Reminiscence - 168; -తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 

ఒక రోజు  ఉదయం-సూర్యోదయ వేళలో ,వీధిలోంచి మా ఇంటి ఆవరణలోకి ఓ మనిషి నడిచి వస్తున్నాడు! చేతిలో సంచీ ఉంది, అందులో ఏదో ఉంది!
అతని మొహం తెలుసు కానీ ,అతని పేరు తెలియదు! మా ఊరే! ఎస్సీ కాలనీ మనిషి- ఓ నలబై ఐదు సంవత్సరాల వయసు ఉండొచ్చు! ఎందుకని వస్తున్నట్టో అర్థం కాలేదు!
ఇప్పుడు మా వ్యవసాయం కూడా లేదు! ఊరి మనుషులతో మాకు లావాదేవీలు లేవు!మా అమ్మతో కూడా ఎవరికీ ఏ పని కానీ, అవసరం కానీ లేదు! సాధారణంగా అయితే అమ్మ దగ్గరకు ఎవరూ రారు!
వ్యవహారాలు ఉంటే కద,ఎవరైనా రావడానికి?
నేను అతన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇంట్లోంచి బయటకు వచ్చాను! అతను తన చేతిలో ఉన్న సంచిని నాకు ఇస్తూ
"రాము పంపింది" అన్నాడు!
అప్పుడు కొంత అర్థం అయింది! రామవ్వ అనే ఎస్సీ మహిళ యొక్క మొత్తం కుటుంబం మాకు తెలుసు! అయితే అదంతా గతం! ఆ రామవ్వకు ఇతడు ఏమౌతాడు? అడగలేకపొయ్యాను! మా ఊళ్లో సగం మంది నాకు తెలియకుండా అయింది!
రామవ్వ పంపింది అన్నాడు కనుక, విషయం అర్థం అయి,అతని సంచీ తీసుకున్నాను! అందులో అర కేజి‌ తోటకూర ,పావు కేజీ పచ్చిమిర్చి ఉన్నాయి! అమ్మకోసం పంపింది! ఆ తోటకూర పచ్చిమిర్చి పరిమాణం కంటే, వాటిని పంపిన రామవ్వ అభిమానం పెద్దది!దాన్ని తూచలేను! వాటిని తీసుకుని అప్పటికప్పుడు నాకు తోచిన విధంగా ,నేను అమ్మకోసం తీసుకువెళ్ళిన స్వీట్ల నుండి కొన్ని తీసి అదే సంచిలో వేసి అతనికి ఇవ్చాను!
ఈ లోపు మా అమ్మ కూడా వంటగది నుండి బయటకు వచ్చి అతన్ని గుర్తు పట్టింది.ఒక్కొక్కసారి కొందరిని గుర్తు పట్టడం లేదు! అతను రామవ్వ భర్త అని అన్నది! అప్పుడప్పుడు ఇలాగే రామవ్వ ఏదైనా కాయగూరలు పంపిస్తాదట! వచ్చి చూసి పోతుందట!
నాకు ఆశ్చర్యం కలిగించింది!
ఎప్పుడో- ఓ ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం మా వ్యవసాయం ఆగింది! ఇంకా మా కుటుంబం మీద మాదిగల్లో అభిమానం ఉందన్నమాట! కుటుంబం అనే కంటే, మా బాపు మీద అభిమానం అనడం సరైన పదం!
ఆయనది ఫ్రెండ్లీ మేనేజ్మెంట్! ఎవరినీ ఎన్నడూ ఒక్క దురుసు మాట అనలేదు! ఆయన దగ్గర పని చేసిన వారు ఆయన వ్యవసాయం సాగినంత కాలం ఆయనతో కలిసి సాగారు- మా గ్రామంలో అది అపూర్వమైన విషయం!
