ఇవి ఒకప్పటి మా రామాయంపేట ఇంట్లోని దేవునర్రలో ఉండిన ప్రాచీన దేవతా విగ్రహాలు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. 'ఇంటి'కి కూడా ప్రాణం ఉంటుందని నాకు చాలాకాలం వరకూ తెలిసి రాలేదు. తెలిసిన తర్వాత దానిని నిరూపించలేని నిస్సహాయత. కొన్ని విషయాలు మన అదృష్టంలో లేనప్పుడు, మన కండ్ల ముందునుంచే, (ఇంకా ఒక్కోసారి మన చేతుల మీదుగానే) మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయి. జీవాలతోపాటు నిర్జీవాలు కూడా ఆత్మలకు నిలయాలని, సృష్టిలోని అణువణువూ పరమాత్మ స్వరూపమేనని చాలామంది 'చదువు'కున్న వాళ్లకూ తెలియదు. మా ఇంటి దేవునర్ర (దేవుని గది) ప్రత్యేకతను, విలువను ఈ తరం వారికి చెప్పాలన్న ప్రయత్నమే ఇది.
పెద్దర్వాజలోంచి లోనికి వెళ్ళగానే ఎడమవైపు పెద్ద వంటిల్లు, దానిలోకి ప్రవేశించగానే కుడివైపు కనిపిస్తుంది, దేవునర్ర తలుపు. చాలా పాతకాలం నాటిది. తూర్పు ముఖద్వారం, పడమటి వైపు, ఉత్తరం వైపు పాతకాలపు కిటికీలు. పడమటి కిటికీ పెరడులోంచి, ఉత్తరం కిటికీ చతుషాలలోంచి పగలంతా వెలుగు ఉండేది. రాత్రిళ్ళు దేవుళ్ళ ముందు వెలిగే దీపాల కాంతి. ఇంటికి వచ్చే వాళ్ళు చతుషాల కిటికీలోంచి చూసి, దండం పెట్టుకునేవారు.
దేవునర్రలో ఎదురుగానే పెద్ద, ఎత్తయిన గద్దె. దానిపై తూర్పు ముఖంగా రెండు, మూడు కూచునే కలప పీటలు ఒకదాని పక్కన ఒకటి. వాటిపైన మధ్యలో మరో పీట. పై పీటపైనే పెద్ద (వీటికంటే నాలుగు రెట్లు పెద్దవి) దేవతా విగ్రహాలు ఉండేవి. కింది పీటపైన ఈ విగ్రహాలు. పక్కన రెండు వైపులా పలు దేవుళ్ళు, దేవతల చిన్నసైజు ప్రతిమలు, ఫోటో ఫ్రెములు. కొంచెం పైన గోడకు మరికొన్ని ఫోటోలు. కింది పీటలపైన ఒక చిన్న పెట్టె వంటి దానిలో సాలగ్రామలు. అదే గద్దెపై ఒకవైపు గంధం పీట, చెక్క గోడకు ఒరిగించి ఉండేవి. దేవుళ్ళ ఫోటోలతోపాటు మా పితృదేవుళ్ళ ఫోటో కూడా ఒకటి ఉండటం నాకు బాగా జ్ఞాపకం.
ఆ గద్దెపై దేవుళ్ళ ముందు ఒకే వ్యక్తి కూచునేంత స్థలం. అక్కడ ఎప్పుడూ చాప ఒకటి వేసి ఉంటుంది. దాని ముందు మరో చిన్న పీట. దానిపై రాగి పాత్రలు. ఉద్దరిణి, గిలాస, చెంబు వంటివి. దేవునర్రలో కుడివైపు, పడమర వైపు మట్టిగోడలకు దిగేసిన కలప కొయ్యలు. తూర్పు కలప కొయ్యలలో ఒకదానిపై దసల్ది, ఉత్తర్యం (మగవారి పూజా వస్త్రాలు ), మరో దానిపై మడి చీర, రవిక. ఉత్తరం వైపు కలప కొయ్యలపై ఆరేసే మడి వస్త్రాలు.
నాన్న స్నానం చేయగానే వంటింటిలోని గోడమీది కలప కొయ్యపై వుండే తట్టు ( తెల్ల గొంగడి)ను నడుముకు చుట్టుకొని, దేవునర్రలోకి వెళ్లి, అక్కడి కొయ్యమీది దసల్ది తీసుకొని కట్టుకొనే వారు. అప్పటికే అమ్మ పూజకు బావినీళ్లు, గుల్లలో గన్నేరు పూలు తెచ్చి పెట్టేది. ఆ గద్దెపై నాన్న దక్షిణం గోడకు వీపు చేసి, ఉత్తరాభి ముఖంగా కూర్చునేవారు. ముందు గంధం పలకపై కొద్దినీళ్లు చల్లుతూ సానతో గుండ్రంగా రాస్తూ ఒక చిన్న గిన్నెలోకి గంధం తీసేవారు. రోజూ సాలగ్రామలకు అభిషేకం, విగ్రహాలకు, ఫోటోలకు షోడషోపచార పూజ చేసి పుట్నాలు, చక్కెర కలిపి నైవేద్యం పెట్టేవారు. అప్పుడప్పుడు, పండగల నాడు అమ్మ మడికి వంట చేసి, విస్తట్లో నైవేద్యం దేవునింట్లోని గద్దె ముందు కింద నేలపై నీళ్లు చల్లి శుద్హి చేసి అక్కడ పెట్టేది. (మేం పొద్దున తొమ్మిదికల్లా స్కూలుకు వెళ్లాల్సిన రోజుల్లో మడి వంట సాధ్యమయ్యేది కాదు). పూజ పూర్తి కాగానే నాన్న కుడిచేతి వేళ్ళతో తన చెంపలపై మృదంగం వాయించినట్టుగా చప్పుడు చేసేవారు. ఈ శబ్దం వినిపించిందంటే ఇక పూజ అయిపోయినట్లు లెక్క. వెంటనే పిల్లలం వెళ్లి వరుసగా నిలబడి కుడి చెయ్యి చాపి, తీర్థ, ప్రసాదం తీసుకునే వాళ్ళం. ఆనాటి మా ఇంటికే తలమాణికం ఈ దేవునర్ర.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి