రాయటం సులువేంకాదు!
రాసిన అక్షరమల్లా లతలా ఎగబాకి
పూవులై పూసి వాంచిత ఫలాలై
ఆకలితీర్చే ప్రాణ రసమైతే ఎంత బాగుండు?
నిస్సహాయతల కుంగుబాటు లో
నిలిపే దిక్సూచియై నిలిస్తే బాగుండు!
విస్ఫోటనం చెందే ప్రతి మాట
విధిని ప్రశ్నించే గొంతుకై నినదిస్తే బాగుండు!
పర్వత మద గజాన్ని బంధించే
మావటి భాషా సూత్రమై నియంత్రిస్తే బాగుండు!
లోపాల దిద్దుబాటుకు
చేతుల రేఖల మీద మంత్రణమై నిలిస్తే బాగుండు!
వాలే ముదిమికి
చేయూత యై సాగే జీవనచక్ర గతికి
శృతి అయితే బాగుండు!
తప్పించుకు తిరిగే కాయాలకు
వాక్సిన్ లా రక్షకమై నిలిస్తే అక్షరాలు సజీవ కణాలవుతాయి!
పదాలు పాఠ్య ప్రణాళికలవుతాయి
వాక్యాలు నిష్టుర సత్యాగ్నిలోనుండి
మేలిమి బంగారమై మెరిపిస్తాయి!
రాయటం అంత సులువేం కాదు లోపల సునామీలు
ఉద్భవిస్తేనే పద్యాలలో స్ఫూర్తి ప్రతిబింబాలుగా మెరుస్తాయి
భంగపడ్డ హృదయం విల విలలాడుతూ
తలపోసే సంస్పదనలు చేతుల మీద
రాసుకున్న రాతల నిశ్శబ్దగీతాలు
ఎప్పుడు పెన్ను పట్టినా సల సల లాడే
వాక్ధాటి పునరావృతమవాలి!
సాగిలపడే సాధువర్తనాలు కావు నేను కలగనే అక్షరాలు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి