలో ఏమీ లేదు." అన్నాడు. "సోమరిపోతులా మాట్లాడకు. మన రాత మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎంత కష్టపడితే అంత గొప్ప భవిష్యత్తు మనకు ఉంటుంది. మనం మన రాతను ఎలా అంటే అలా మార్చుకోవచ్చు." అన్నాడు రాము. "పోరా! పెద్ద చెప్పొచ్చాడు. మనం ఏమీ దేవుళ్ళం కాము." అన్నాడు సోము. మూర్ఖులము మార్చలేము అనుకున్నాడు రాము.
ఒకరోజు వాసు అనే స్నేహితుడు సోము వద్దకు వచ్చి, "ఈ ఊళ్ళోకి ఈ దేశంలోనే గొప్ప ప్రసిద్ధుడైన జాతకాలు చెప్పేవాడు వచ్చాడురా. అతని పేరు మహర్జాతకుడు. అతడు ఏం చెబితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అతని వద్దకు వెళ్దాం." అన్నాడు. వాసు వెంట సోము అక్కడికి వెళ్ళాడు. మహర్జాతకుడు సోమును పరీక్షించి, "నీకు చదువు ఒంటబట్టదు. ఉద్యోగం చేసే యోగం లేదు. కానీ కొద్ది రోజులు మాత్రం భగవంతుడు నీపై అనుగ్రహం చూపించాడు. ఇప్పటి నుంచి 10వ తరగతి ముగిసే వరకు మాత్రం నీకు చదువు రాత ఉంది. ఈ కొంత సమయం ఆటలు, పాటలు అన్నీ కట్టిపెట్టి, ఎంతో శ్రద్ధతో పాఠాలు విను. ఏ రోజు పాఠాలు ఆరోజు శ్రద్ధగా చదవాలి. వాసుతో స్నేహం చేసి, ఇద్దరూ కలిసి చదవండి. వాసు చెప్పినట్లు విను. ఆ తర్వాత చూడు. ఏమవుతుందో." అని చెప్పాడు.
సోము మహర్జాతకుడు చెప్పినట్లు చేశాడు. 10వ తరగతి అత్యుత్తమ గ్రేడుతో ఉత్తీర్ణుడు అయినాడు. అప్పుడు వాసు వచ్చి సోముతో ఇలా అన్నాడు. "సోము ఈరోజు వరకు నీ జాతకం ఎంతో బాగుంది. ఇక ఇప్పటి నుంచి నీకు కష్టాలు మొదలయ్యాయి. నీకు బ్రహ్మ చదువు రాతను రాయలేదు కదా!" అని. "నీకు నేను ఎలా కనబడుతున్నాను. 10వ తరగతిలో గొప్ప మార్కులు సాధించిన నేను ఇంటర్మీడియటులో చదువు రాని మొద్దును అవుతాడా? ఎలా నమ్ముతున్నావు ఇదంతా? జాతకాలు చెప్పేవాడికి భవిష్యత్తు అంతా ముందే తెలుసి ఉంటే వారు ఇలా జాతకాలు చెప్పి బ్రతుకరు. నా రాతను నేనే రాసుకోగలను. సడలని పట్టుదలతో రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో మరింత బాగా చదివి, మంచి ఉద్యోగం సాధిస్తాను." అన్నాడు సోము. ఎలా ఉండేవాడివి? ఎలా మారిపోయినావురా? అనుకున్నాడు వాసు. మహర్జాతకునిగా నటించిన తన మేనమామకు కృతజ్ఞతలు చెప్పాడు వాసు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి