చెరుపు చేసే కోపం:- కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

   భీమయ్యది వింత ఆలోచన. తనంటే భయం ఉంటేనే తన పని వాళ్ళు గానీ, కుటింబీకులు గానీ తన చెప్పు చేతల్లో ఉంటారనే దురభిప్రాయం  అతనిలో ఉంది.
        అదే ఊరిలో ఉండే సుందరయ్యది మృదు స్వభావం.అతని మృదు స్వభావం వలన పనివాళ్ళు,ఇంట్లోవాళ్ళు ఎంతో మంచిగా చూస్తూ ఎంతో గౌరవించేవారు.ఎవ్వరినీ కోపగించుకునే వాడు కాదు.అందరినీ ప్రేమతో చూసుకునే వాడు.
        భీమయ్య,సుందరయ్య పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. చిత్రమేమిటంటే భీమయ్య పొలంకంటే సుందరయ్య పొలం ఎంతో చక్కగా దిగుబడి ఇచ్చేది! మరి భీమయ్య కూడా మంచి ఎరువులు,విత్తనాలు వేసి పంట పండించేవాడు.అయినా భీమయ్య పొలం లోని పంట అంత నాణ్యతగా పండేది కాదు.
       భీమయ్య సందరయ్య పంటను గమనించి ఇలా ఎందుకు జరుగుతోందని కోపంగా పనివాళ్ళను ప్రశ్నించాడు.ఎవ్వరూ భీమయ్యకు జవాబు చెప్పలేదు! 
        "జవాబు చెప్పరా?" అని గట్టిగా అరిచాడు భీమయ్య.
         పనివాళ్ళలో పెద్ద వయసున్న కాంతయ్య "అయ్యా,నేను పెద్దవాణ్ణి నేను చెప్పేది విని కోపగించుకోవద్దు"అన్నాడు.
      "సరే చెప్పు కాంతయ్యా" అన్నాడు భీమయ్య.
       "మన పొలం పనులు చేసే వాళ్ళలో చాలామంది యువకులే,వాళ్ళకు ఆత్మాభిమానం ఎక్కువ, ఎవ్వరితో మాట పడరు.మీరు కోపంతో వాళ్ళని అరుస్తుంటారు.అందుకే వాళ్ళు మనస్ఫూర్తిగా  పొలం దున్నటం కానీ, విత్తులు పాతడం కానీ చెయ్యలేక పోతున్నారు.అందుకే పంటలో నాణ్యత లేదు!అదే ఆ సుందరయ్య పనివాళ్ళను పనివాళ్ళగా చూడడు,ఇంట్లో కుటుంబ సభ్యులులాగా చూసుకుంటాడు,ఎవరైనా తప్పు చేస్తే నమృతగా చెప్పి వారు చేసే తప్పును సరిదిద్దుతాడు.ఎవరికి ఏకష్టం వచ్చినా తగిన విధంగా ఆదుకుంటాడు.అందువలన సుందరయ్య పొలం తమ పొలమే అనుకుని పనులు ఎంతో సమర్థవంతంగా చేస్తారు.అందుకే సుందరయ్య పంట అంత బాగా పండుతోంది"అని కాంతయ్య చెప్పాడు.
      భీమయ్య ఏం మాట్లాడకుండా ఆలోచనలో పడి పోయాడు.ఇక తాను కూడా మారాలనీ,తన కుటుంబీకులతో ,పనివాళ్ళతో తన ప్రవర్తన మార్చుకోవాలనీ ఆలోచించాడు.సాధన చేసి తన కోపాన్ని తగ్గించుకున్నాడు.
       భీమయ్య ప్రవర్తనలో మార్పువలన పనివాళ్ళలో కూడా భీమయ్య మీద మంచి అభిప్రాయం ఏర్పడింది! అనూహ్యంగా ఆ సంవత్సరం భీమయ్య పంటకూడా సుందరయ్య పంటలాగ చక్కగా పండింది! 
         ప్రేమ, మంచితనంతో ఇతరుల హృదయాలు గెలవవచ్చని భీమయ్య తెలుసుకున్నాడు.
        భీమయ్యలో వచ్చిన మార్పుకి ఇంట్లోవాళ్ళు,పనివాళ్ళు ఎంతో సంతోషించారు.