"నాకప్పుడే తెలిసింది": -- యామిజాల జగదీశ్

 మార్క్ ట్వైన్ ప్రముఖ రచయిత. చమత్కారి. హాస్యరచనలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నారు. ఆయన అసలు పేరు సామ్యూల్ లాంగ్ హార్న్ క్లెమెన్స్. మార్క్ ట్వైన్ అనేది ఆయన కలం పేరు. ఈ కలం పేరుతోనే ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన తొలిరోజుల్లో ఓ ఉద్యోగంలో చేరారు. 
ఒకరోజు ఆయన తన పనిలో ఉండగా అటెండర్ వచ్చి "అయ్యా! మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు" అంటాడు.
"దేనికీ" అని అడుగుతారు మార్క్ ట్వైన్.
"తెలీదండి" అని అటెండర్ అనగానే సరే ఏంటో తెలుసుకోవడానికి యజమాని గదిలోకి వెళ్తారు మార్క్ ట్వైన్. 
"సార్. నన్ను రమ్మన్నారట" అంటారు మార్క్ ట్వైన్.
"అవును, నేనే రమ్మన్నాను. నిన్నీ ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. నువ్విక వెళ్ళొచ్చు" అని యజమాని కటువుగా అన్నారు.
"సరే సార్. కానీ అందుకు నిజమైన కారణమేంటో తెలుసుకోవాలనుంది. చెప్తారా" అని అడుగుతారు మార్క్ ట్వైన్.
అప్పుడు ఆ యజమాని "నువ్వు వొట్టి సోమరిపోతువి. దేనికీ పనికిరావు" అని తక్షణమే వెళ్ళిపో అంటారు. 
"అలాగేనండి" అన్న మార్క్ ట్వైన్ "నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు నాకన్నా దారుణమైన వారండీ. నేను సోమరిపోతునీ. ఎందుకూ పనికి రానని తెలుసుకోవడానికి మీకు ఆరు నెలలు పట్టింది. కానీ మీ విషయం నేనిక్కడ పనిలో చేరిన మొదటిరోజే తెలిసింది" అని బయటకు వచ్చెస్తారు.