సామెత కథ : బిందు మాధవి

 మందుకి పంపిస్తే మాసికానికి వచ్చాడుట!
‘లక్ష్మి’ సంక్రాంతి కి ‘బొమ్మల కొలువు’ పెట్టి కాంప్లెక్స్ లో వాళ్ళని, ఫ్రెండ్స్ ని పిలిచి పేరంటం చేస్తుంది. సంవత్సరం అంతా ఎటూ ఉద్యోగం హడావుడే సరిపోతుంది, ఎవ్వరినీ (కనీసం కాంప్లెక్స్ వాళ్ళని కూడా) కలవటం అవదని, కనీసం ఆ రోజైనా అందరినీ కలవచ్చని తప్పని సరిగా ప్రతీ సంవత్సరం ఈ వేడుక చేస్తుంది.
బొమ్మలన్నీ ఐదు వరుసల్లో చక్కగా అమర్చి, కింద ‘ముగ్గు’ వేసి, ‘రంగులు’ తీర్చిదిద్ది ‘పువ్వులు’ అవీ అలంకారం చేసింది. ముందు రోజు ఆఫీస్ నించి వస్తూ ‘తమలపాకులు’, ‘రేగుపళ్ళూ’, ‘వక్కలు’, ముత్తైదువులకి తాంబూలం తో పాటు ఇవ్వటానికి ‘చేమంతి పువ్వులు’ తెచ్చుకున్నది. ‘‘అరటిపళ్ళు’ మాత్రం ముందే తెస్తే మెత్తపడి పాడైపోతాయని మరునాడు భోజనాలు అయ్యాక వేణు ని పంపించి తెప్పించచ్చు, తాజాగా ఉంటాయి’ అనుకున్నది.
అలాగే మధ్యాహ్న భోజనాలు అవ్వగానే, వేణుని పిల్చి ‘మూడు డజన్ల అరటిపళ్ళు తీసికురమ్మని’ డబ్బిచ్చి పంపించి కాసేపు నడుం వాల్చింది. కునుకు పట్టింది. సాయంత్రం నాలుగయ్యింది. చలికాలం పొద్దు త్వరగా చీకటి పడుతుంది, ‘పేరంటాళ్ళు’ వచ్చేస్తారు అని హడావుడి పడుతూ మధ్యాహ్నం పళ్ళు తెమ్మని కొడుకుని పంపించటం, వాడు ఇంతవరకూ రాకపోవటం గుర్తుకొచ్చింది. ‘అయ్యో వీడెళ్ళి చాలా సేపయ్యింది, ఇంతసేపు ఏం చేస్తున్నాడు, ఏ యాక్సిడెంట్ అన్నా అవ్వలేదు కదా, ఎక్కడికెళ్ళాడో’ అని కాలు కాలిన పిల్లల్లే బయటికీ లోపలికీ తిరుగుతున్నది.
సరే ముందు పేరంటం ఏర్పాట్లు చూద్దామని అన్యమనస్కంగా పక్కింటి అమ్మాయిని పంపించి పళ్ళు తెప్పించి కార్యక్రమం నడిపించింది. మనసు పరి పరి విధాల కీడు శంకిస్తున్నది. ఆఫీస్ నించి భర్త వచ్చాడు. ఇహ ఆపుకోలేక చెప్పి భోరుమన్నది.
‘అదేమిటి మధ్యాహ్నమనగా బయటికెళ్ళి పిల్లవాడు రాకపోతే నాకెందుకు ఫోన్ చెయ్యలేదు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాడిని కద’ అని కంగారు పడ్డాడు. వీళ్లిలా కంగారు పడుతుంటే ‘వేణు’ ఇంటికి వచ్చాడు. ‘ఏమయ్యింది’ అని అడిగేటప్పటికి, ‘పళ్ళు కొనటానికి మార్కెట్ కి వెళ్ళేటప్పటికి ఫ్రెండ్ కనిపించాడు’. ‘వాడు మార్కెట్ కి ‘గాలిపటాలు’ కొనటానికి వచ్చాడు’. ‘కొని సరదాగా నువ్వు కూడా రారా, మా మేడ మీద ఎగరేసుకుందాం’ అని పిల్చేటప్పటికి, ‘నీ పేరంటం టైం కి పళ్ళు తెచ్చెయ్యచ్చు లే’ అని వెళ్ళాను. ‘తీరా అక్కడికివెళ్ళేసరికి  వేరే ఫ్రెండ్స్ కూడా కలిశారు’, ‘అందరం కలిసి ఆ ధ్యాస లో పడేటప్పటికి టైం తెలియలేదు’ అంటూ, ‘అమ్మా సారీ’ అంటూ బ్యాగ్ లోంచి పళ్ళు బయటకి తీసి చూసేసరికి అవి కమిలిపోయి నల్లగా ఎందుకూ పనికిరాకుండా తయారయ్యాయి.
‘నిన్ను నమ్ముకుని పని చెబితే, ఇంతే కద. “మందుకని పంపిస్తే, మాసికానికి వచ్చినట్లుంది”. ‘నీకేమయ్యిందోనని మేము కంగారు పడిచస్తున్నాం’ అని తేలిక పడ్డ మనసుతో నిట్టూర్చింది.
* * *
కామెంట్‌లు