సుపరిచయం:-- యామిజాల జగదీశ్










 ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని పరిచయాలు ఎందుకు ఎలా ఏర్పడుతాయో ఎవరూ ముందే ఊహించలేం. కొందరిని పరిచయం చేసుకోవడం కోసం మనం ఉవ్విళ్ళూరుతాం. కానీ కార్యరూపం దాల్చదు. కొందరితో పరిచయం అనుకోకుండా ఏర్పడి గట్టి పునాది పడి దీర్ఘకాలం కొనసాగుతుంది. ఇంకొందరితో పరిచయం అంటీ అంటనట్లు ఉంటుంది. కొన్ని పరిచయాలు ఆనందాన్నిస్తాయి. కొన్ని పరిచయాలు ఆవేదననిస్తాయి. కొన్ని పరిచయాలు ఎందుకు చేసుకున్నాంరా బాబూ అనిపిస్తుంది. కొన్ని పరిచయాలు మరచిపోలేనివవుతాయి. అటువంటి పరిచయ పర్వంలోని ఎప్పటికీ గుర్తుండిపోయే పేజీయే ఎం. జి. కె. మూర్తిగారు. 
కొంత కాలం క్రితం మద్రాసు గురించి రాసిన వ్యాసపరంపరే మా ఇద్దరి పరిచయానికి కారణమైంది. విచిత్రమేమిటంటే పరిచయమయ్యాక కొనసాగిన మాటల్లో తెలిసిందేమిటంటే ఎం.జి.కె. మూర్తి ( మండలీక గోపాలకృష్ణ మూర్తిగారు) నా క్లాస్ మేట్ కొల్లూరు రంగారావుకు సమీపబంధువని. అలాగే నా సన్నిహిత మిత్రుడు కాళహస్తి వాసుదేవన్ కీ దగ్గర బంధువని.
ఇంకేముంది‌, మూర్తి గారిని చూడాలనిపించి వాళ్ళింటికి వెళ్ళాను. మాటల్లో మద్రాసుతో తమకున్న పరిచయబంధం గురించి చెప్పుకొచ్చారు.ఆయన స్వస్థలం కోస్తాంధ్ర అయినప్పటికీ తమ మద్రాసులో ఉండే తమ బంధువుల ఇంటికి వచ్చిపోతుండేవారు. 
టీ. నగర్లోనూ, నందనంలోనూ, మైలాపూర్ లోనూ, ఐస్ హౌస్ లోనూ ఇలా చెన్నపట్నంలోని వివిధ ప్రాంతాలను సందర్శించడం, టీ. నగర్లోని బర్కిట్ రోడ్, వెంటనారాయణ రోడ్, దురైస్వామి రోడ్, బజుల్లారోడ్, పనగల్ పార్క్, పార్క్ ల్యాండ్ హోటల్, పాండిబజార్, జీఎన్ చెట్టీ రోడ్ ఇలా కొన్ని వీధుల పేర్లు, కొన్ని ల్యాండ్ మార్కుల పేర్లు చెప్తుంటే నా మనసంతా నేను పుట్టి పెరిగిన బజుల్లారోడ్ చుట్టూ విహరించింది.
గోపాలకృష్ణమూర్తిగారు, ఆయన సోదరుడు ఓరోజు తమ తాతగారితో కలిసి వెళ్తుంటే ప్రముఖ సినీనటులు సీ.ఎస్.ఆర్. ఆంజనేయులుగారు తారసపడ్డారట. ఆయనను ఎరుగుదువా అని తాతగారు అడగ్గా తెలీదన్నారు మూర్తిగారు. అప్పటికింకా చిన్నపిల్లలే మూర్తిగారు సోదరులు. పెద్దవాళ్ళు కాఫీ తాగడం కోసం పార్క్ ల్యాండ్ హోటల్ లోకి వెళ్ళగా మూర్తిగారు సోదరులకు సీఎస్ఆర్ గారు పిల్లలు కాఫీ తాగకూడదంటూ  జాంపండు, రీటా ఐస్ కొనిచ్చారట. (ఈ విషయం నేను సీఎస్ఆర్ గారి తమ్ముడి కుమారుడు, నా క్లాస్ మేట్ అయిన సురేష్ తో చెప్పినప్పుడు సురేష్ ఒకటి రెండు విషయాలు చెప్పాడు. సీఎస్ఆర్ గారు చాలా సరదా మనిషంటూ, తెల్లవెంట్రుకలు తీస్తే తీసే ప్రతి వెంట్రుకకీ ఒక పైసా ఇస్తాననేవారట సీఎస్ఆర్ గారు. అలాగే సురేష్ వాళ్ళనాన్నగారికీ సినిమా పరిశ్రమతో విడదీయరాని బంధముంది. ఆయన అసోసియేట్ డైరెక్టరు కావడమే కాకుండా మల్లీశ్వరి వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారట).
శ్రీశ్రీ, జగ్గయ్య వంటి వారిని చూసిన మూర్తిగారు ఎన్.టి. రామరావుగారిని చూడటానికి బజుల్లా రోడ్డులో ఉన్న ఆయన ఇంటికి వెళ్ళిన తొలి పరిచయంలోనే ఆరోజు తమ కారులో షూటింగ్ కి పంపడం. రాజకోట రహస్యం (1971లో విడుదలైన చిత్రం) అనే చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్న రోజులవి. ఆ సినిమా షూటింగ్ చూసిన క్షణాలను జ్ఞాపకం చేసుకున్న మూర్తిగారికి అక్కినేని నాగేశ్వరరావుగారికి ఎంతో ఇష్టమున్న నటుడు. చెంచులక్ష్మి, డాక్టర్ చక్రవర్తి, కులగోత్రాలు వంటి సినిమాపేర్లన్నీ చెప్పి ఆయన నటనకు ఓ నిఘంటువు అన్నారు. తన మిత్రుడు పురాణం వెంకటరమణగారితో కలిసి అక్కినేనిగారింటికి వెళ్ళి వస్తుండేవారు. మాయాబజారు (నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాతలుగా కె.వి. రెడ్డిగారి దర్శకత్వంలో 1957లో విడుదలైన ఆణిముత్యంలాంటి చిత్రం) లో అక్కినేని పాత్రను జ్ఞాపకం చేశారు. 
ఎన్టీఆర్, ఎఎన్ఆర్, శోభన్ బాబు, అంజలీదేవి, పద్మనాభం, గుమ్మడి వేంకటేశ్వరరావు, వీబీ. రాజేంద్రప్రసాద్, డి. రామానాయుడు‌, కృష్ణ తదితరుల ఆటోగ్రాఫ్ లు తీయించుకున్న పుస్తకాన్ని తీపిగుర్తుగా పదిలం చేసుకున్నారు. 
మూర్తిగారితో మాటలు గంటన్నరపైనే కానిచ్చుకుని ఇంటికి చేరాను ఆనందంగా !

కామెంట్‌లు