తేనెలొలుకు తెలుగు-: - రామ్మోహన్ రావు తుమ్మూరి

 
ఆమ్రేడిత శోభ
~~~~~~~~~~~~~
“గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను”
                ~~~~~~~~~~
   రోజూఅనుకుంటూ ఉంటాను ముందే ‘చకచకా’ వ్యాసం రాసి ఉంచి పోస్ట్ చేయాలని. కాని కొంత పనుల వ్యగ్రత మరికొంత బద్ధకం. ‘గబగబా’ ఏదో రాయటం కాదుగదా.అసలే రాసేది తేనెలొలుకు తెలుగు గురించి.తెలుగు భాష తియ్యదనం గురించి. 
        సరే ఈసారి ఆమ్రేడితాల గురించి మాట్లాడుకుందామనిపించింది. వేరే భాషల గురించి తెలియదు కాని
తెలుగులో ఆమ్రేడితాల పాత్ర తక్కువేమీ కాదు.ఆమ్రేడితమంటే కొంతమందికి తెలియక పోవచ్చుకానీ చదువుకున్న వారయినా చదవుకోని వారయినా మాట్లాడేప్పుడు  ఏదో సందర్భంలో వాడకుండా మాత్రం ఉండలేరు.మెల్లగా నడిచే పిల్లల్ని ‘గబగబ’ నడువు అంటారు. మెరిసే వస్తువుల్ని చూసినప్పుడు ‘తళతళ ‘మెరుస్తుంది అంటాం. ఉదాహరణకు కంచం తళతళ లాడుతుంది అనటం సహజం.అదే ఆకాశంలో చుక్కలు ’మిలమిల’మెరుస్తున్నాయి అనటం చూస్తాం. ఇప్పుడర్థమయ్యింది కదా ఆమ్రేడితాలంటే. ఒకే పదం ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉపయోగిస్తే వ్యాకరణ పరంగా అలాంటి పదాలను ఆమ్రేడితాలంటారు. సర్వ సాధారణంగా ఆమ్రేడితాలను నొక్కి చెప్పటానికి వాడుతాం. కాని అవి తెలియకుండానే భాషకు అందాన్ని భావానికి ప్రాధాన్యాన్ని చేకూరుస్తాయి.
ఇక ఉదాహరణలు కోకొల్లలు.
నీళ్లు ‘సలసల’ కాగుతున్నాయి.
వాడు ‘చరచర’నడుచుకుంటూ వచ్చాడు.
తండ్రిని చూస్తే చాలు ఆ అబ్బాయి ‘గడగడ’ వణికికిపోతాడు- ఇది భయ సూచకం. అదే చలి బాధయితే అయ్యో పాపం చలికి ‘గజగజ’ వణికి పోతున్నాడు. 
కాయితం‘పరపర’చింపేశాడు,
’కసకస’కత్తితో పొడిచాడు.
’బుసబుస’కోపం పొంగుకు వచ్చింది.
ఆమె ‘రుసరుస’లాడుకుంటూ వెళ్లి పోయింది.
అమ్మాయి’గునగున’నడుస్తూ వస్తున్నది.
వాళ్లిద్దరేవో ‘గుసగుస’ లాడు కుంటున్నరు.ఇలా....
‘పకపక’ నవ్వేవాళ్లు కొంతమంది.
’గలగల’ నవ్వేవాళ్లు కొంతమంది.
మళ్లీ ఇదే ‘గలగల ‘గాజుల శబ్దానికివాడుతాం. అలాగే గలగలా నది ప్రవహిస్తున్నది అంటాం. 
శబ్ద సంబంధమైన ఆమ్రేడితాలు చాలానే ఉన్నాయి.
గజ్జెలు ‘ఘల్లుఘల్లు’ మన్నాయి.
’గణగణ’ గంట మ్రోగింది.’, ’బడబడ’చప్పుడు చేస్తూ రైలుపోతున్నది.
ఎవరో ‘దబదబ’తలుపు కొడుతున్నరు.
     ’టపటప’చినుకులు రాలినయ్.
    లేక పోతే ఆ తిట్లకు ఆమె కన్నుల నుండి ‘టపటప’ కన్నీట చుక్కలు రాలిపడినయ్.
జాతీయ జండా ‘రెపరెప’లాడుతున్నది. ఇలా చాలా సందర్భాలలో మనకు తెలియకుండానే ఆమ్రేడిత శబ్దాలు వాడుతాం.