బహుశా రామవ్వ కూడా మా బాపు అభిమాని అయుండాలి! నేను పదిహేను సంవత్సరాల వయసు వరకే 
మా గ్రామంలో ఉన్నాను.అప్పటి వరకు మా పనులు చేసే వారు మాత్రమే నాకు గుర్తుకు ఉన్నారు. రామవ్వ అప్పటికి చిన్న పిల్ల! పేరు వినడమే కానీ, మనిషి గుర్తుకు లేదు!
నేను 1980 లోనే గోదావరిఖని బొగ్గుగనుల్లో ఉద్యోగం కోసం వెళ్లాను.ఆ తరువాత మరో నాలుగు సంవత్సరాల పాటు మా బాపు అన్నయ్య కలిసి వ్యవసాయం సాగించారు! అప్పుడు రామవ్వ కూడా మా వ్యవసాయపు పనులు చేసి ఉంటుంది! 
చదువు కోసం 1974 లోనే నేను మా గ్రామం వదిలాను.అలా కూడా తరువాత మా వ్యవసాయ పనులు ఎవరెవరు చేసారో నాకు తెలియదు! నేను మా ఊరికి అతిధినే అయ్యాను!
నా తరువాత మా బ్రదర్ కూడా వ్యవసాయం వదిలేసి ఉద్యోగం చెయ్యడానికి అదే గోదావరిఖని రావడం వల్ల మా బాపు వ్యవసాయాన్ని పూర్తిగా విరమించి భూములను కౌలుకు ఇచ్చాడు! ఇక పనివారి అవసరం తప్పింది!
కాలక్రమంలో వారిలో దాదాపు అందరూ మరణించారు!
వారి కొడుకులు కూతుళ్ళు ఉన్నారు! వారు కూడా మధ్య వయసులో ఉన్నారు! అందులో రామవ్వ ఒకతి!
అప్పుడు- మా వ్యవసాయం సాగిన కాలంలో రామవ్వ కుటుంబం దాదాపు మొత్తం మా వ్యవసాయంలో పని చేసే వారు! రామవ్వ తల్లి లచ్చమ్మ - రామవ్వ ఇద్దరు అక్కలు,
రామవ్వ ఒక సోదరుడు సంవత్సరాల తరబడి మా వ్యవసాయంలో 'వెనుక వంతుల' పనులు చేసారు!
అలా ఓ ఎనిమిది కుటుంబాలు ఉండేవి! ప్రతీ కుటుంబం నుండి కనీసం ఒక్క మనిషైనా తప్పనిసరిగా మా పనులకు వచ్చేవారు! అది సాలుసరి కట్టుబడి! అప్పటి ప్రతిఫల పద్దతి ప్రకారం బాపు నడుచుకునేవాడు! నా చిన్నతనం సాంతం ఆ కుటుంబాలు మా వ్యవసాయంలో పనిచెయ్యడం నేను ఎరుగుదును! లస్మమ్మ దుర్గమ్మ చంద్రమ్మ రాజమల్లమ్మ కనకమ్మ చంద్రమ్మ రాధమ్మలు బాగా గుర్తు ! అప్పటికి వారంతా మా అమ్మంత వయసు వారు! వారి కూతుళ్ళు కూడా ఎక్కువ పనులు ఉన్నప్పుడు పనులకు వచ్చేవారు! వరినాట్లు కలుపులు కోతలు, వరి కట్టల్ని పంజ కొట్టడాలు, ఎండిన మొక్కజొన్న తెల్లజొన్న చేన్లను కొడవల్లతో కట్ చెయ్యడం- శనగ మిర్చి పెసర కంది వంటి పంటల నూర్పిడుల వగైరా పనులు చేసేవారు!
సంవత్సరం పొడుగునా ఏదో ఒక పని ఉండేది వారందరికి!
అప్పుడు వ్యవసాయం అంతా మానవ శ్రమ మీద నడిచేది!
తీరిక దొరికేది కాదు మనుషులకు!
