కొన్ని విషయాల్లో మనం ఏ నిర్ణయం తీసుకోకూడదు!
ముఖ్యంగా మానవ సంబంధాల నిర్వహణ విషయంలో!
అలా ఒదిలెయ్యాలి! అదే ఓ నిర్ణయం! మనం చివరి మాటలు మాట్లాడకూడదు! కఠిన నిర్ణయాలు తీసుకోకూడదు- మనకు అర్థం అయిన విషయాలు, అవతలి వైపు ఉన్న వారికి అర్థం కాకపోవచ్చు- తరువాత ఎప్పుడో అవచ్చు! అందుకని ఒదిలెయ్యాలి!
హ్యూమన్ రిలేషన్స్ విషయంలో కొందరు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు! "ఇక జన్మలో మాట్లాడేది లేదు"
అని సాధారణంగా మనం వినే మాట అది!అది చివరి మాట! చాలా మంది ఆ మాటను పాటిస్తారు కూడా! అయితే, దాన్ని పాటించడం అంత సులభం కాదు. పెయిన్ ఉంటుంది! లైఫ్ లాంగ్ మనతో వస్తుంది!
మనిషికి పుటుక వల్ల సంక్రమించిన సంబంధాలు- అంటే తల్లిదండ్రుల తోబుట్టువుల బంధువుల సంబంధాలు!
తరువాత సామాజిక జీవితంలో సంక్రమించే ,ఉద్యోగ వ్యాపార తదితర పరిచయాలు , స్నేహాలు వగైరా!
ఓ మనిషి తాను జరపవలసి వచ్చే నిత్య వ్యవహారాలు అన్నిటినీ కూడా సాటి మనుషులతోనే నిర్వహించ వలసి ఉంటుంది! ఆ కారణంగా ,ఏవో అభిప్రాయ భేదాలు వస్తాయి! అవి తీవ్రమైన విభేదాలకు దారితీస్తాయి!
ఆస్తిపాస్తులు అప్పులు మర్యాదలు కట్నకానుకలు బాధ్యలు వగైరా విషయాల్లో విభేదాలు తలెత్తినప్పుడు, ఒకవైపు పరిష్కారాలకు ప్రయత్నాలు చేస్తూ, ఇక చివరి నిర్ణయం తీసుకుంటారు "ఇక వారితో మాట్లాడేది లేదు"
ఇలా ఆస్తిపాస్తుల అప్పుల బాధ్యతల విషయంలోనే కాకుండా, కేవలం అపార్ధాల మూలంగా కూడా కొందరు సంబంధాలను దూరం చేసుకుంటారు!
తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కూడా ఏవో కొన్ని సందర్భాల్లో విషయాల్లో అపార్థాలు తలెత్తుతాయి! దగ్గరి స్నేహితులు కూడా అపార్థం చేసుకుంటారు కొన్ని సార్లు!
చిన్న చిన్న విషయాలు కూడా, పెద్దపెద్ద అపార్ధాలకు దారితీస్తాయి! అందులో నిజానికి పెద్దగా ఏమీ ఉండదు!
'వారు మాట్లాడలేదు కద? మనం ఎందుకు మాట్లాడాలి?'
అంతటితో బిగుసుకుపోతారు! అంతే! దూరం పెరుగుతుంది! మనం గమనిస్తూ ఉంటాం.అయితే మనం అలా ఒదిలెయ్యకూడదు- ఓసారి పలకరించి చూడండి. తరువాత వారి ఇష్టం! వారు ఏ చివరి నిర్ణయం తీసుకున్నా అది వారి ఇష్టం అని , అలా ఒదిలెయ్యాలి!వారి నిర్ణయంతో మనకు సంబంధం లేదు, మనం కూడా ఏ నిర్ణయం తీసుకోకూడదు! మనం మాత్రం ఏ శాశ్వత నిర్ణయం తీసుకోకూడదు! ఏ విషయానికి ఆ విషయాన్నే చూడాలి! అన్నిటినీ కలిపేసుకోకూడదు!
అటువంటి కారణాల వల్ల కొందరు, ఆ సంబంధాలనే వదులుకునే మాటలు నిర్ణయాలు తీసుకుంటారు!
ఒకవేళ అవతలి వైపు ఉన్న వారు అటువంటి చివరి నిర్ణయం తీసుకున్నా , మనం మాత్రం అలా తీసుకోకూడదు!
రాజకీయాల్లో ఓ మాట ఉంది!
'శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శతృవులు లేరు' అని!
అది నిజమే! అదేమీ తప్పు కాదు! అవసరమైన విషయమే! జీవితానికి రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంటుంది! రాజకీయ తత్వవేత్తలు యోచించి సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చెప్పిన మాటలు అవి! జీవితంలో కూడా ఎవరూ శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు.విషయాల వారీగా వ్యవహారాలు చెయ్యాలి!
మానవ సంబంధాల విషయంలో, మీదే చివరి పలకరింపు అవ్వాలి! అది మీకు సంతృప్తిని ఇస్తుంది. అవతలి వైపు వారు తలుపులు మూసుకున్నా , మీరు మాత్రం తలుపులు ముయ్యకూడదు! మానవ సంబంధాలను సజావుగా సాగించే మూల సూత్రం అది!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి