ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం -871 2971 999

 ఎనుకట 
గీ వొగాది పండుక్కు
నెలా, రెన్నెళ్ళ 
ముందుగాల నుంచే
సంబురం అనిపిచ్చేది.
ఎగిలి వరంగనే లేసుడు,
ఇల్లూ, ఆకిలీ ఊడ్సుడు,
ఆలుకు జల్లి ముగ్గేసుడు,
కొత్త సెనిగె పప్పును నానవెట్టుడు, 
కట్టెల పొయ్యి మీద
బగ్గ ఉడుక వెట్టుడు, 
మెత్తగ ఉండికినంక
పొయ్యి మీదికేయి దించి
ఉన్న ఎసరును 
ఏరే బగొన్ల అంపుడు,
ఉడికిన పప్పును రోట్ల వోసి
మెత్తగ దంచుడు,
అటెన్క బెల్లం గుడ బగ్గ దంచి
ఆ రెండూ కలిపి ముద్ద లెక్క జేసుడు, 
గోదుమ పిండితో రొట్టె లెక్క జేసి,దాంట్ల గా బెల్లం పప్పును కొద్ది కొద్దిగ ఏసి 
బూరెలు జేసుడు,
పొయ్యి మీద రొట్టె పెంక పెట్టి, 
పెంక కాగినంక
నెయ్యితోనో , పల్లి నూనె తోనో
బూరెల్ను కాల్చుడు
అటెన్క ఇగ తినుడే!
నెయ్యితో జేసిన బూరెలు
కమ్మగ, తియ్యగ ఉంటయి.
పప్పు ఎసరు తోని సెనిగె పప్పు జెత్తే బగ్గ తినబుద్దయ్యేది. ఎండిపోయిన
కొబ్బరి కుడుకకు దారం గట్టి
దాని బొత్తల బెల్లం పెట్టుకొని
మెడల ఏసుకొని,
కొంచెం కొంచెం కొరుక్కుంట తినేటోల్లం. గట్ల తింటుంటే
మస్తుగుండేది.
మాపటి జాములకు 
ఎములాడ సాంబయ్య తోని
పంచాంగం జెప్పిచ్చుకునేటోల్లం. గంతే!
గిప్పటి లెక్క పచ్చడి గిచ్చడి
ఏం జేసుకునేటోల్లం కాదుల్లా!
గదెందో మాకు  నలబై యేండ్ల కిందట తెల్వనే తెల్వదు. మాకు తెల్సింది
వొగాదంటే..
బూరెలు జేసుక తినుడు, కొబ్బరి కుడుకను బెల్లం బెట్టుకొని తినుడు,
కొత్త పంచాంగం చెప్పిచ్చుకునుడు,
కొత్త పంచాంగం జూపుచ్చుకునే 
లగ్గాలు, కొత్త కొత్త పనులకు మూర్తాలు పెట్టుకునుడు. 
గంతే! మా ఊల్లే
నలబై యేండ్ల కిందట 
గిట్లనే ఉండే.
ఔ మల్ల!

కామెంట్‌లు