మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నట్టు మనకు అర్థం అయితే,మనకు గర్వంగా ఉంటుంది! మనల్ని ఎవరైనా అభిమానిస్తున్నట్టు అర్థం అయితే,మనకు సంతోషంగా ఉంటుంది! మనల్ని వారంతట వారే నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నంత పని చేస్తుంటే,మనకు మహదానందంగా కూడా ఉంటుంది! మనల్ని నిత్యం స్తుతిస్తూ ,మన చుట్టూ తిరుగుతూ ఉంటే,సాక్షాత్తూ ఆ దేవ దేవుళ్లకు జరిగే వైభోగం మనకూ జరుగుతోందని మరీ సంతసిస్తాం!
నిత్యం ఎవరో ఒకరు మన చుట్టూ తిరుగుతూ ఉంటే,మనకు చాలా చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది!
మనమే కాదు సుమా! చిన్నాపెద్దా
రాజకీయ నాయకులకు కూడా నిత్యం వారి చుట్టూ మనుషులు లేకపోతే, వారి ముఖాలలో రాజకళ తాండవించదు! సెలబ్రిటీలూ అంతే!
సామాన్య జనంలో కూడా ఎక్కడిక్కడ సెలబ్రిటీ హోదాలు కలవారు ఉంటారు! కుటుంబాల్లో సంఘాల్లో పార్టీల్లో ఎక్కడికక్కడ నాయకత్వాలూ , వారి చుట్టూ -ఒకరో ఇద్దరో పదుగురో - భజించే బృందాలు ఏర్పడతాయి! నిత్య పూజలు నిర్వహిస్తారు! ఆ దీప ధూప గంధ ఫల పుష్ప నైవేద్యాలకు మీరు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతారు కూడా! వారి అభిమానాలు అలా ఉంటాయి!
భజనకారులూ బృందాలు నిజానికి ప్రమాదకరమైన బృందాలు కావు! మంచివారే,మంచివే! అమాయకత్వం ఉంటుంది వారిలో! తమ కంటే ఉన్నతులను చూసి , ఏదో విధంగా ప్రభావితమై వారిని భజిస్తూ ఉంటారు! ఆలయంలో విగ్రహాన్ని చేసి నిత్యపూజలు చేసినంత పని చేస్తారు!అందుబాటులో ఉంటే ,ఎన్నో చిన్నాపెద్దా సహాయాలు కూడా చేస్తారు!వారు మనల్ని డబ్బు అడగరు,వస్తువులు అడగరు,పదవులు అడగరు,కేవలం ప్రేమిస్తారు, పూజిస్తారు, భజిస్తారు,నెత్తిన మోస్తారు! వారి స్ధితి వారిది- అది వారి ఆనందం!
భజనకారుల పట్లా ,కీర్తి గానాల పట్లా,అటువంటి బృందాల పట్ల మనం ఎలా ఉండాలి?
మన పట్ల ప్రేమను వ్యక్తం చేస్తున్న వారి పట్ల- మనల్ని అభిమానిస్తున్న వారి పట్ల- మనల్ని పల్లకీలో ఊరేగిస్తూ స్తోత్ర పారాయణం చేస్తున్నంత పని చేస్తున్న వారి పట్ల మనం ఏ విధంగా ఆలోచనలు చెయ్యాలి?
మొదటి విషయం ఏమిటంటే?మనం ఆ ప్రేమలను అభిమానాలను కీర్తనలని మోతలను పట్టించుకోకుండా ఉండాలి! అయితే వారిని మాత్రం పట్టించుకోవాలి!
ఎలా? వారిలో ఉన్న శక్తిసామర్ధ్యాలు ఏమిటి? వాటిని ఉపయోగించి వారితో ఏఏ పనులు చేయించవచ్చు- అవి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతాయి? అని వారి వ్యక్తిత్వాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చెయ్యవచ్చు!
కొందరు ఎదిగి 'నువ్వెంత?' అనే వరకు కూడా వస్తారు సుమా! కొందరు ఎదగరు- ఉన్న విధంగానే ఉండటానికి ప్రయత్నం చేస్తారు- వారిది పిల్లల టైప్!
వారికి ఆడుకోవడానికి బొమ్మలు కావాలి!
కొత్త కొత్త బొమ్మలు కావాలి! కొన్నాళ్ళ పాటు మీరో కొత్త బొమ్మ! తరువాత మరో కొత్త బొమ్మ కావాలి!వారు నిత్య ప్రేమికులు-నిత్య భక్తులు- వారికి ఎప్పటికప్పుడు కొత్త ప్రేమికులు కావాలి!కొత్త దేవుళ్లు కావాలి! కొత్త బొమ్మలు కావాలి!
కొన్నాళ్ళ తర్వాత వారికి కొత్త దేవుళ్ల అవసరం ఉంటుంది!
మీరు బోర్ కొడతారు- క్రమంగా మిమ్మల్ని ఒదిలేస్తారు! వారికి ఎప్పుడూ ఎవరో ఒకరు కొత్తగా ,గొప్పగా , మిరుమిట్లు గొలుపుతూ, వారి ముందు వెలుగుతూ ఉండాలి. మీ కంటే మిరుమిట్లు గొలిపే వ్యక్తులు వారికి ఎదురైతే మిమ్మల్ని , పిల్లలు ఆటబొమ్మను వదిలేసి మరో కొత్త బొమ్మను పట్టుకుని ఆడుకున్నట్టు ఆడుకుంటారు.కాకపోతే వారి దేవుని అర్రలో అటువైపు మీరు జరుపబడతారు- ప్రధాన మండపం మీద ఎప్పటికప్పుడు కొత్త విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు! అది వారి నైజం! అదేమి ప్రమాదకరమైన విషయం కాదు!
అది నిజమని నమ్మితే,మీరే ఇబ్బందులు పడతారు!అప్పుడు మీరు బాధ పడతారు!
మిమ్మల్ని ప్రేమించిన వారు - మిమ్మల్ని అభిమానించిన వారు,అంతకుముందు ఎవరినో ఇలాగే ప్రేమించి,అభిమానించి ఉంటారు.వారి మీద మోజు తీరగానే ,మీ కర్మ కాలి మీరు కనపడి,మిమ్మల్ని ప్రేమిస్తారు! అభిమానాలు స్తోత్రాలు మోతలు వైభోగాలు అన్నీ వారి వెంట వచ్చి, వారితో పాటు వెళతాయి! అయ్యో! నిత్య పూజలు దీప ధూప నైవేద్యాలు , తీరొక్క కైంకర్యాలు ఇప్పుడు జరపడం లేదే అనే దుస్ధితికి మనం జారే ప్రమాదం ఉంటుంది!
కనుక- చిన్నాపెద్దా సెలబ్రిటీ జనులారా! అభిమానుల పట్ల పారాహుషార్! అభిమానం అనేది పారే నీరు వంటిది!
అది ఒకచోట నిలవదు! ప్రవహిస్తూ ఉంటుంది...
నిజంగానే శక్తిసామర్ధ్యాలు కలవారికి,వారి ఆచరణే వారికి ప్రేరణగా నిలుస్తుంది! ఎవరి కీర్తి గానాల అవసరం ఉండదు!
బయటి ప్రేరణల అవసరం లేదు!
ఇతరుల ప్రేమల పట్ల- అభిమానాల పట్ల- కీర్తి గానాల పట్ల- భజనల పట్ల- పల్లకీ మోతల పట్ల, తగిన జాగరూకతతో ఉండటం అవసరం!వాటిని శాశ్వతం అనుకోరాదు- అవి వస్తూ పోతూ ఉంటాయి....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి