అలనాటి మహాబలిపురం:- యామిజాల జగదీశ్

 ఆ రోజుల్లో మహాబలిపురానికి పడవలలో వెళ్ళొచ్చేవారట. నాటి జ్ఞాపకాలకు సంబంధించి ఇటీవల తమిళంలో ఓ వ్యాసం చదివాను.

వివేక చింతామణి అనే పత్రికలో నటేశ శాస్త్రి అనే ఆయన రాసిన వ్యాసం 1894లో వెలువడింది. 
చెన్నై నుంచి దక్షిణాన వెళ్ళే చెంగల్పట్టుకి వెళ్ళే దారిలో తిరుక్కయుకుండ్రం అనే దివ్యక్షేత్రానికి జట్కాలో చేరుకోవచ్చు. అక్కడి నుంచి తొమ్మిది మైళ్ళ దూరాన్ని మరొక జట్కాలో చేరుకునే వారట. అక్కడికి సమీపాన మహాబలిపురం. 
చెన్నై నుంచైతే బకింగ్ హాం కాలువగుండా పడవలలో ప్రయాణించి మహాబలిపురం చేరుకునేవారట ఆ కాలంలో....కానీ వేసవిలో నీటి మట్టం తగ్గిపోయి ప్రయాణం అంత సులభంగా సాగేది కాదట. దాదాపు నలభై మైళ్ళ దూరం పోవాలి కనుక పడవ నడిపేవారు ఎక్కువ డబ్బులు అడిగేవారట.
కనుక చాలామంది రైలులో ప్రయాణించి తిరుక్కయుకుండ్రం చేరేవారు. అక్కడి ఎనిమిది మైళ్ళు జట్కాలో ప్రయాణించి సముద్రజలంలో రెండు ఫర్లాంగులు నడిచి వెళ్ళేవారట. అనంతరం బకింగ్ హాం కాలువ దాటాలి. ఇవన్నీ అయ్యాక ఓ అర మైలు దూరం నడిస్తే మహాబలిపురంలోకి అడుగుపెట్టేవారట. 
 అప్పట్లో మహాబలిపురంలో చిన్న చిన్న పూరిపాకల ఇళ్ళుండేవట. 
ఈ ఊరుకి మూడువైపులా సముద్రం ఉండేది. 
ఊరు మధ్యలో ఓ విష్ణువాలయం ఉండేది. భక్తులు సంఖ్య తగ్గడంతో అర్చకులు పూజలువంటివి శ్రద్ధతో చేసినట్టనిపింలేదు. ఆలయంలో స్వామివారి పవ్వళింపు వంటి విగ్రహలు కొన్ని ఉన్నాయి. ఆలయ పరిసర ప్రాంతాలలో కట్టడాలు దెబ్బతిన్నాయి. ఆలయ ప్రాకారంలోని పవిత్ర వృక్షాలు ఎండి ప్రదక్షిణం చేసే వారికి బాధకలిగిస్తున్నాయి.
శిల్పశాస్త్రానికి ప్రాధాన్యమున్న ఈ ప్రాంతంలోని దర్శనీయ స్థలాల గురించి ఆయన రాసిన ముఖ్యాంశాలు....
పైన పేర్కొన్న ఆలయానికి ఉత్తరాన ఒక కొలను. ఈ కొలనుకి ఒకవైపు ముప్పై అడుగుల ఎత్తున్న బండరాయి. ఈ రాతిపై ఏనుగు, జింక, మనిషి వంటి రూపాలు చెక్కబడి ఉన్నాయి.‌ అర్జునుడు తపస్సు చేసినటువంటి విగ్రహానికి ఉత్తరంగా ఓ ఆలయం. అది వినాయకుడి ఆలయం.  ఒకే రాతిపై చెక్కబడినది. దాదాపు ముప్పై అడుగుల ఎత్తున్న గోపురంతో కూడిన ఆలయమిది.
వినాయకుడి ఆలయానికి దక్షిణంగా ఓ పెద్ద రాతిపై చెక్కిన మండపం. ఇది సుమారు పద్దెనిమిది అడుగుల రాతిపై చెక్కబడి ఉంది. ఈ రాతిపై కొన్ని శిల్పాలు చెక్కబడి ఉన్నాయి.
ఈ మండపానికి తూర్పున జారిపోతున్నట్టుగా ఓ బంతి ఆకారంలో ఓ బండరాయి. ఇది శ్రీకృష్ణుడు తీసిన వెన్నగా చెప్తున్నారు.
ఈ వెన్న రాతికి పశ్చిమంగా మూడు పెద్ద పెద్ద రాళ్ళతో చేసిన ఓ పొయ్యి. ఇది భీముడి పొయ్యిగా చెప్పారు.
ఇక యశోధ ఉపయోగించిన పెరుగు కుండగా ఓ రాతి శిల్పం. ఆరు గజాల విస్తీర్ణం కలిగినది.
ఒక పెద్ద రాతిపై మూడు మండపాలు చెక్కారు. వీటిపై చిన్న చిన్న రూపాలు కనిపించాయి.
ఈ మండపాలకు దాటి సుమారు ఒక మైలు దూరం వెళ్తే దక్షిణంగా జంట మండపాలున్నాయి.
ఈ మండపాల సమీపాన ఓ రాతితో చెక్కిన రథాలు రెండున్నాయి. ఒక్కొక్కటీ ఇరవై అయిదు అడుగుల ఎత్తున్నవి. అలాగే పన్నెండడుగుల పొడవు కలిగినవీ రథాలు.
ఈ రెండు రథాలకు దక్షిణాన మరో రథం. ఇదికూడా ఒకే రాతిపై చెక్కినది.
పైన పేర్కొన్న రథాలకు ఓ అర మైలు దూరాన మరొక విచిత్రమైన రథం ఉంది. ఇది అయిదు బండరాళ్ళపై చెక్కనవే రథాలు. అలాగే ఇక్కడే యాభై అడుగుల పొడవు, పద్దెనిమిది అడుగుల వెడల్పు, ముప్పై ఆరడుగుల ఎత్తున్న మండపం. అయిదు రథాలకు దగ్గర్లో ఒక ఏనుగు, ఒక సింహం, ఒక వృషభం శిల్పాలను ఎంతో చక్కగా చెక్కారు. అయితే వీటిని కొందరు అక్కడక్కడా పగలగొట్టారు.
ఇవన్నీ నూట ఇరవై ఏడేళ్ళకు పూర్వం మహాబలిపురంలో ఉన్న తీరుగా గమనించగలరు.

కామెంట్‌లు