దొడ్డ బుధ్ది:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

 పచ్చని అడవిలో కోకిల,నెమలి,కోతి స్నేహితులు.కోకిలకు పాడటం వచ్చు.నెమలి పింఛం పురివిప్పి నాట్యం చేయడం వచ్చు.కోతి చెట్ల మీద దూకటమే కాదు చేతులతో కాయలు,పండ్లు కోసుకుని తింటుంది. అందుకే వాటికి గర్వం. తాము కూర్చున్న చెట్టు కింద ఏ ఇతర జంతువు వెళుతున్నా  వాటికి ఏ కళా లేదంటూ వాటిని కించ పరుస్తూ మాట్లాడటం వాటికి అలవాటు అయిపోయింది.
         ఒకరోజు ఏనుగు భారంగా నడుస్తూ కోతి,నెమలి,కోకిల ఉన్న చెట్టు వద్దకు వచ్చింది.
        "చూడండి,మనలో ప్రతి ఒక్కరికీ ఒక కళ ఉంది,మరి ఆ ఏనుగుకు ఏ కళా లేదు!కానీ,రోజుకు బోలెడు తిండి తిని,బలిసి తన వంటిని తనే మోసుకో లేక అలా భారంగా నడుస్తోంది,దానిది విచిత్రమైన బతుకు."అని గర్వంగా కోతి ఏనుగుకు వినబడేట్టు చెప్పింది.
         కోతి మాటలు విన్న ఏనుగుఏ మాత్రం పట్టించుకోకుండా చిరునవ్వుతో వెళ్ళిపోయింది!
          కాలం ఒకటిగానే ఉండదు కదా,వసంత ఋతువు పోయి,గ్రీష్మ ఋతువు వచ్చింది,అంటే ఎండలు వేడి ఎక్కువ అయి పోయాయి,చెట్లు ఎండిపోసాగాయి. ఆ ఎండిన కొమ్మలు రాచుకో సాగాయి,వాటి ఘర్షణ వలనవేడి పుట్టి,తరువాత నిప్పు పుట్టి చెట్లు అంటుకుని మంటలు చెలరేగ సాగాయి!
         అంతే నెమలి,కోతి,కోకిలలు భయంతో ఆహాకారాలు చేయసాగాయి!కాలి పోతున్న కొమ్మలనండి పొగ పైకి లేవ సాగింది.
          దూరంగా ఉన్న ఏనుగు ప్రమాదాన్ని గమనించింది,వెంటనే తన పరివారాన్ని అప్రమత్తం చేసింది.పక్కనే ఉన్న చెఱువు లోని నీళ్ళు తొండాలలో నింపుకుని,వేగంగా వెళ్ళి మండుతున్న చెట్లమీద నీళ్ళు చిమ్మాయి,అంతే మంటలు చల్లారి ఆరిపోయాయి.పెద్ద ప్రమాదం తప్పింది!ఇంకా నిప్పు ఏమైనా ఉందేమోనని ఏనుగులు నిలబడి చూడసాగాయి. ఏనుగుల మంచితనం,సహాయం చేసే గుణాన్ని కోతి,నెమలి,కోకిల గమనించాయి.
      వెంటనే కోతి పరుగున ఏనుగు వద్దకు వచ్చి"ఏనుగన్నా,మమ్మల్ని క్షమించు,మేము ఒక్కొక్కరం ఒకో కళలో గొప్ప అని గర్వ పడ్డాము,కానీ నీ దొడ్డ బుధ్ది,సహాయం చేసే గుణం ముందు మేము చాలా చిన్న."అని నమస్కారం పెట్టి చెప్పింది.
     "ప్రతి ఒక్కరికి ఒక్కో ప్రతిభ ఉంటుంది,ఒకరు గొప్ప,ఒకరు తక్కువ కాదు.ఉన్న ప్రతిభను ఉపయోగించాల్సిన రీతిలో ఉపయోగించి ఎదుటి వారికి మేలు కలిగేట్టు చేయగలగాలి,అంతేకానీ మనకు ఒక కళలో ప్రవేశముందని గర్వంతో  ఎదుటి వారిని కించపరచ కూడదు"అని ఏనుగ చెప్పింది.
   ఏనుగ శరీరాకృతి లోనే కాదు బుధ్ది లో కూడా దొడ్డదని కోతి,నెమలి,కోకిల గ్రహించాయి.