ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం 871 2971 999


 కొందరి సేయి గునం

మంచిదంటరు.

ఆల్లు ఏ పని జేసిన గని 

మంచి గైతదని 

ఓ నమ్ముకమంతే.

గట్లనే

మా ఊల్లే ఒక పిలగాడు 

కోడి గుడ్లను

తన సెత్తో  పొదిగెత్తే

అన్ని గుడ్లు 

పిల్లలు అయితయని 

ఓ నమ్ముకం కొందరికి.

ఆ పిలగాడు 

ఏమి జేసేటోడంటే..

పొదిగేసేటప్పుడు

చేత్తో గుడ్డును పట్టుకొని

అటూ ఇటూ ఊపెటోడు

గుడ్డులో సప్పుడత్తే

ఆ గుడ్డు ' సీ గుడ్డు ' అన్నట్టు.

దాన్ని పక్కకు పెట్టి,

సప్పుడు గాని గుడ్డును

లీల్లల్ల ఏసిటోడు.

మంగులంకున్న మసిని  ఎడుమ ఏలుకు పూసుకొని

ఒక్కొక్క గుడ్డును తీసి

మసిని అంటిచ్చి

గుల్ల కింద పెట్టెటోడు.

అట్ల 

ఇరువై ఒక్క గుడ్డు దాకా ఏసి 

పెట్టను దాని మీద వెట్టి 

గుల్లతో కమ్మేటోడు.

అట్ల సేసినందుకు

ఆ పిలగానికి

ఒక గుడ్డు ఇచ్చేటోల్లు.

ఆ గుడ్డును ఇంటికి తీస్కవొయి గంటెల  కొంచెం పల్లి నూనె వోసి పొయిల వెట్టి

నూనె కాగనంక

గుడ్డును పగులగొట్టి

అందులో ఏసి, కొంచెం ఉప్పేసి కాల్చుకునేటోడు. గట్ల ఉడికిన గుడ్డును ఉడుకుడుకుతోని

తింటుంటే.... అబ్బ! కమ్మగుండేదుల్లా!

గీ ముచ్చట నాకెట్ల ఎరుక? అని అనుకుంటుర్రు గద.

గట్ల గుడ్లను పొదుగేసే

పిలగాడు ఎవరో గాదుల్లా!

ఈ, మీ సోపతి గాడే.

గప్పట్ల ఒక్కో పెట్ట

ఇరువై,ముప్పై గుడ్ల దాక పెట్టేది. 

పొదుగేసిన అన్ని  గుడ్లు గుడ

పిల్లలు అయెటివి.

ఔ మల్ల!


కామెంట్‌లు