క్రియా పదాలకు విశేషణాలుగానే ఆమ్రేడితాలు ఎక్కువగా వాడబడతాయి.’టకటక’ తలుపుకొట్టడానికీ,నడువడానికీ వాడటం జరుగుతుంది. 
’బిరబిర’,’జరజర’,’కరకర’,’మెరమెర’,’పెరపెర’,’గరగర’,చరచర’,చురచుర’,’బరబర’,’బురబుర’,’సురసుర’,’పిటపిట’,’గుటగుట’,’గటగట’,పటపట’,’వటవట’,’వెలవెల’,’ఫెళఫెళ’’,’కిచకిచ’,’కిలకిల’,’మలమల’,’బొలబొల’,’ములముల’,’కులకుల’,’పలపల’,’వలవల’,’విలవిల’,’ఢమఢమ’,’తిమతిమ’,ధుమధుమ’,’ఘుమఘుమ’,’దబదబ’,’లబలబ’,’కుతకుత’,‘తుకతుక’,ఇలా వెతుకుతూ పోతే బోలెడన్ని ఆమ్రేడితాలు తెలుగు భాషా సౌందర్యానికి వన్నెలద్దుతాయి.
    అన్నం ఉడుకతుందిఅనడానికి, అన్నం ‘తుకతుక’ ఉడుకుతుంది అనటానికి భేదం మనకు తెలుసు.ఆమ్రేడితాలు చాలా సందర్భాలలో మాటల్లో దృశ్యీకరణ చేస్తాయి.లాక్కుపోవడానికీ ‘గొరగొర’ గుంజుకు పోయిండు అన్నదానికి సన్నివేశ చిత్రణలో మార్పు తెలుస్తుంది.బాధను వ్యక్తం చెయ్యడానికి ‘విలవిల’లాడిండు అంటాం.కోపం ప్రకటించడానికి -వాణ్ని ‘కరకర’ నమిలి మింగెయ్యాలన్నంత కోపం వచ్చింది అంటాం. అలాగే చురచుర చూసిండు అంటాం.
    కొన్ని ఆమ్రేడితాలు ఒక్కోసారి వేరువేరు సందర్భాలలో వాడటం జరుగుతుంది. చూశారా ‘వేరు వేరు’ కూడా ఆమ్రేడితమే. ‘గడగడ’ అనే దాన్ని  పాఠం చదవిండనీ చదవటానికీ,గడగడవణికి పోయిందని భయపడటానికీ, గడగడ గ్లాసుడు నీళ్లు తాగిండు అని తాగడానికీ వాడటం చేస్తుంటాం.ఏది ఏమైనా సర్వ సాధారణంగా పనిలోని వేగాన్ని, తీవ్రతను తెలియపరుస్తుంది ఆమ్రేడితం.బుర్రకథల్లో ఉత్ప్రేక్షగా
‘చరచరచరచర’ కత్తి దూసెరా
‘పటపటపటపట’ పండ్లు కొరికెరా
వంటి ప్రయోగాలున్నాయి.
ప్రారంభంలో నాంది వాక్యంగా రాసిన ప్రసిద్ధ గీతపాదం శంకరంబాడి సుందరాచారి రాసిన “మా తెలుగు తల్లికీ మల్లె పూదండ”లోనినదన్నది  అందరికీ తెలిసిన విషయమే.అందులోని గలగలా గోదారి,బిరబిరా కృష్ణమ్మ తెలుగు వారి నాలుకల మీద ఎప్పుడూ ఆడే ఆమ్రేడితాలు.
           ఆమ్రేడితాలను పద్యంలో పొందు పరచిన  కవులున్నారు.ఉదాహరణకు వానమామలై వరదాచార్యులు ఒక పద్యంలో
చం.జలజల పూలు రాలినటు చల్లనిమెల్లని పిల్ల తెమ్మెరల్
తెలతెలవాఱి  వీచినటు తియ్యని కమ్మని పాలమీగడల్
తొలితొలి తోడు విచ్చినటు తోరపు సిగ్గున ముగ్ధ కందొవల్
వలపుల జిమ్మినట్లు చెలువమ్మొలికించు భవత్కవిత్వముల్ .
ఆమ్రేడితాలుపయోగించడంతో  పద్యం శోభాయమానమైంది.
కామెంట్‌లు