***
ఇన్నాళ్ల తరువాత ఇలా రామవ్వ అభిమానం తెలిసి నాకు ఆశ్చర్యమే కాదు, ఆలోచనలు కూడా కలిగించింది!
రామవ్వ చూపిన అభిమానానికి తగిన విధంగా నేను తిరిగి అభిమానం చూపానా అన్న ప్రశ్న మొదలైంది!
ఆమె తన భర్తతో ఏవో తనకు ఉన్న వాటిలో కొన్నింటిని అమ్మ కోసం పంపింది! మేం, లేదా నేను ఎప్పుడైనా అలా రామవ్వకు ఏమైనా పంపామా? ఇచ్చానా? ఏవో స్వీట్లు ఇచ్చాను! కానీ నేను తీసుకుని వెళ్ళి ఇవ్వాలి కద?వారు తెచ్చి ఇచ్చినట్టుగా ఇవ్వాలి కద?
అది కదా వారిని గౌరవించడం!
అయితే వారిని ఎలా గౌరవించాలి?
నా వద్ద 'యాత్రాకథనాలు' అని నేను రాసిన పుస్తకం ఉంది!
అందులో మా ' వెల్లంపల్లి కథ' ఉంది! ఆ కథలో రామవ్వ వంశం పేరు ఉంది- రామవ్వ భర్త వంశం పేరు కూడా ఉంది!
గ్రామ కథ కనుక, అప్పుడు పుస్తకం రాసినప్పుడు గ్రామంలో ఉన్న అన్ని కులాల వంశనామాలను రాసాను!
అది నాకు గుర్తుకు వచ్చింది! ఆ పుస్తకాన్ని ఇవ్వడం కంటే ఎక్కువ ఏముంటుంది? పైగా రామవ్వ కూతురు చదువుకున్నదట! ఇంకేం? 
( రైతునేస్తం వెంకటేశ్వరరావు గారు ఆ పుస్తకాన్ని‌ ప్రచురించారు)
తిరిగి ఈ రోజు ఉదయం ఒక యాత్రాకథనాలు పుస్తకాన్ని తీసుకుని మాదిగల ఇండ్ల వైపు నడిచాను.రామవ్వ ఇల్లు ఎక్కడ ఉంటుందో దారిలో ఎవరినో అడిగితే చూపించారు! నేను అలా వెళ్లడం రేర్ !నాకు ఇల్లు చూపిన స్త్రీ కూడా నా వెనకే లోపలికి వచ్చింది- మరెవరో కూడా వచ్చారు!
ఆ ఇంటి ఆవరణ అంతా ఎంతో శుభ్రంగా పేడతో అలికి ముగ్గులు వేసి ఉంది!
బావి దగ్గర వంటపాత్రలు శుభ్రం చేసుకుంటున్న రామవ్వ ఆశ్చర్య పోయి లేచి నిలుచుని చేతులు జోడించింది!
గతించిపోయిన మనుషులు గుర్తుకు వచ్చారు- కనులలో నీరు తిరిగింది!
రామవ్వను ,ఆమె భర్త రాజయ్యను ,వారి కూతురిని ముగ్గురిని పిలిచి ,వారి అమ్మాయి చేతిలో యాత్రాకథనాలు పుస్తకాన్ని ఉంచాను. ఆ పుస్తకం గురించి అందులో ఉన్న మా గ్రామ కథ గురించి, ఆ కథలో ఉన్న వారి వంశాల గురించి ఆ అమ్మాయికి చెప్పాను! ఒక ఫొటో తీసుకున్నాను! వెనుతిరిగి వచ్చాను!నేను తిరిగి గొల్లకొండకు రావాలి! అందుకు గ్రామంలో ఎక్కవలసిన బస్సు సమయం దగ్గర పడుతోంది! 
అప్పటికే రామవ్వ ఇంటిముందు జనం గుమిగూడారు!
నేను బయటకు వస్తూ ఉంటే,వారు లోపలికి వెళ్తూ ఉన్నారు..