కొన్నిసార్లు మనం చిన్నపిల్లల నుంచీ, మన దగ్గర పని చేసే వారి నుంచీ వారి స్థాయికి మించి ఎదురుచూస్తుంటాం అనే విషయాన్ని చెప్పే కథ ఇది.
అదొక కిరాణా దుకాణం. అక్కడికి ఓ కుక్క వచ్చింది. దుకాణదారు దానిని పోపో అని తరిమాడు. అది వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చింది. దుకాణదారు కోపం వచ్చి ఛీ పో అని తరిమాడు.
కానీ అది వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ రావడంతోనే దుకాణదారు బయటకొచ్చి చూసాడు. దాని నోట ఓ సంచీ ఉంది. ఆ సంచీ తీసుకోమన్నట్టు దుకాణదారు దగ్గరకు వచ్చింది.
అతను అది తీసుకుని సంచీలో చెయ్యి పెట్టగా ఓ చీటీ, డబ్బులూ ఉన్నాయి.
దుకాణదారు విషయం అర్థం చేసుకుని చీటీలో ఉన్నట్లే సరుకులు సంచీలో పెట్టి తగినంత డబ్బులు తీసుకుని మిగతా చిల్లర సంచీలో ఉంచాడు.
అది ఇంటికి బయలుదేరింది. దుకాణదారుకి ఆ కుక్కమీద ఆసక్తి పెరిగింది. అదెక్కడి నుంచీ వస్తోందో చూడాలనుకుని దాని వెంట బయలుదేరాడు. అది ఓ పదడుగులు నడవడంతోనే ఓ సిగ్నల్ వచ్చింది. అక్కడి ఎర్ర లైట్ చూసి ఆగింది. పచ్చ లైట్ వెలగడంతోనే అది రోడ్డు దాటి అవతలివైపు ఉన్న సుదులోకి వెళ్ళి తన యజమాని ఇంటి గేట్ దగ్గర నిల్చుంది. సంచీ కింద ఉంచి మెల్లగా గేటు తీసింది. సంచీ నోట కరచి వాకిట్లోకి వెళ్ళింది. వెనకాతలే దుకాణదారు వెళ్ళాడు. వాకిట్లో సంచీ ఉంచింది. తలుపు మూసి ఉండటంతో ఎగిరి కాలింగ్ బెల్ నొక్కింది.
ఇంట్లో నుంచి ఓ మనిషి మగతనిద్రలో తలుపు తీసి కుక్కను తిట్టాడు. ఎందుకండీ తిడుతున్నారు అని దుకాణదారు అడిగాడు.
"తిట్టక ముద్దు పెట్టుకుంటానా? ఒట్టి సోమరిపోతండి. ఏ పనీ సరిగ్గా చేయదండి. తాళం తీసుకుపోయుంటే అదే తాళం తీసుకుని లోపలికి వచ్చేది కదండీ. నా నిద్రంతా పోయిందండీ" అన్నాడా యజమాని.
దీనినిబట్టి సోమరిపోతెవరో ఈపాటికి మీకే అర్థమై ఉంటుందిగా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి