ఒక అడవిలో ఒక గొర్రె వుండేది. దానికి మూడు చిన్న చిన్న పిల్లలు వున్నాయి. తల్లి రోజూ అడవికి పోయి తాను తిని, పిల్లలకింత తెచ్చి తినిపించేది. కొంతకాలానికి అవి పెరిగి పెద్దగయినాయి. ఒకరోజు ఆ గొర్రె తన పిల్లలను దగ్గరికి పిలచి "చూడండి, మీరు పెరిగి పెద్దగయినారు. ఇకనుంచి మీ బతుకు మీరే బతకాలి. ఎవరి మీదా ఆధారపడి బతకగూడదు. నా దగ్గర కొంత ధనముంది. అది తీసుకోని పోయి హాయిగా బతకండి" అంటూ మూడింటికీ మూడు మూటలు ఇచ్చింది.
ఆ మూడు పోయేటప్పుడు వాళ్ళమ్మ వాటిని హెచ్చరిస్తా “చూడండి... తోడేలుకు మనకు అస్సలు పడదు. పొరపాటున గూడా దాని మాటలు నమ్మకండి. దానికి దొరకకండి" అని చెప్పింది.
మూడు గొర్రెలు మూడు వైపులా పోసాగాయి. మొదటి పిల్ల పోతా వుంటే ఒకచోట ఒకడు బండి మీద గడ్డి వేసుకోని పోతా కనబడ్డాడు. ఆ గడ్డిని చూడగానే దానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వాని దగ్గరికి పోయి "నా దగ్గరున్న డబ్బుల్లో సగం తీసుకొని ఈ గడ్డిని నాకియ్యవా" అనింది. వాడు సరేనని గడ్డినిచ్చి డబ్బులు తీసుకోని పోయినాడు.
ఆ గొర్రె ఆ గడ్డిని తీసుకోని పోయి ఒకచోట చిన్న కొట్టం వేసుకోనింది. పొద్దునంతా అడవిలో తిరుగుతూ, రాత్రిపూట హాయిగా ఆ ఇంటిలో పడుకోసాగింది.
రెండవ గొర్రెపిల్ల పోతా వుంటే ఒకచోట ఒకడు గొడ్డలితో చెక్కలు ముక్కలు ముక్కలుగా నరుకుతా కనబన్నాడు. ఆ చెక్కపలకలను చూడగానే ఆ గొర్రెపిల్లకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వాని దగ్గరకు పోయింది. “నా దగ్గరున్న డబ్బుల్లో ముక్కాలు తీసుకోని ఈ చెక్కపలకలు నాకియ్యవా" అనింది. వాడు సరేనని డబ్బులు తీసుకోని చెక్క పలకలు ఇచ్చేసినాడు.
ఆ గొర్రెపిల్ల ఆ చెక్క పలకలు తీసుకోని పోయి ఒకచోట చిన్న చెక్క ఇల్లు కట్టుకోనింది. పొద్దునంతా అడవిలో తిరుగుతూ, దొరికింది తింటూ, హాయిగా తన చెక్క ఇంటిలో పడుకోసాగింది.
మూడవ గొర్రెపిల్ల పోతావుంటే దానికి ఒకచోట ఒకడు ఇటుకలు తయారు చేసి అమ్ముతా కనబన్నాడు. ఆ ఇటుకలను చూడగానే ఆ గొర్రెపిల్లకు ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. వెంటనే వాని దగ్గరకు పోయింది. “నా దగ్గరున్న డబ్బులన్నీ తీసుకోని ఈ ఇటుకలు ఇయ్యవా" అని అడిగింది. వాడు సరేనని డబ్బులు తీసుకోని ఇటుకలు ఇచ్చేసినాడు.
ఆ గొర్రెపిల్ల ఇటుకలన్నీ తీసుకోని పోయి ఒకచోట ఒక చిన్న ఇటుకల ఇల్లు గట్టిగా కట్టుకోనింది. పొద్దునంతా అడవిలో దొరికింది తింటూ, హాయిగా తన ఇంటిలో పడుకోసాగింది.
ఆ అడవిలో ఒక దొంగ తోడేలు వుంది. దానికి కొట్టంలో వున్న గొర్రెపిల్ల కనబడింది. వెంటనే అది కొట్టం దగ్గరికి పోయి “గొర్రెబావా... గొర్రెబావా... కొంచం తలుపు తీయవా. మనమిద్దరం కలసి మెలసి వుందాం. నేను గూడా మీ ఇంటిలోనే వుంటా" అనింది.
గొర్రెపిల్లకు ఆ తోడేలును చూడగానే అమ్మ చెప్పిన మాటలు మతికి వచ్చినాయి. వెంటనే అది “నువ్వూ వద్దు, నీతో కలసి ఉండడమూ వద్దు. పో పో" అనింది. దాంతో ఆ తోడేలు “నువ్వెక్కడికి తప్పించుకుంటావు నా నుంచి” అంటూ ఉరుక్కుంటా వచ్చి గట్టిగా ఆ కొట్టాన్ని ఢీ కొట్టసాగింది. అది గడ్డితో చేసినేది గదా. దాంతో ఆ దెబ్బలకు కూలిపోయింది..
అంతలోపు ఆ గొర్రెపిల్ల వెనుకనుంచి తలుపు తీసుకొని బయటకు ఉరికింది. తోడేలు లోపలికి పోయి చూసింది గానీ గొర్రెపిల్ల అక్కడ లేదు. దూరంగా పారిపోతూ కనబడింది. తోడేలు వెంటపడింది. గొర్రెపిల్ల ఉరుక్కుంటా... ఉరుక్కుంటా పోతా వుంటే దానికి చెక్క ఇల్లు, దానిలో వాళ్ళ అన్న కనబన్నాడు.
వెంటనే అది తలుపు తడుతూ “అనా...అనా... తొందరగా తలుపు తీయి. లేకుంటే తోడేలు నన్ను పట్టుకుంటాది" అనరిచింది. 'సరే' అని అది తలుపు తీసింది. వెంటనే గొర్రెపిల్ల లోపల దూరి తలుపులేసి గడ పెట్టేసింది.
కాసేపటికి తోడేలు అక్కడికి చేరింది. దబదబదబ తలుపు కొడతా “వెంటనే తలుపు తెరవండి. లేకుంటే ఈ ఇల్లు పడగొట్టి మీ ఇద్దరినీ చంపి తింటా" అని గట్టిగా అరిచింది. రెండూ లోపలనే వున్నాయి గానీ తలుపు తెరవలేదు. దాంతో కోపంగా “మీరెక్కడికి తప్పించుకు పోతారు, నానుంచి" అంటూ ఉరుక్కుంటా వచ్చి గట్టిగా ఆ ఇల్లును ఢీ కొట్టసాగింది. అది చెక్కలతో చేసినేది గదా. దాంతో ఆ దెబ్బలకు కాసేపటికి అదిగూడా కూలిపోయింది.
అంతలోపు ఆ రెండు గొర్రెపిల్లలూ వెనుకనుంచి తలుపు తీసుకోని బైటకు ఉరికినాయి. తోడేలు లోపలికి పోయి చూసింది... కానీ గొర్రెపిల్లలు అక్కడ లేవు. దూరంగా పారిపోతా కనబన్నాయి. తోడేలు వెంటపడింది. ఆ గొర్రెపిల్లలు వేగంగా ఉరుక్కుంటా... ఉరుక్కుంటా పోతావుంటే వాటికి ఒకచోట ఇటుకల ఇల్లు, ఆ ఇంటిలో వాళ్ళ అన్న కనబన్నాడు.
వెంటనే అవి తలుపులు బాదుతూ “అనా... అనా... మమ్ములను చంపి తినడానికి తోడేలు తరుముకుంటా వెంటపడింది. తొందరగా తలుపులు తీయి" అన్నాయి. 'సరే' అని అది తలుపు తీసింది. వెంటనే అవి రెండూ లోపలకు దూరి తలుపులేసి గడ పెట్టేశాయి.
కాసేపటికి తోడేలు అక్కడికి చేరుకోనింది. దబదబదబ తలుపు కొడుతూ “తొందరగా తలుపులు తెరవండి. లేకుంటే ఈ ఇల్లు కూడా పడగొట్టి మీ అందరినీ చంపి తింటా" అని గట్టిగా అరిచింది. “చేతనయితే పడగొట్టుకో.. అంతేగానీ తలుపులు తెరవం” అంటూ మూడూ లోపలి నుంచే గట్టిగా అరిచినాయి. దాంతో అది కోపంగా “మీరెక్కడికి పోతారు నానుంచి తప్పించుకోని" అంటూ ఉరుక్కుంటా వచ్చి ఎగిరి ఆ ఇంటిని గట్టిగా ఢీకొనింది.
కానీ ఆ ఇల్లు ఇంతకుముందులా గడ్డితో చేసినేది కాదు. చెక్కతో చేసినేదీ కాదు. అది ఇటుకల ఇల్లు.
దాంతో ఎగిరి ఢీ కొట్టగానే ఆ తోడేలుకు తల పగిలి చుక్కలు కనబన్నాయి. అంతలో ఆ మూడు గొర్రెపిల్లలు పొయ్యిమీద పెట్టిన వేడి వేడి నీళ్ళు ఆ తోడేలు మీద పైనుండి పోసినాయి.
అంతే... ఆ తోడేలు ఒళ్ళంతా కాలిపోయింది. ఒళ్ళంతా సురసురసుర బొబ్బలెక్కినాయి. “ఇక్కడ వుంటే ఈ గొర్రెపిల్లలు చంపినా చంపుతాయి" అనుకోనింది. మట్టసంగా తోక ముడుచుకోని కుంటుకుంటా అక్కన్నించి పారిపోయింది. అప్పటినుండీ ఆ మూడు గొర్రెపిల్లలూ ఆ ఇటుకల ఇంటిలోనే వుంటూ హాయిగా కలసిమెలసి బతకసాగాయి.
*మూడు గొర్రె పిల్లలు ఒక తోడేలు (బాలల విదేశీ జానపద కథ)* డా.ఎం.హరికిషన్ - 9441032212 - కర్నూలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి