అసలైన రాక్షసుడు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

 మాళవిక రాజ్య సరిహద్దులో ఒక పెద్దకొండ ఉంది.కొండ చుట్టూ అరణ్యం ఉంది.ఆ కొండ గుహలో ఒక రాక్షసుడు ఉంటున్నట్టు ప్రజలు చెప్పుకునేవారు.మాళవిక రాజ్యాన్ని ఏలుతున్న జయంత మహారాజుకి అటువంటి మాటల మీద నమ్మకం లేదు.అవన్నీ మూఢనమ్మకాలుగా కొట్టి పారవేసేవాడు!
        ఒకరోజు  వృద్ధురాలు రాజు వద్దకు వచ్చి తన కొడుకు కట్టెలు కొట్టేందుకు కొండ దగ్గరకు వెళ్ళి తిరిగి రాలేదని ఏడుస్తూ చెప్పింది.వాడే రాజు గారి వంటశాలకు కట్టెలు తెచ్చేవాడు. 
       రాజు గారికి కూడా ఆ కొండ గుహలో రాక్షసుడు ఉండవచ్చనే అనుమానం వచ్చింది.ఏది ఏమైనా  తన సైన్యంలో మెరికల్లాంటి ఇరవై మందితో వెళ్ళి వాడి అంతు చూడాలనుకున్నాడు.
        ఆయుధాలతో రాజు తన పరివారంతో కొండ వద్దకు వెళ్ళాడు.గుహ బయట కొన్ని జంతువుల అస్థి పంజరాలు పడి ఉన్నాయి! వెంటనే రాజు,పరివారం కత్తులు దూసి గుహ లోకి ప్రవేశించారు.లోపల కొన్ని జంతువుల అస్థి పంజరాలు వేలాడదీయబడి ఉన్నాయి! మొత్తానికి గుహ వాతావరణం భయంకరంగా ఉంది.మరి కొద్ది దూరంలో గుహలో రాళ్ళ మధ్య బంగారు ఆభరణాలు,విలువైన వస్తువులు ఉన్నాయి!రాజు గారికి అసలు సంగతి అర్థమై పోయింది.
        ఆ గుహ స్థావరం చేసుకునికొందరు బందిపోట్లు తన రాజ్యం,ఇరుగు పొరుగు రాజ్యాల మీద పడి సంపదలు దోచి ఆ గుహలో దాచి జీవితం గడుపుతున్నట్టు రాజు గారికి అర్థం అయింది. ఎందుకంటే రాక్షసుడు కేవలం జంతువులు,మనుషలను తిని బతుకుతాడు. వాడికి బంగారం అక్కరలేదు.ఆ బందిపోట్లే ఆ గుహలో రాక్షసుడు ఉన్నట్టు ప్రజలలో భయం రేకెత్తించడం వలన ఆ గుహ ఛాయలకు ఎవరూ రావడం లేదు.
         వెంటనే తన పరివారంలో ఐదు మందిచేత ఆ ఆభరణాలు,విలువైన వస్తువులురాజధానికి చేర్చమని చెప్పి,మిగతా వారిని అక్కడే పొంచి ఉండమని,ఆ బందిపోట్లు వస్తే బంధించమని చెప్పాడు. ఆరెండవ రోజు ఆరుమంది బందిపోట్లను బంధించి రాజుగారి ఎదుట ప్రవేశ పెట్టారు సైనికులు.ఆ బందిపోట్లలో ముసలిదాని కొడుకు కూడా ఉన్నాడు.
         "రాజు ఆశ్చర్యంతో,ఏమిటి నీవు కట్టెలు కొట్టే వృత్తే కాకుండా దొంగతనాలు కూడా చేస్తున్నావా?" అని అడిగాడు.
       వాడు తల వంచుకుని ఈ విధంగా చెప్పాడు,"అవును ప్రభూ,కట్టెలు కొడితే వచ్చే సంపాదన అంతంత మాత్రమే,అందులో తమరి అంతఃపురవంటవాళ్ళకి కొంత డబ్బు లంచంగా ఇవ్వాలి,లేక పోతే నేను కొట్టిన కట్టెలు తీసుకోరు.ఈ పరిస్థితుల్లో నా కుటుంబ పోషణార్థం బందిపోట్లతో చేతులు కలప వలసి వచ్చింది.మీ ఖజానా రహస్యాలు నాకు తెలిసి ఉంటాయని  వాళ్ళు వారి ముఠాలో చేర్చుకున్నారు.
        అప్పుడు రాజుకు నిజమైన బందిపోట్లు తన అంతఃపురంలోనే ఉన్నారని అర్థమై ఆ వంటవాళ్ళకు ఖఠినమైన శిక్షలు వేశాడు.
        అదిగాక రాజ కార్యాలయాల లోని లంచగొండులను గూఢచారుల ద్వారా పట్టించి ఖఠినశిక్షలు వేశాడు.
        వృద్ధురాలి కొడుకు పరిస్థితి అర్థం చేసుకుని వాడికి జీతం పెంచి తగిన విధంగా వాడికి చెప్పవలసింది చెప్పి,స్వల్ప శిక్ష వేశాడు.
       అంతటితో ఆ రాజ్యంలో 'లంచం'అనే రాక్షసుడి పీడ తొలగి పోయింది.
(This unpublished story written in 1986.)
 

కామెంట్‌లు