భారతియార్ అంతిమయాత్రలో పాల్గొన్నవారు పద్నాలుగు మందే!:-- యామిజాల జగదీశ్
 'చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి' (1882 - 1921) ప్రముఖ కవి, రచయిత, పత్రికా సంపాదకుడు. స్వాతంత్ర్య సమరయోధుడు. సంఘసంస్కర్త. ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శిగా వినుతికెక్కిన భారతియార్ ఇప్పటి తూత్తుకుడి జిల్లాలోని ఎట్టయాపురంలో జన్మించారు. ఆయన తల్లి లక్ష్మీఅమ్మాళ్. తండ్రి   చిన్నసామి సుబ్రహ్మణ్య అయ్యర్. ఆయన ఐదో ఏట తల్లిని, పదహారో యేట తండ్రిని కోల్పోయారు. ఆయనకు పద్నాలుగో ఏట పెళ్ళయింది. ఆమె పేరు చెల్లమ్మ. అప్పుడామె వయస్సు ఏడేళ్ళు. ఆయనకు మూడు విదేశ భాషలతోసహా మొత్తం  ముప్పైరెండు భాషలు తెలుసు.   
పదకొండో యేటనే కవితలు చెప్పడం అలవరచుకున్న ఆయనకు “భారతి” అన్న బిరుదు విద్యలకు అధిదేవతైన సరస్వతీ దేవి పేరిట ప్రదానం చేశారు.
ఆయనకు 1921 సెప్టెంబరు ఒకటో తేదీన కడుపు నొప్పి తలెత్తింది. సన్నగా ఉండిన ఆయన దేహం ఈ కడుపునొప్పిని తట్టుకోలేకపోయింది. వ్యాది తీవ్రరూపం దాల్చింది. స్వదేశమిత్రన్ అనే పత్రిక నుంచి వచ్చిన కొందరు ఆయనను చూడటానికి వచ్చారు. అప్పుడు భారతియార్ వారితో మాట్లాడుతూ, తాను సెప్టెంబరు పన్నెండో తేదీన విధులకు హాజరవుతానని చెప్పారు. అయితే బాధాకరమైన విషయమేమిటంటే సరిగ్గా ఆ రోజే ఆయన దేహానికి అంత్యక్రియలు జరిగాయి. సెప్టెంబరు పదకొండో తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయనకు ఆరోగ్యం మరింత విషమించింది. అప్పుడు ఆయన వెంట కొందరు మిత్రులు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరైన నీలకంఠ బ్రహ్మచారి చెప్పిన విషయాలలోంచి కొన్ని మాటలు ఇక్కడ ఇస్తున్నాను......
శ్రీ ప్రకాశ్ సోదరుడైన హోమియోపతి డాక్టర్ జానకిరామన్ భారతియార్ ని చూడటానికి వచ్చారు. ఆయన భారతియార్ ని చూసి మీకెలా ఉంది అని అడిగారు. ఈ మాట వినడంతోనే భారతియార్ కు కోపం ఉప్పొంగింది.
 “నాకేమిటీ, నేను దర్జాగా ఉన్నాను. ఎవరికి ఆరోగ్యం బాగులేదు. మిమ్మల్నెవరు ఇక్కడికి రమ్మన్నారు....నన్నిలానే విడిచిపెట్టి వెళ్ళండి” అని అన్నారు.
ఇక చేసేదేమీ లేక డాక్టర్ జానకిరామన్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
అనంతరం భారతియార్ ఇంటికి దగ్గర్లో ఉండే ఓ మహిళ భారతియార్ ని చూడటానికి వచ్చారు. ఏంటీ నీకు ఆరోగ్యం బాగులేదటగా అని ఆమె అన్నారో లేదో భారతియార్ కు తెగ కోపం వచ్చింది.
ఎవరికి ఆరోగ్యం బాగులేదు....నేను బాగానే ఉన్నాను. నన్నిలాటి ప్రశ్నలతో విసిగించకండి....మీకందరికీ మరేమీ పని లేదా అని భారతియార్ పెద్దగా అరిచారు. ఆ తర్వాత భారతియార్ తన మిత్రులతో మాట్లాడుతూ, అమానుల్లాఖాన్ గురించి ఓ వ్యాసం రాయాలని ఉందన్నారట. ఈ అమానుల్లాఖాన్ మరెవరో కాదు. ఆఫ్గనిస్థాన్లో చక్రవర్తిగా ఉన్నారు. ఈ మాట తర్వాత ఆయన స్పృహ కోల్పోయారు. రాత్రి ఒకటి ముప్పైకి తుది శ్వాసవిడిచారు. ముప్పై తొమ్మిదో ఏట చనిపోయిన భారతియార్ అంతిమయాత్రకు కేవలం పద్నాలుగు మంది మాత్రమే హాజరయ్యారు. జాతీయ స్థాయిలో ఓ మహాకవిగా ప్రసిద్ధి పొందిన భారతియార్ అంతిమయాత్రకు హాజరైన పద్నాలుగు మందిలో ఇద్దరేమో బంధువులు. మరో ఇద్దరు మిత్రులు. మగిలిన పది మంది వివరాలు తెలియరాలేదు.
ఇదిలా ఉండగా, ట్రిప్లికేన్ లోని పార్థసారథి ఆలయ ఏనుగు తొక్కడంతో ఆయన  చనిపోయారని వ్యాపించిన వదంతలేవీ సరికావు. ఆయన ఏనుగు తొక్కడం వల్ల మరణించలేదు. ఆయనను ఏనుగు తొక్కిన మాటైతే నిజమే. కానీ ఆ దుర్ఘటన నుంచి ఆయన కోలుకున్నారు. ఆ తర్వాత కడుపు నొప్పితోనే ఆయన కన్ను మూసిన నిజాన్ని భారతియార్ పై పరిశోధనలు చేసిన వారు నిర్ధారించారు.

కామెంట్‌లు