*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౭౮ - 78)

 కందము :
*గ్రహభయ దోషము లొందవు*
*బహుపీడలు చేర వెరచు | పాయును నఘముల్*
*ఇహపర ఫలదాయక విను*
*తహతహ లెక్కడివి నిన్ను | దలఁచిన కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
ఈ చరాచర ప్రపంచలో వున్నప్పుడు, చనిపోయిన తరువాత కూడా అన్నివిధాలా మంచిని ఇచ్చేవాడా, ఈశా! పరేశా!! కృష్ణా!!! విను.   నిన్నే తలచి, నీ తోనే, వుండే వాడిని, ఏ గ్రహ దోషాలు గానీ కష్టాలు కానీ బాధించలేవు.  పాపములు అన్నీ అతనిని విడిచి పోవును.  గాలి వల్ల కలగే కష్టాలు కూడా అతని దగ్గరకు రావు.  నీ తోడు వుండగా,ఈ విషయంలో ఎటువంటి అనుమానము వుండక్కర లేదు .....అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*నీవే నేను అయినప్పుడు, నిన్నే నమ్మి వున్నప్పుడు, నీ స్పృహలోనే జీవనము గడుస్తున్నప్పడు, నన్ను ఏ గ్రహాలు, గాలి బాధలు, పాపాలు ఏమి చేయగలుగుతాయి, పౌండరీక వరదా!  "అంతయు నీవే హరి పుండరీకాక్ష! చెంత మాకు నీవే శ్రీ రఘురామా!!"*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు