రాక్షసుడి భయం:-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445


  అడవిలో మూలికలు తేనె సేకరించే వీరన్న అడవి లోపలికి వెళ్ళి చెట్లను పరిశీలినచసాగాడు.

    ఇంతలో ఎక్కడినుండో "ఎవడురా నా అడవిలోకి వచ్చింది? బ్రతకాలని ఆశ ఉందా?లేదా?"అంటూ భీకరంగా అరుపు వినిపించింది.

       ఆ అరుపు విని వీరన్న భయంతో ఆశ్చర్యపోయాడు.ఇన్నాళ్ళు అడవికి వస్తున్నా ఇటువంటి అరపు వీరన్నకు వినబడలేదు.మరి ఈ రోజు ఇటువంటి అరుపు వినబడిందంటే ఖచ్చితంగా ఎవరో రాక్షసుడు అడవిలోకి వచ్చాడన్న మాట!

        కొంతసేపటికి ఓ పెద్ద చెట్టు ఆవల నండి ఓ భీకర ఆకారుడు కనబడ్డాడు.వాడు గట్టిగా "పోపో"అని అరచి వీరప్నను చూసి వణక సాగాడు!

        వాడు ఎందుకు అలా వణుకుతున్నాడో వీరన్నకు అర్థం కాలేదు.

       "అరేయ్, పో నాకు ఆకలిగా ఉంది,ఓ పులో, సింహాన్నో తినాలి,లేకపోతే చెట్లను విరచి తినాలి,నీ చొక్కా ఎరుపు రంగు నాకు అసలు నచ్చలేదు...మొదట దానిని విప్పి తగులబెట్టు,నిన్ను చూడలేకుండా ఉన్నాను"అని గట్టిగా అరవసాగాడు.

       వీరన్నకు వాడి బలహీనత,గుట్టు తెలిసిపోయాయి! రాక్షసుడు అడవిలో ఉంటే చెట్లు,అనేక జంతువులు చచ్చి జీవవైరుధ్యం దెబ్బతింటుందని తెలుసుకున్నాడు.

         "ఇక నీ ఆట కట్టిస్తానురా రాక్షసుడా"అనుకుంటూ వేగంగా అడవినుండి ఇంటికి వెళ్ళిపోయాడు.

       ఇంటికి వెళ్ళిన వీరన్న  ఇంట్లో తన భార్య ఎర్ర చీరలు,ఎర్ర దుప్పట్లు,ఎర్ర గుడ్డ పీలికలు ఒక పెద్ద సంచీలో పెట్టుకుని అడవికి వెళ్ళాడు.

        "నరవాసన,నరవాసన"అంటూ ఆ రాక్షసుడు చెట్టు చాటునుండి రాసాగాడు.ఈ సారి వీరన్న గబగబా తన సంచీలోంచి ఎర్ర చీరలను చెట్లకు కట్టాడు.ఎర్ర దుప్పటిని వంటినిండా కప్పుకున్నాడు.కొన్ని ఎర్రటి గుడ్డలను చేతిలో పట్టుకుని రాక్షసుడి వైపు వేగంగా వెళ్ళాడు.

     వీరన్న చేతిలోని ఎర్రటి బట్టల్ని,వాడి వంటిమీద ఎర్రటి దుప్పటిని చూసి రాక్షసుడు వణికి పోయాడు!

         "ఒరేయ్ వెళ్ళిపో! నీ ఎరుపు రంగును భరించలేక పోతున్నాను"అంటూ వణికి పోతూ నీరసంగా అడుగులు వెనక్కు వేయ సాగాడు.

       వీరన్న ఎంతో ధైర్యంగా ముందుకు పరుగెత్తి కొన్ని ఎర్ర బట్టల పీలికలికి రాళ్ళు కట్టి రాక్షసుడి మీదకు ఎగిరేశాడు!

     .అంతే ఆ ఎర్ర బట్ట పీలికలు విసురుగా వెళ్ళి వాడి మెడకు చుట్టుకున్నాయి!వాడు పెద్ద హాహా కారాలతో కూలిపోయాడు!వాడి లోంచి పొగ లాగ వాడి ప్రాణం బయటికి వచ్చింది.ఆ పొగలో ఒక మానవ ఆకారం ప్రత్యక్షమయింది! ఆ ఆకారం ఈ విధంగా చెప్పింది "నాయనా,వీరన్నా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ముని పెట్టిన శాపం నుండి విముక్తి కలిగించావు,అప్పటిలో నేను ఒక పొగరు పోతు రాజుని,మునులను,తపస్సులను గౌరవించే వాడిని కాదు,పైపెచ్చు వారిని అవమానించేవాడిని!ఒకసారి నేను అందమైన జింకను చంపి దాని ఎర్రని రక్తాని ఒక మునిపై పోసి ఆయనను అపవిత్రం చేశాను,అప్పుడు ఆయన నన్ను రాక్షసుడిగా మారిపోయేట్టు శాపమిచ్చాడు! ఎర్ర రంగు నాపాలిట మృత్యువు అవుతుందని శపించాడు.నీవు విసిరిన ఎర్ర రంగు బట్టలవలనే నాకు శాప విముక్తి జరిగి పోయింది.నీ మేలును మరచిపోలేను,నేను రాజుగా ఉన్నప్పుడు కొంత బంగారాన్నిఇక్కడ గుహలో దాచాను,దానిని తీసుక వెళ్ళి బాగుపడు,నీకు చేతనైన మంచి పనులు చేయి"అని ఆశీర్వదించి రాక్షసుడు ఆకాశంలో కలసిపోయాడు! 

         వీరన్న బంగారం తీసుకుని వెళ్ళి తన గ్రామంలో వైద్యశాల స్థాపించి అడవి మూలికలతో పేదలకు ఉచిత వైద్యం చేయసాగాడు.మిగిలిన బంగారంతో ఊరిలో వాళ్ళకి ఉపయోగపడే ఎన్నో మంచి పనులు చేశాడు.రాక్షసుడి మరణం వలన అడవిలో చెట్లు,జంతువులు హాయిగా బతికి,జీవ వైరుధ్యం తో పర్యావరణ రక్షణ జరిగింది.