హరికి అమ్మ ,నాన్న, నా అన్నవాళ్ళు లేరు! చిన్నప్పటినుండి కష్టపడి పొట్ట పోషించుకుంటూ ఒక పాక లో ఉంటున్నాడు.
ఒకరోజు వాడు వస్తుంటే ఒక కుప్ప తొట్టి దగ్గర ఓ కుక్క పిల్ల "కుయ్యో,కుయ్యో" అంటూ బహుశా ఆకలికి ఏడుస్తోంది.దానికి కూడా తల్లి కుక్క లేనట్టు హరి గమనించాడు.ఎందుకంటే హరి అక్కడ చాలాసేపు నిలబడి తల్లి కుక్క వస్తుందేమో అని ఎదురు చూశాడు. ఎంతసేపయినా తల్లి కుక్క రాలేదు.దానిని కాపాడాలని హరి ఆ కుక్క పిల్లను ఎత్తుకుని తన పాకకు తీసుకవెళ్ళాడు.
మరి దానికి ఆకలి , పాలు పోద్దామంటే తన వద్ద పాలు లేవు,పాలు కొందామంటే డబ్బులు లేవు!
హరి మెల్లగా పాక పక్కనే ఉన్న పరంధాముడి ఇంటికి వెళ్లి, "అయ్యా, ఒక గ్లాసుడు పాలు ఉంటే ఇవ్వండి, ఒకబుజ్జి కుక్కపిల్ల ఆకలితో ఏడుస్తోంది" అని అడిగాడు.
"నీకే తిండికి లేదు,మళ్ళీ నీకొక కుక్కపిల్లా? పోరా పో" అని పరంధాముడు హరిని తరిమేశాడు.
ఎలాగో వాళ్ళని వీళ్ళని అడిగి కొద్దిగా పాలు తెచ్చి దానికి పోశాడు.దానికి జంబు అనే పేరు పెట్టుకున్నాడు.గేదల కొట్టానికివెళ్లి తాను పనిచేసి తెచ్చుకునే డబ్బుల్లోనే రోజూ పాలు రెండు రూపాయలకు కొని దానికి పోసేవాడు! తాను వండుకున్న అన్నంలో ఒక్కొక్కసారి పాలు కలిపి దానికి పెట్టేవాడు. హరి మీద దానికి ప్రేమ,విశ్వాసం పెరిగిపోయాయి! జంబు రాత్రిళ్ళు ఆ పాక బయటే పడుకో సాగింది.
అలా అది హరి సంరక్షణలో పెరగా సాగింది. ఎవరైనా కొత్తవాళ్ళు ఆ వీధి లోకి వస్తే అరిచేది, కాని కరిచేది కాదు!
ఒకరోజు రాత్రి దొంగ ఒకడు మెల్లగా పరంధాముడి ఇంటి ప్రహరీ గోడ దూకి ఇంట్లోకి వెళ్లాలని గోడ నిశ్శబ్దంగా ఎక్కసాగాడు. వాడిని జంబు గమనించి పెద్దగా అరుస్తూ వెళ్లి ఎగిరి వాడి పిక్కను పట్టుకుంది! భయంతో వాడు పెద్దగా అరిచాడు. ఆ అలికిడికి పరంధాముడు, హరి నిద్రలేచి బయటికి వస్తే, మొహానికి నల్ల రంగు పూసుకున్నదొంగ కనబడ్డాడు!( కొందరు దొంగలు చీకట్లో కలిసిపోయి ఎవరు గుర్తు పట్టకుండా అలా నూనె , బొగ్గుపొడి కలిపి పూసుకునేవారు.)
పరంధాముడి విషయం అర్ధంఅయి దొంగను పట్టుకున్నాడు. దొంగను పట్టుకోవడంలో హరి కూడా సహాయం చేశాడు.
ఆ రోజు పరంధాముడు తన అంగడి డబ్బు పదివేలు ఇంట్లో ఉంచాడు.జంబు కుక్క అరవకపోయి ఉంటే,తన పదివేలు దొంగ చేతుల్లోకి వెళ్లుండేది.జంబు చేసిన మేలుకు పరంధాముడి మనసులో కదలిక వచ్చింది.
పరంధాముడు హరి భుజం మీద చెయ్యి వేసిఈ విధంగా చెప్పాడు.
"హరీ, ఈ జంబు కుక్కకు ఆరోజు పాలు ఇవ్వకుండా బాధ పెట్టాను. కానీ నీమీద మన వీధి లోని వారి మీద దానికి విశ్వాసం ఎక్కువ.అందుకే అది ఈ రోజు అది దొంగను పట్టుకుని నా ఇంట్లో డబ్బు కాపాడింది! ఇక మీదట దానికి పాలు ,అన్నం నేనే ఇస్తాను. నీవు కూడ మా షాపులో సహాయం చేసేందుకుచేరు ఇక్కడ అక్కడా పని చేయకు, నీకు నెలకు మూడువేల ఇస్తాను" అని ఎంతో మంచి మనస్సుతో చెప్పాడు. పరంధాముడి కళ్ళకు హరి దండం పెట్టాడు.
హరి జంబూ కుక్కనిరక్షించి, పోషించడం వలన ఆ మూగజీవి ఎంత సహాయం చేసిందో చూశారా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి